మంచి పుస్తకం-సత్యాన్వేషి చలం (డా.వాడ్రేవు వీరలక్ష్మీ దేవి )

చలం తన జీవితకాలంలో ఎంతో సాహిత్యాన్ని సృజించాడు. అదంతా ఒక సాగరం . ఈ రచనలో  ఆ సాగరాన్ని ఒడిసి పట్టారు రచయిత్రి వాడ్రేవు వీరలక్ష్మీ దేవి .

ఈవిడ చాలా  ఉత్తమాభిరుచి కలిగిన రచయిత్రి. చలం మీద ఇదొక సిద్ధాంత గ్రంథం, ఇదొక ఫరిశోధనా గ్రంధం. చలం అంటే ఎనలేని గౌరవం, అభిమానం కలిగిన వారు ఆంధ్రదేశం లో ఎందరో ఉన్నారు. వారిలో ఈవిడ కూడా ఒకరు.

‘చలం సాహిత్యం లో ఏ ఒక్క పుస్తకమో చదివితే చలం గురించి, చలం భావాల గురించి ఏమీ అర్థం కాదు. పైగా  అది చలం గురించి అనేక అపార్థాలకే దారి తీస్తుంది. ఆయనను విమర్శంచే వారిలో ఎక్కువమంది ఈ కోవకు చెందినవారే. చలాన్ని సరిగా అర్ధం చేసుకోవాలంటే అయన రచనలను అన్నింటినీ అధ్యయనం చేయాలి. అప్పుడే చలం తన జీవితమంతా నిరంతర సత్యాన్వేషణ నెరపాడనే విషయం మరియు ఈ అన్వేషణలో ఆయన కాలనుగుణంగా  క్రమపరిణామం చెందాడనే విషయం మనకు బోధపడుతుంది ‘ అన్న విషయాన్ని రచయిత్రి నిరూపించిన విధానం నిరుపమానం. రచయిత్రి అసమాన ప్రతిభను కనపరిచారు.

చలం గురించి ఎటువంటి అపార్థాలకూ తావు లేకుండా ఆయనను, ఆయన భావాలను సరిగా అర్థం చేసుకోవటానికి ఆవిడ మన తరపున చలం సాహిత్యాన్నంతా చదివి, అర్థం చేసుకుని మనకు దాని సారాన్ని అందించారేమో అనే భావన మనకు కలుగుతుంది. ఒకరకంగా తన జీవితమంతా స్త్రీ స్వేచ్చ గురించే సాహితీ యుద్ధం చేసిన చలానికి స్త్రీ జాతి తరఫున రచయిత్రి అందించిన నివాళిగా ఈ రచనను మనం భావించవచ్చు. రచనా ప్రమణాలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. ఈ గ్రంథం చదివిన తరువాత మనకు చలం జీవితం తోపాటు ఆయన సాహిత్యమంతటి యెడల, ఆయన భావాల యెడల పూర్తి అవగాహన కలుగుతుంది.

ఇది 285 పేజీల గ్రంధం. వెల రూ.125/-  ఈ పుస్తకం  ‘విశాలాంధ్ర ‘ లో లభిస్తున్నది. చలం రచనలు ప్రచురించే ‘అరుణా పబ్లిషింగ్ హౌస్ ‘, విజయవాడ వారిని సంప్రదించైనా ఈ పుస్తకాన్ని పొందవచ్చు.

మంచి పుస్తకం-యం.యన్.రాయ్ స్వీయ గాథలు (ఆత్మ కథ)

గాంధీ, నెహ్రూ, బోస్ మొదలైన వారి గురించి తెలిసినంతగా యం.యన్.రాయ్ గురించి ప్రజా బాహుళ్యానికి తెలియదు. ఈయన ఒక మహానాయకుడు. అత్యంత ప్రతిభావంతుడు. ఈయన ఆత్మకథ స్వీయగాథలు మేథావి వర్గం లో సుప్రసిద్ధం. ఇది కొంచెం పెద్ద గ్రంథమనే చెప్పాలి. ఈ గ్రంథం విశిష్టత ఏమిటంటే యం.యన్.రాయ్ తన బాల్య జీవితం గురించి ప్రస్తావించక పోవటం. ఒకేసారి తన క్రియాశీల జీవితం మొదలైన దగ్గర నుండే రాయ్ ఈ స్వీయ గాథలను ప్రారంభించారు. బాల్య జీవితం తన వ్యక్తిగతమైనది. దానితో ప్రజలకు పనిలేదు. తన ప్రజా జీవితం గురించి మాత్రమే ప్రజలకు తెలియజేయలనేది రాయ్ అభిప్రాయం.

ఈ గ్రంథం చదివేకొలదీ రాయ్ తన జీవితంలో చేసిన సాహసాలు, సాధించిన విజయాలను తెలుసుకుని మనకు అబ్బురం కలుగుతుంది. రాయ్ చాలా సులువైన శైలిలో, ప్రతి విషయాన్నీ సునిశితంగా వివరిస్తూ, అత్యంత ఆసక్తికరమైన రచనా శైలితో ఈ గ్రంథాన్ని రచించారు.

రాయ్  బెంగాల్ లో జన్మించారు. ఈయన అసలు పేరు నరేంద్ర నాథ్ భట్టాచార్య. తరువాత పరిస్థితులననుసరించి ఒకసారి మానవేంద్ర నాథ్ రాయ్ గా పేరు మార్చుకోవలసి వచ్చింది.అదే పేరు స్థిరపడిపోయి యం.యన్.రాయ్ గా ఈయన సుప్రసిద్దులయ్యారు.

యువకుడుగా ఉన్న సమయంలో ఈయనొక విప్లవకారుడు. ‘వందేమాతర ఉద్యమ ‘ సమయంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా భారత దేశంలో ముఖ్యంగా బెంగాల్లో జనించిన  ఉగ్రవాదం వైపు మళ్ళిన అనేక మంది యువకులలో ఈయన కూడా ఒకరు. తన ఉగ్రవాద బృందానికి ఆయుధాలు సమకూర్చే నిమిత్తం ఈయన దేశం విడిచి పెట్టారు. ఆ విధంగా ఉగ్రవాదిగా విదేశాలకు చేరిన ఈయన జీవితం అనేక మలుపులు తిరిగి అంతర్జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పగలిగిన మేటి గా రూపొందారు. ఆ సమయంలో భారత దేశం లోని జనసామాన్యానికి దేశరాజకీయాలను నడిపిస్తున్న గాంధీ,నెహ్రూ వంటి నాయకులే తెలుసు. కానీ ఒక భారతీయ యువకుడు అంతర్జాతీయ రాజకీయాలను ప్రభావితం చేయగలిగేటంతగా ఎదిగాడని అతి కొద్ది మందికే తెలుసు.

రాయ్ మొదట అమెరికా నుండి మెక్సికో వెళ్ళి అక్కడ ఆశ్రయం పొంది ఆదేశ రాజకీయాలలో చురుకైన పాత్ర పోషించారు. ఆ సమయంలోనే రష్యా అధ్యక్షుడు లెనిన్ దృష్టిలో పడ్డారు. ఆయన పిలుపుతో రష్యా చేరుకుని అచటి రాజకీయాలలో మరియు అంతర్జాతీయ కమ్యూనిష్టు ఉద్యమ వేదిక ఐనటువంటి కమ్యూనిష్టు ఇంటెర్నేషనల్ (కొమింటర్న్) కార్యకలాపాలలో రాయ్ క్రియాశీల పాత్ర పోషించారు.

ఈయన గొప్ప రచయిత. ‘ఇండియా ఇన్ ట్రాన్సిషన్ ‘ మరియు ‘రెవల్యూషన్ అండ్ కౌంటర్ రెవల్యూషన్ ఇన్ చైనా ‘ అనే గ్రంథాలతో పాటు మరికొన్ని గ్రంథాలను కూడ రచించారు. రాయ్ రచనలు అనేక యూరోపియన్ భాషలలోకి అనువదింపబడి ఆయా దేశాలలో ప్రభంజనాన్ని సృష్ఠించాయి. రాయ్ గొప్ప రచయిత మాత్రమే కాదు, బహుభాషా కోవిదుడు కూడా. ఏ కొత్త భాషైనా ఈయన ఒక నెలలోపే నేర్చుకోగలిగేవాడని ప్రతీతి.లెనిన్ లాంటి మహానాయకుడు రాయ్ అభిప్రాయాలకు ఎనలేని ప్రాధాన్యత ఇచ్చేవాడు. లెనిన్ మరణానంతరం స్టాలిన్ గద్దె నెక్కడంలో రాయ్ కీలక పాత్ర పోషించాడు. భారత కమ్యూనిష్టు పార్టీని స్వదేశంలో ఇంకా స్థాపించక ముందే ఈయన తాష్కెంట్లో స్థాపించాడు. భారతదేశంలోని బ్రిటిష్ పాలనను పారద్రోలటానికి రష్యా సహాయంతో అనేక ఆయుధాలతో, పెద్ద  సైనిక బలగంతో దేశం మీదికి దండెత్తాలని ఈయన బయలుదేరాడు. కానీ ఆ ప్రయత్నం మార్గమధ్యంలోనే విఫలమైనది.

తన జీవితంలో అధికభాగం కమ్యూనిష్టుగా గడిపిన రాయ్ చివరి కొద్ది కాలం కమ్యూనిజాన్ని వ్యతిరేకించి హ్యూమనిజం అనే నూతన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అందుకే నేటి కమ్యూనిష్టులు రాయ్ ను తమ నాయకుడిగా చెప్పుకోరు. అలానే ఆయన భారత స్వాతంత్ర్య ఉద్యమంలో కన్నా అంతర్జాతీయ రాజకీయాలలోనే ఎక్కువ కృషి చేయటంతో కాంగ్రెస్ నాయకులూ రాయ్ ను తమ వాడిగా చెప్పుకోరు. అందుకే రాయ్ ప్రజల మనిషిగా కాక మేథావుల మనిషిగానే మిగిలిపోయారు.

ఈయన స్వీయ గాథలను ఆంధ్ర దేశంలోని ఈయన అనుచరులు చాలా కాలం క్రిందట  తెలుగులోకి అనువదించి ముద్రించారు. దానిని గ్రంథాలయంలో సంపాదించి నేను చదవటం జరిగింది. భారత దేశ నాయకుల ఆత్మకథలలో మహాత్మా గాంధి ఆత్మకథ తరువాత తిరిగి అంతటి ప్రమాణాలు కలిగిన ఆత్మకథగా దీనిని చెప్పుకుంటారు. మీకు ఆసక్తి ఉంటే గ్రంథాలయాలలో ప్రయత్నించండి.

 

ఈ గ్రంథం యొక్క ఆంగ్లమూలాన్ని ఇక్కడ చదవండి

 

 

 

మంచి పుస్తకం-గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ (జవహర్ లాల్ నెహ్రూ)

చరిత్ర అంటే బోర్ సబ్జెక్ట్. రాజవంశాలను,రాజుల క్రమాన్ని,వారందరి పేర్లను గుర్తు పెట్టుకోవాలి. ఏ యుద్ధం ఎప్పుడు జరిగినదో ఆయా సంవత్సరాలన్నింటినీ గుర్తుంచుకోవాలి. ఇంత బోర్ సబ్జెక్టు ను కూడా కొంతమంది ఆసక్తికరంగా చెప్పగలరు. వారిలో జవహర్ లాల్ నెహ్రూ ఒకరు.

ఈయన తన కుమార్తె ఇందిరకు భారతదేశ చరిత్ర తో పాటు ప్రపంచ చరిత్ర యెడల అవగాహన కలిగించాలని సంకల్పించారు. ఇందుకొరకు ఆయన జైలులో ఉన్నపుడు దొరికిన ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఆ సమయంలో ఆయన తన కుమార్తె కు రెండు మూడు రోజులకు ఒక ఉత్తరం చొప్పున మూడు నాలుగు సంవత్సరాలు నిరాటంకంగా వ్రాసారు. ఇవి మొత్తం 196 ఉత్తరాలు. ఈ జాబుల పరంపర 1930 వ సవత్సరం అక్టోబర్ నెలలో మొదలై 1933 ఆగస్ట్ వరకూ కొనసాగింది.

తదనంతర కాలంలో ఈ జాబులన్నీ గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ పేరుతో వేయి పేజీల ఒక పెద్ద గ్రంథం గా ప్రచురింపబడ్డాయి. ఆక్స్ ఫర్డ్  యూనివర్సిటీ ప్రెస్ వారు ఈ గ్రంథాన్ని చాలా కాలంపాటు సబ్సిడీ ధరకు అందించారు. ఐతే ఇటీవలి కాలంలో ఈ ప్రతులు మార్కెట్లో లభించుట లేదు. ప్రస్తుతం పెంగ్విన్ వారి ప్రతులే  అందుబాటులో ఉన్నయి. ఐతే అవి కొంచెం ధర ఎక్కువ. నెహ్రూ గారి రచన కనుక ఈ పుస్తకం ఏ గ్రంథాలయం లోనైనా లభించగలదు. ఈ ఉత్తరాలు  ఆంగ్ల భాషలో వ్రాయబడ్డాయి. ఐతే అవన్నీ పదమూడేళ్ళ వయసులో ఉన్న తన చిన్నారి కుమార్తెను ఉద్దేశించినవి కనుక నెహ్రూ వీటిలో చాలా సులువైన భాషనే ఉపయోగించారు. సాధారణమైన ఆంగ్ల భాషా పరిజ్ఞానం ఉన్నవారు సైతం వీటిని చదివి అర్ధం చేసుకోవచ్చు.

ఈ గ్రంథం చదివేటపుడు నెహ్రూలో మనకు ఒక అంతర్జాతీయ స్థాయి నాయకుడు కాక తన కుమార్తెను ఒక గొప్ప నాయకురాలిగా తీర్చిదిద్దాలని తపనపడే ఒక తండ్రి మాత్రమే  కనిపిస్తాడు. ఈ గ్రంథం ఏ మాత్రం విసుగనిపించదు. సంవత్సరాలను అవసరమైనంత మేరకే సాధ్యమైనంత తక్కువగా పేర్కొంటూ చరిత్రలో అసలేమి జరిగింది అన్నదానికే ప్రాధాన్యతనిస్తూ చాలా ఆసక్తికరంగా నెహ్రూ దీన్ని రచించారు. ఈ గ్రంథాన్ని చదివే కొలదీ ఇంకా ఇంకా తెలుసుకోవాలనే తపనను మనలో కలుగజేస్తూ ఉంటుంది.

జవహర్ లాల్ నెహ్రూ ఈ గ్రంథం తో పాటు తన ఆత్మ కథ ఐన యాన్ ఆటోబయోగ్రఫీ అనే గ్రంథాన్నీ  మరియూ భారత దేశ చరిత్రను,దాని యొక్క పురాతన వైభవాన్ని, దాని ఘన సంస్కృతిని మిగతా ప్రపంచానికి తెలియచేయాలనే ఉద్దేశ్యంతో డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే గ్రంథాన్నీ కూడా రచించారు. ఐతే ఈ మూడింటిలో ‘గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ ‘అనబడే ఈ గ్రంథమే అత్యంత ప్రజాదరణ పొందినది.

ఈ గ్రంథం చదివిన తరువాత ఎవరికైనా ప్రపంచ చరిత్ర గురించి పూర్తి అవగాహన కలుగుతుంది. ఒక్క భారతదేశ యువతకే కాక యావత్ ప్రపంచ దేశాలలోని యువత మొత్తానికీ ఉపయుక్తమయ్యే విధంగా ఈ ఉత్తరాలను రచించి నెహ్రూ ఒక అంతర్జాతీయ స్థాయి నాయకుడిగా తన స్థానాన్నీ,స్థాయినీ ఇనుమడింప చేసుకున్నారు.

ఈ గ్రంథాన్ని ఇక్కడనుండి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోండి

మంచి పుస్తకం-భారత జాతికి నా హితవు(స్వామి వివేకానంద)

మంచి పుస్తకం శీర్షికతో మీకు నేను చదివిన వాటిలో కొన్ని మంచి పుస్తకాలను,ఆయా పుస్తకాలు దొరికే ప్రదేశాలను మరియు కొన్ని మంచి పుస్తక ప్రచురణ సంస్థలను పరిచయం చేద్దామనుకుంటున్నాను.

సాధారణంగా పత్రికలలో వచ్చే సమీక్షలు మార్కెట్లో కొత్తగా విడుదలైన పుస్తకాలకే రాస్తారు. అది కూడా విడుదలైన ప్రతి పుస్తకానికీ రాస్తారు. మనం వాటిలోనుండి చదువదగ్గ దానిని, బాగున్నదానిని ఎంచుకోవటం కష్టం. అందుకే నేను ఈ శీర్షిక పుస్తక ప్రియులకు ఉపయుక్తంగా ఉంటుందని వ్రాస్తున్నాను. అలాగే మీ అభిప్రాయాలతో పాటు మీరు చదివిన మంచి పుస్తకాలను కూడా సూచించగలరు.

ముందుగా వివేకానందుని బోధనల సంగ్రహ సంకలనమైన భారత జాతికి నా హితవు అనే పుస్తకం గురించి పరిచయం చేస్తాను. దీనిని రామకృష్ణ మఠం వారు ప్రచురించారు. ఈ పుస్తకం మన జేబులో పెట్టుకోదగిన పరిమాణంలోనే ఉంటుంది. ఇది ఆంగ్ల భాషలోని ‘స్వామి వివేకానంద-హిజ్ కాల్ టు ద నేషన్ ‘ అనే చిరు గ్రంథానికి అనువాదం.  అసలు వివేకానందుని బోధనలున్న పుస్తకమేదైనా యువకులను ఎంతగా ఆకట్టుకుంటుందో, వారిని ఎంతగా ఉత్తేజితులను చేస్తుందో అందరికీ తెలుసు. ఐతే వాటన్నింటిలో కూడ ఈ పుస్తకం ఎన్నదగినది. ఈ చిరు గ్రంథం ఆ మహానుభావుడు బోధించిన అనేకానేక విషయాలలో ఏదో ఒక ప్రత్యేక విషయానికి సంబంధించినదిగా కాక దాదాపు ఆయన బోధనలన్నింటినీ సంగ్రహంగా తెలియచేస్తుంది. ఆయన జీవిత కథ కూడా ఇందులో పొందుపరచబడి ఉన్నది. ఈ పుస్తకం బహుళ ప్రాచుర్యం పొందినది. ఎందరో యువకులు మరియు పెద్దలు ఈ పుస్తకాన్ని తమకు తెలిసిన వారికి బహుమతిగా ఇస్తుంటారు. అందుకొరకే రామకృష్ణ మఠం వారు ఈ పుస్తకాన్ని సబ్సిడీ ధరతో మూడు రూపాయలకే అందిస్తున్నారు. దీనిని పదుల సంఖ్యలో పంచే వారు ఎందరో ఉన్నారు. రామకృష్ణ మఠం వారి విక్రయశాలలలో మరియు విశాలాంధ్ర లాంటి ప్రఖ్యాత బుక్ స్టాల్స్ లో ఈపుస్తకం లభ్యమౌతుంది.

Newer entries »