మంచి పుస్తకం-యం.యన్.రాయ్ స్వీయ గాథలు (ఆత్మ కథ)

గాంధీ, నెహ్రూ, బోస్ మొదలైన వారి గురించి తెలిసినంతగా యం.యన్.రాయ్ గురించి ప్రజా బాహుళ్యానికి తెలియదు. ఈయన ఒక మహానాయకుడు. అత్యంత ప్రతిభావంతుడు. ఈయన ఆత్మకథ స్వీయగాథలు మేథావి వర్గం లో సుప్రసిద్ధం. ఇది కొంచెం పెద్ద గ్రంథమనే చెప్పాలి. ఈ గ్రంథం విశిష్టత ఏమిటంటే యం.యన్.రాయ్ తన బాల్య జీవితం గురించి ప్రస్తావించక పోవటం. ఒకేసారి తన క్రియాశీల జీవితం మొదలైన దగ్గర నుండే రాయ్ ఈ స్వీయ గాథలను ప్రారంభించారు. బాల్య జీవితం తన వ్యక్తిగతమైనది. దానితో ప్రజలకు పనిలేదు. తన ప్రజా జీవితం గురించి మాత్రమే ప్రజలకు తెలియజేయలనేది రాయ్ అభిప్రాయం.

ఈ గ్రంథం చదివేకొలదీ రాయ్ తన జీవితంలో చేసిన సాహసాలు, సాధించిన విజయాలను తెలుసుకుని మనకు అబ్బురం కలుగుతుంది. రాయ్ చాలా సులువైన శైలిలో, ప్రతి విషయాన్నీ సునిశితంగా వివరిస్తూ, అత్యంత ఆసక్తికరమైన రచనా శైలితో ఈ గ్రంథాన్ని రచించారు.

రాయ్  బెంగాల్ లో జన్మించారు. ఈయన అసలు పేరు నరేంద్ర నాథ్ భట్టాచార్య. తరువాత పరిస్థితులననుసరించి ఒకసారి మానవేంద్ర నాథ్ రాయ్ గా పేరు మార్చుకోవలసి వచ్చింది.అదే పేరు స్థిరపడిపోయి యం.యన్.రాయ్ గా ఈయన సుప్రసిద్దులయ్యారు.

యువకుడుగా ఉన్న సమయంలో ఈయనొక విప్లవకారుడు. ‘వందేమాతర ఉద్యమ ‘ సమయంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా భారత దేశంలో ముఖ్యంగా బెంగాల్లో జనించిన  ఉగ్రవాదం వైపు మళ్ళిన అనేక మంది యువకులలో ఈయన కూడా ఒకరు. తన ఉగ్రవాద బృందానికి ఆయుధాలు సమకూర్చే నిమిత్తం ఈయన దేశం విడిచి పెట్టారు. ఆ విధంగా ఉగ్రవాదిగా విదేశాలకు చేరిన ఈయన జీవితం అనేక మలుపులు తిరిగి అంతర్జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పగలిగిన మేటి గా రూపొందారు. ఆ సమయంలో భారత దేశం లోని జనసామాన్యానికి దేశరాజకీయాలను నడిపిస్తున్న గాంధీ,నెహ్రూ వంటి నాయకులే తెలుసు. కానీ ఒక భారతీయ యువకుడు అంతర్జాతీయ రాజకీయాలను ప్రభావితం చేయగలిగేటంతగా ఎదిగాడని అతి కొద్ది మందికే తెలుసు.

రాయ్ మొదట అమెరికా నుండి మెక్సికో వెళ్ళి అక్కడ ఆశ్రయం పొంది ఆదేశ రాజకీయాలలో చురుకైన పాత్ర పోషించారు. ఆ సమయంలోనే రష్యా అధ్యక్షుడు లెనిన్ దృష్టిలో పడ్డారు. ఆయన పిలుపుతో రష్యా చేరుకుని అచటి రాజకీయాలలో మరియు అంతర్జాతీయ కమ్యూనిష్టు ఉద్యమ వేదిక ఐనటువంటి కమ్యూనిష్టు ఇంటెర్నేషనల్ (కొమింటర్న్) కార్యకలాపాలలో రాయ్ క్రియాశీల పాత్ర పోషించారు.

ఈయన గొప్ప రచయిత. ‘ఇండియా ఇన్ ట్రాన్సిషన్ ‘ మరియు ‘రెవల్యూషన్ అండ్ కౌంటర్ రెవల్యూషన్ ఇన్ చైనా ‘ అనే గ్రంథాలతో పాటు మరికొన్ని గ్రంథాలను కూడ రచించారు. రాయ్ రచనలు అనేక యూరోపియన్ భాషలలోకి అనువదింపబడి ఆయా దేశాలలో ప్రభంజనాన్ని సృష్ఠించాయి. రాయ్ గొప్ప రచయిత మాత్రమే కాదు, బహుభాషా కోవిదుడు కూడా. ఏ కొత్త భాషైనా ఈయన ఒక నెలలోపే నేర్చుకోగలిగేవాడని ప్రతీతి.లెనిన్ లాంటి మహానాయకుడు రాయ్ అభిప్రాయాలకు ఎనలేని ప్రాధాన్యత ఇచ్చేవాడు. లెనిన్ మరణానంతరం స్టాలిన్ గద్దె నెక్కడంలో రాయ్ కీలక పాత్ర పోషించాడు. భారత కమ్యూనిష్టు పార్టీని స్వదేశంలో ఇంకా స్థాపించక ముందే ఈయన తాష్కెంట్లో స్థాపించాడు. భారతదేశంలోని బ్రిటిష్ పాలనను పారద్రోలటానికి రష్యా సహాయంతో అనేక ఆయుధాలతో, పెద్ద  సైనిక బలగంతో దేశం మీదికి దండెత్తాలని ఈయన బయలుదేరాడు. కానీ ఆ ప్రయత్నం మార్గమధ్యంలోనే విఫలమైనది.

తన జీవితంలో అధికభాగం కమ్యూనిష్టుగా గడిపిన రాయ్ చివరి కొద్ది కాలం కమ్యూనిజాన్ని వ్యతిరేకించి హ్యూమనిజం అనే నూతన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అందుకే నేటి కమ్యూనిష్టులు రాయ్ ను తమ నాయకుడిగా చెప్పుకోరు. అలానే ఆయన భారత స్వాతంత్ర్య ఉద్యమంలో కన్నా అంతర్జాతీయ రాజకీయాలలోనే ఎక్కువ కృషి చేయటంతో కాంగ్రెస్ నాయకులూ రాయ్ ను తమ వాడిగా చెప్పుకోరు. అందుకే రాయ్ ప్రజల మనిషిగా కాక మేథావుల మనిషిగానే మిగిలిపోయారు.

ఈయన స్వీయ గాథలను ఆంధ్ర దేశంలోని ఈయన అనుచరులు చాలా కాలం క్రిందట  తెలుగులోకి అనువదించి ముద్రించారు. దానిని గ్రంథాలయంలో సంపాదించి నేను చదవటం జరిగింది. భారత దేశ నాయకుల ఆత్మకథలలో మహాత్మా గాంధి ఆత్మకథ తరువాత తిరిగి అంతటి ప్రమాణాలు కలిగిన ఆత్మకథగా దీనిని చెప్పుకుంటారు. మీకు ఆసక్తి ఉంటే గ్రంథాలయాలలో ప్రయత్నించండి.

 

ఈ గ్రంథం యొక్క ఆంగ్లమూలాన్ని ఇక్కడ చదవండి

 

 

 

5 వ్యాఖ్యలు

  1. cbrao said,

    జూలై 11, 2008 వద్ద 11:06 ఉద.

    @సరస్వతికుమార్: ఈ సమీక్ష బాగుంది. దీప్తిధార లో పునః ప్రచురించవచ్చునా (With due credits to you)?
    నా చిరునామాకు అనుమతి పత్రం పంపగలరు.

  2. జూలై 18, 2008 వద్ద 12:57 ఉద.

    భట్టిప్రోలు హనుమంత రావు తెలుగులొ అనువదించగా తెనాలి లొ రాడికల్ హుమనిస్త్ కోగంటి రాధాక్రిష్నమూర్తి 1960 లొ ప్రచురించారు.రాయ్ 1924 వరకే రాసి చనిపోయారు.
    ఎన్.ఇన్నయ్య

  3. జూలై 18, 2008 వద్ద 1:02 ఉద.

    M N Roy narrated his memoirs to his wife Ellen in Dehradun while recovering from head injury. This was serialized in Radical Humanist weekly from Kolkata during 1952.Allied Publishers in Bombay brought out this book during 1960s.Roy narrated upto the death of Lenin 1924 only. He did not mention the role of his first wife Evelyn Trent, stanford graduate who played important role along with him in Mexico,Moscow, Tashkent and Europe. She was known as Santi Devi. She was the founder member of Indian communist party established at Tashkent in 1922 along with Roy. The reasons for not mentioning her is not known.

  4. saraswathikumar said,

    జూలై 18, 2008 వద్ద 1:35 సా.

    పెద్దలు ఇన్నయ్య గారికి నమస్కారాలు. మీ స్పందనకు ధన్యవాదాలు. మీరిచ్చిన సమాచారానికి కృతజ్ఞతలు.తెలుగు అకాడమీ వారి కోసం మీరు రాసిన ‘యం.యన్.రాయ్ జీవిత చరిత్ర ‘ను కూడా నేను చదివాను.అది నా వ్యక్తిగత గ్రంథాలయంలో ఇప్పటికీ పదిలంగా ఉన్నది.

  5. halley said,

    డిసెంబర్ 19, 2011 వద్ద 9:35 ఉద.

    నేను యం.యెన్.రాయ్ రాసిన “న్యూ హుమనిసం” చదివాను. చాలా మంచి పుస్తకం. మీరు చెప్పిన ఈ పుస్తకం కూడా చదవటానికి ప్రయత్నిస్తాను.


వ్యాఖ్యానించండి