ప్రేమవిజేత కావాలంటే చదవండి The Art of Love

మనిషి ఈ భూమండలాన్ని అంతం చేయగలడు, కానీ ఆ మనిషినే అంతం చేయగల శక్తి ప్రేమకు ఉంది.

ఓ మనిషి మరో మనిషి మీద చూపించే మమకారాన్ని, అనురాగాన్ని మనం ‘ ప్రేమ’ అంటాం. ఐతే స్త్రీ, పురుషుల మధ్యన ఉండే ఆకర్షణే పునాదిగా ఏర్పడిన ప్రేమ ప్రత్యేకమైనది.

ఆడ, మగ ఈ సృష్టిలో ప్రకృతీ పురుషులకు ప్రతీకలు. వీరి మధ్యన ఉండే ఆకర్షణ ప్రకృతి సహజమైనది. వీరిరువురి కలయిక కారణంగానే భూమి మీద ఒక జాతి మనుగడ కాలంతో పాటు కొనసాగుతూ ఉంటుంది.

జంతులోకంలో ఈ కలయిక ఉద్దేశం కేవలం సంతానాభివృద్దే. కానీ సృష్టిలో ఒక్క మనిషి విషయంలో మాత్రమే ఈ కలయిక కేవలం సంతానాభివృద్ధికే కాక, అంతకన్నా ఎక్కువగా సౌఖ్యానికీ, సంతోషానికీ; మరీ ముఖ్యంగా జీవితానికో తోడు దొరకడానికీ మూలంగా నిలబడింది. అందుకే మనిషి విషయంలో ఈ ఆడ, మగ ఆకర్షణ ప్రేమ స్థాయికి ఎదిగింది.

స్త్రీ పురుషులకు ఒకరిపై మరొకరికి ప్రేమ జనించి, ఒకరినొకరు ఇష్టపడుతున్నప్పటికీ వారిరువురూ పరస్పరం చేరువవ్వాలంటే ఇరువురికీ కొంత ధైర్యం, కొంత చాకచక్యం అవసరం. మరిముఖ్యంగా ఈ విషయంలో ముందుగా చొరవ చేయాల్సింది మాత్రం పురుషుడే.

ఐతే ఆ పురుషుడు ప్రేమవ్యవహారాన్ని నడపలేని artless person ఐతే మాత్రం అతడు మూగప్రేమలో చిక్కుకుపోతాడు, ఎప్పటికీ తన ప్రేమను వ్యక్తం చేయలేడు. చేతికందే దూరంలో ఉన్న ప్రేమను కూడా అందుకోలేడు. తన ఆకాంక్షనూ నెరవేర్చుకోలేడు, ఆమె ఆశనూ ఈడేర్చలేడు.

ఇలాంటి వాడే మరొకడు తన ప్రేమను అసందర్భంగా వ్యక్తం చేసి, తిరస్కారాన్ని పొంది, మనశ్శాంతిని కోల్పోతాడు. ఒక్కోసారి ప్రాణాల మీదకు కూడా తెచ్చుకుంటాడు.

ఇటువంటి artless person ను artful person గా మార్చే పరసువేది ఈ ‘The Art of Love’.

స్త్రీ పురుషులు పరస్పరం దగ్గరవటం అనేది సులువుగా, సజావుగా, ఎటువంటి దుష్పరిణామాలకూ దారితీయకుండా జరగడానికి కావలసిన మార్గదర్శకాలను వివరిస్తూ, ప్రాచీన రోమన్ సామ్రాజ్యానికి (నేటి ఇటలీ) చెందిన కవి అయిన ఒవిడ్ (Ovid 43 B.C.–A.D. 17) ‘The Art of Love’ అనే ఈ చిరుగ్రంథాన్ని ‘ఆర్స్ అమటోరియా’ (Ars amatoria or Ars amoris) పేరుతో, క్రీస్తు పూర్వం 1 లో రచించాడు. ఇది లాటిన్‌భాషలో, కవితారూపంలో ఉండి మూడు భాగాలుగా ఉంటుంది. మొదటి రెండు భాగాలూ పురుషులను ఉద్దేశించి రాసినవి. మూడవ భాగం స్త్రీలను ఉద్దేశించి ఉంటుంది.

భారతీయ సాహిత్యంలోని వాత్సాయన కామసూత్రాలలో ఇటువంటి మార్గదర్శకత్వం మనకు లభించదు. ఆ గ్రంథం కేవలం రతిభంగిమల మూలంగానే అంత ప్రాచుర్యంలోకి వచ్చింది. ఆ గ్రంథంలో కూడా వాత్సాయనుడు కొన్ని seduction tips ఇవ్వటానికి ప్రయత్నించాడు. కానీ అవేవీ కూడా ఒవిడ్ ‘The Art of Love’లో ఉన్నంత విశదంగానూ, ఒక క్రమ పద్దతిలోనూ, ఆచరణయోగ్యంగానూ ఉండవు.

కామసూత్రాలలోని వశీకరణ ప్రకరణంలో వాత్సాయనుడు, కోరుకున్న వారిని లోబరుచుకోవడానికి కొన్ని మందుల్ని, మాకుల్నీ సూచించాడు. అవేవీ కూడా ఈ ఆధునిక కాలానికి తగినటువంటివి కావు. అదే సమయంలో ఒవిడ్ వశీకరణ ప్రక్రియనంతా (seduction process) కాలాతీతమైన మానవ స్వబావం (human psychology) ఆధారంగా వివరించాడు.

ఒక స్త్రీని గెలుచుకోవాలని భావించే పురుషుడు చతుష్షష్ఠీ కళాకోవిదుడై ఉండాలని వాత్సాయనుడు చెప్పాడు, కొంచెం శుచీ శుభ్రంగా ఉంటే చాలని ఒవిడ్ చెప్పాడు.

దేశ విదేశాలకు చెందిన స్త్రీలను, వాళ్ళ స్వబావాలనూ వాత్సాయనుడు పేర్కొన్నాడు, నీకు కావాల్సిన సుందరీమణి నీ చుట్టు పక్కలనే ఉంటుందని ఒవిడ్ చెప్పాడు.

రోమన్ సామ్రాజ్యాన్ని అగస్టస్ చక్రవర్తి పరిపాలించిన కాలం లాటిన్‌సాహిత్యానికి స్వర్ణయుగంగా భావిస్తారు. ఒవిడ్ ఆ స్వర్ణయుగానికి చెందిన కవి.

స్త్రీ పురుషుల మధ్యన జనించే ప్రేమకు, వారి మధ్యన నడిచే ప్రేమవ్యవహారానికి సంబంధించిన అనేక అంశాలను స్పృశించిన ఒవిడ్ రచనలు ఆయన జీవిత కాలంలోనే ఎనలేని కీర్తిని ఆర్జించాయి. ఆ కీర్తి ఆయన మరణానంతరం కూడా కొనసాగటమేకాక అంతకంతకూ పెరిగింది, నేటికీ పెరుగుతూనే ఉన్నది. తరతరాలకు చెందిన కవులు, రచయితలు ఒవిడ్ రచనల నుండి స్పూర్తిని పొందారు.

రోమన్ సామ్రాజ్య పతనానంతరం మధ్యయుగాలలో సైతం ఈ రచనల ప్రభావం గాఢంగా ఉంది. ఆ సమయంలో ఫ్రాన్స్ దేశంలో తలయెత్తిన ‘కవిగాయక ప్రేమికులు’ (Troubadours) ‘అంతఃపుర ప్రేమాయణం’ (courtly love) అనే రెండు సంప్రదాయాలకు ఒవిడ్ రచనలే ప్రేరణ.

అటువంటి ఒవిడ్ రచనలన్నింటిలోకెల్లా ఎక్కువ ప్రసిద్ధిని పొందినది ఈ ‘అర్స్ అమటోరియా’ గ్రంథం. దీనిని ఆంగ్లంలో ‘The Art of Love’ గా పిలుస్తారు.

మధ్యయుగపు ఫ్రాన్స్‌కు చెందిన ప్రభువర్గాలలో తలయెత్తిన అంతఃపుర ప్రేమాయణ సంప్రదాయానికి కావలసిన మార్గదర్శకాలను ఈ గ్రంథమే అందించింది. ఆ కాలంలో ఐరోపాలోని వివిధ ప్రాంతాలకు చెందిన విధ్యార్థుల పాఠ్యప్రణాళికలో ఈ గ్రంథం ఒక భాగం. ఇప్పటికీ లాటిన్ సాహిత్య విద్యార్థులకు ఈ గ్రంథం ఒక పాఠ్యాంశంగా ఉంది

ఆ తదుపరి ఐరోపాలో సాంస్కృతిక పునరుజ్జీవనం (Renaissance) సంభవించే కాలానికి ఈ గ్రంథ ప్రాచుర్యం మరింత పెరిగి, యూరప్‌లోని అన్ని భాషలోనికీ అనువదింపబడి, ఆయా దేశాల ప్రజలచే విస్తృతంగా అధ్యయనం చేయబడినది.

నైతిక కోణంలో కూడా ఈ గ్రంథం గురించి మాట్లాడాలంటే ముందుగా చెప్పుకోవాల్సిన సంగతి: నాటి రోమన్ సమాజంలో నైతికవిలువలు పెంపొందించడానికి ప్రయత్నిస్తున్న అగస్టస్ చక్రవర్తి ఈ గ్రంథం కారణంగానే ఒవిడ్‌ను శాశ్వతమైన దేశబహిష్కరణకు గురిచేశాడు. కారణం ఈ గ్రంథం వివాహేతర సంబంధాలను ప్రోత్సహించేటట్లుగా ఉండటమే. కానీ అదే గ్రంథం ఆ తదనంతర కాలంలో విద్యార్థుల పాఠ్యప్రణాళికలో భాగమైనది.

మనం ఒక art ను నేర్చుకోవాలనుకున్నప్పుడు ఆ art లోని లోతులన్నింటినీ నేర్చుకోవాలి. నేర్చుకున్నదానిని ఏ మేరకు ఆచరణలో పెట్టాలన్నది మన విచక్షణ ప్రకారం మనమే నిర్ణయించుకుంటాం. art దుర్వినియోగం అవకుండా ఉండడానికి మార్గం artless గా ఉండటం మాత్రం కాదు.

ఇక అసలు విషయానికి వద్దాం. మూడుభాగాలున్న ‘The Art of Love ’ గ్రంథంలోని మొదటిభాగంలో ఒక పురుషుడు తన మనసు దోచిన స్త్రీని ఎలా గెలుచుకోవాలో (How to pick a woman) వివరించబడింది. అంటే తటస్థపడిన స్త్రీతో పరిచయాన్ని పెంచుకోవటం, ఆ పరిచయాన్ని స్నేహంగా, ఆ స్నేహాన్ని ప్రేమగా, చివరికి ఆ ప్రేమను శృంగారంగా క్రమంగా ఎలా మార్చాలో ఒవిడ్ ఈ భాగంలో చర్చించాడు.

ఇక రెండవభాగంలో అలా గెలుచుకున్న స్త్రీతో సంబంధాన్ని ఎలా కొనసాగించాలో, ఆమెను ఎలా నిలుపుకోవాలో (How to keep her) వివరించాడు.

స్త్రీలను ఉద్దేశించిన మూడవ భాగంలో వారు తమ ఆకర్షణను ఎలా కాపాడుకోవాలి, ప్రేమపేరుతో మోసం చేసే మోసగాళ్ళ బారినపడకుండా ఎలా జాగ్రత్తపడాలి మొదలైన విషయాలను చర్చించాడు.

ఒవిడ్ ప్రేమ కవితలను చరిత్రలో అనేక మంది ఆంగ్లపండితులు లాటిన్‌నుండి ఆంగ్లంలోకి అనువదించారు. వీరంతా కూడా ‘అర్స్ అమటోరియా’ గ్రంథాన్ని ‘The Art of Love’ పేరుతోనే అనువదించారు. వీరిలో ఎక్కువమంది లాటిన్‌లో ఒవిడ్ అనుసరించిన పద్యశైలినే తమ అనువాదంలో కూడా అనుసరించారు. కానీ లూయిస్ మే (Lewis May) లాంటి కొందరు తమ అనువాదంలో పద్యశైలికి తోడుగా కొంచెం గద్యశైలిని కూడా ఉపయోగించారు.

మరో ముఖ్య విషయం ఏమిటంటే ఒవిడ్‌కు గ్రీకు, రోమన్ పురాణాలకు సంబంధించి చాలా లోతైన పరిజ్ఞానం ఉంది. ఆయన రాసిన మెటామార్ఫాసిస్’ అనే కావ్యం గ్రీకు, రోమన్ పురాణాలకు ఒక రిఫరెన్స్ గ్రంథంగా ప్రఖ్యాతి వహించింది. ఆయన కవితలలో అడుగడుగునా ఆ పురాణఘట్టాల ప్రస్తావన దొర్లుతూ ఉంటుంది. అందుకే ఒవిడ్ రచనలను చదివి అర్థం చేసుకోవాలంటే ఆ పురాణాలకు సంబంధించిన ప్రాథమిక పరిజ్ఞానం ఉండాలి. అలా లేనివారు ఎప్పటి కప్పుడు రిఫరెన్సులు చూసుకుంటుండాలి.

కాలంతో పాటు మనిషి సామాజిక జీవన విధానంలో మార్పు రావచ్చేమోగానీ, అతని మౌలిక స్వబావంలో, అతడిలో కలిగే భావోద్రేకాలలో, అతడి ఆశలు, ఆకాంక్షలలో మాత్రం ఎన్ని వేల సంవత్సరాలు గడిచినా మార్పురాదు. కనుకనే రెండువేల సంవత్సరాల క్రితం రాయబడిన ఈ ‘The Art of Love’ నేటి ఆధునిక యుగపు డేటింగ్ మాన్యువల్స్‌ను సైతం నిర్దేశిస్తున్నది.

మీరు సైతం ఈ గ్రంథాన్ని చదివి మీ ప్రేమలో విజేతగా నిలవండి.

–బి.యల్.సరస్వతీ కుమార్

 

ఈ గ్రంథం మొదటిభాగపు (How to pick a woman) తెలుగు అనువాదాన్ని ఇక్కడ కొనండి

1 వ్యాఖ్య

  1. Karthik said,

    ఫిబ్రవరి 10, 2014 వద్ద 5:48 సా.

    Chaalaa baagundi.mee blog ippude chusanu:-):-)


వ్యాఖ్యానించండి