మీరు భగవద్గీత చదివారా ?!

నేను చదివిన పుస్తకాలలో ఈ సారి ‘భగవద్గీత’ ను పరిచయం చేద్దామనుకుంటున్నాను. ఈ పరిచయం భగవద్గీత గురించి మీకెవ్వరికీ తెలియదనో లేక మీకందరికీ భారతీయ తత్త్వశాస్త్ర సారంగా ఆ మహా గ్రంథం యొక్క వైశిష్ట్యం ఎటువంటిదో తెలపాలనో ఉద్దేశించి రాయడంలేదు.

గీత మీద వందల సంవత్సరాల నుండి అనేక వ్యాఖ్యానాలు వచ్చినాయి. నేటికాలంలో కూడా అనేక ప్రచురణ సంస్థలు, ధార్మిక, మత సంస్థలు గీతార్ధ వివరణతో కూడిన పుస్తకాలను అనేకం ప్రచురిస్తున్నాయి. వాటిలో నేను చదివిన పుస్తకాల గురించి, గీతను అర్ధం చేసుకునే ప్రయత్నంలో నాకు తోడ్పడిన పుస్తకాలను గురించి మీకు పరిచయం చేయాలనే ఉద్దేశ్యంతో మాత్రమే ఈ వ్యాసం రాస్తున్నాను.

భగవద్గీతా పుస్తకాలు పాకెట్ సైజు నుండి మోయలేనంత బరువుండే పెద్ద గ్రంథాల వరకూ వివిధ సైజులలో లభ్యమవుతున్నాయి. గీతలో అసలు ఉన్నది మొత్తం 701  శ్లోకాలే. కేవలం ఆ శ్లోకాలే ఉండే పారాయణ గ్రంథాలతో మొదలై శ్లోకంతో పాటు కేవలం తాత్పర్యం మాత్రమే ఉండే గ్రంథాలుగా, తాత్పర్యంతో పాటు అర్థ వివరణ కూడా ఉండే గ్రంథాలుగా పుస్తకం పెరిగిపోయి క్రమంగా ఈ వివరణ విస్తారమై పోయి ఒక ఉద్గ్రంథంగా మారేంతవరకూ భగవద్గీత వివిధ సైజులలో మనకు ఇప్పుడు లభ్యమవుతున్నది.

మొదట పెద్ద గ్రంథాలతో మొదలు పెడదాము.

కొన్నాళ్ళ క్రితం అనేకమంది ఇళ్ళల్లో ‘ఇస్కాన్’ వారి భగవద్గీతే కనిపించేది. వారు మొబైల్ బుక్ స్టాల్ ద్వారా చాలా తక్కువ ధరకు నాణ్యమైన కాగితం, బైండింగ్ తో తయారైన గీతను అందించేవారు. అయితే ఇందులోని వివరణ ఓ పట్టాన అర్థమయ్యేది కాదు. కానీ ఆ గ్రంథంలో ముద్రించిన పాశ్చాత్య శైలిలో చిత్రించబడిన చిత్రాలు చాలా ఆకట్టుకునేవి. గీతను కొనడంలో ఎక్కువమంది కుండే ఉద్దేశ్యం ఆధ్యాత్మిక దృష్టే గానీ జిజ్ఞాస కాదు గనుక అర్థంకాక పోయినా ఈ గ్రంథం బాగానే ప్రచారం పొందింది. పైగా తక్కువ వెల కూడాను. దీని ఖరీదు Rs.50/-

తరువాత శ్రీకాళహస్తిలోగల శుకబ్రహ్మాశ్రమ స్థాపకులు శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వామి చే రచింపబడిన ‘గీతామకరందం’ పేరు తో ఉండే భగవద్గీత అత్యంత ప్రజాదరణ పొందింది. ఇస్కాన్ వారి గీతలా కాకుండా ఇందులోని వివరణ బాగా అర్థవుతుంది. దీని ఖరీదు కొంచెం ఎక్కువ. Rs.300/- వరకూ ఉంటుంది.

శంకరాచార్యులు, మధ్వాచార్యులు, రామానుజాచార్యులు (త్రిమతాచార్యులు) వందల సంవత్సరాల క్రితం ఒకరితో ఒకరు విభేదించుకుంటూ గీతకు భాష్యాలు రాశారు. అవన్నీ సంస్కృతంలోనే ఉన్నాయి. ఆ ముగ్గురి అభిప్రాయాలనూ క్రోడీకరిస్తూ కొందరు తమిళ పండితులు తమ భాషలో ఓ గ్రంథాన్ని రాశారు. దానిని తమిళాంధ్ర భాషా ప్రవీణులైన కీళాత్తూరు శ్రీనివాసాచార్యులు గారు తెలుగులోనికి అనువదిస్తే ‘మహా భగవద్గీత’ పేరుతో తిరుపతికి సమీపంలో గల ఏర్పేడు ఆశ్రమం వారు ప్రచురించారు. త్రిమతాచార్యుల అభిప్రాయాలతో ఈ గీత కూడా చాలా బావుంటుంది. దీని ఖరీదు  Rs.125/-

తరువాత నన్నాకట్టుకున్న పుస్తకం ఉత్తర భారతదేశానికి చెందిన జయదయాళ్ గోయందకా గారు హిందీలో ‘శ్రీమద్భగవద్గీత-తత్త్వవివేచనీ వ్యాఖ్య’ పేరుతో ఓ గ్రంథాన్ని రచించాడు. దానిని గీతా ప్రెస్ వారు తెలుగులోకి అనువదించి, ప్రచురించి Rs.80/-లకే అందిస్తున్నారు. ఈ గీతలోని వివరణ అరటిపండు వలిచి చేతిలో పెట్టినట్లుగా ఉంటుంది. మిగతా గీతలలోని వివరణకన్నా ఈ గీతలోని వివరణ చాలా విశిష్టత కలిగినది. ఒక శ్లోకంలో చెప్పిన విషయం గీతలో మరెక్కడెక్కడ ఏఏ విధంగా చెప్పబడిందీ మొదలైన వివరాలతో చాలా ఆసక్తికరంగా ఉంటుంది.

..ఇవీ నాకు తెలిసిన, నేను చదివిన పెద్ద భగవద్గీతా గ్రంథాలు.

ఇప్పుడు మధ్యస్థాయి గ్రంథాలు చూద్దాం. ఇవీ చాలా ఉన్నాయి. కానీ నన్ను ఆకట్టుకున్న పుస్తకం మాత్రం ఒకే ఒకటి. శిష్ట్లా సుబ్బారావు గారు రాసిన శ్రీమద్భగవద్గీత. ఇది తిరుమల తిరుపతి దేవస్థానం వారి ప్రచురణ. మొదట్లో దీని ఖరీదు  Rs.1/- మాత్రమే. ఇప్పుడు Rs.15/-చొప్పున విక్రయిస్తున్నారు. ఇది T.T.D. వారి ఆస్థాన గ్రంథమంటే నమ్మండి. అంత ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది T.T.D. ఈ గ్రంథాన్ని. శిష్ట్లా సుబ్బారావు గారు మంచి ఆధ్యాత్మిక దృష్టితో, భక్తిభావంతో చాలా చక్కగా, గీత గురించి పరిచయంలేని వారికి కూడా అర్థమయ్యేటట్లుగా గీతార్థాన్ని వివరించారు. నేను మొట్టమొదట  చదివిన గీత ఇదే.

ఇక తరువాత శ్లోకానికి కేవలం తాత్పర్యం మాత్రమే ఉండే చిన్నసైజు గీతా గ్రంథాలు కూడా చాలా ఉన్నాయి. వాటిలో నేను చదివినది, నాదగ్గర ఉన్నది రావుల సూర్యనారాయణ మూర్తి గారు రచించినది. ఇది కూడా T.T.D. వారి ప్రచురణే. ఇది ఇప్పుడు లభ్యమవుతున్నట్లుగా నేను గమనించలేదు. కేవలం తాత్పర్యం మాత్రమే ఉండే పుస్తకమే గనుక వీటిలో ఒక పుస్తకానికి మరోపుస్తకానికి పెద్ద తేడా ఏమీ ఉండదు.

గీతార్థ వివరణ కొరకు కొన్ని పుస్తకాలు చదివిన మీదట నేనో విషయాన్ని గ్రహించాను.  ఎవరి అర్థవివరణ వారిదే, ఏ ఒక్కరి అభిప్రాయం మిగతావారి అభిప్రాయం తో కలవటం లేదని గ్రహించాను. దాని మీదట నేను ఈ గీతార్థాలను వివరించే పుస్తకాలన్నింటినీ మానేసి కేవలం తాత్పర్యం మాత్రం ఉండే ఈ ఒక్క పుస్తకానికే చాలాకాలంపాటు పరిమితమయ్యాను. నా అర్థాలేవో నేనే వివరించుకోవచ్చులే అనుకున్నాను. అలాగే నాకు తోచిన అర్థాలలో కొన్నింటిని నా ‘శంఖారావం’ బ్లాగులో “భారతదేశానికి ఎటువంటి వ్యవస్థ కావాలి..?!” వ్యాసావళిలో (రెండవ అధ్యాయంలో) మీకు వివరించడం జరిగినది.

ఇక కేవలం శ్లోకాలు మాత్రమే ఉండే ‘పారాయణ గీత’ గురించి వివరించడానికేమీ లేదు.

చివరగా గీతార్థాన్ని వివరించే పుస్తకాలలో ఒక విశిష్టమైన పుస్తకాన్ని మీకు పరిచయం చేస్తాను. ఇది కూడా T.T.D. వారి ప్రచురణే. రచయిత S.B. రఘునాథాచార్య గారు. ఇది ఎంతటి ప్రజాదరణ పొందినదో చెప్పలేము. దానిపేరు ‘మన సమస్యలకు భగవద్గీత పరిష్కారాలు’. ఇందులోని వివరణ గీతలోని అధ్యాయాల క్రమంలోగానీ, శ్లోకాల క్రమంలోగానీ ఉండదు. మనలో ఎక్కువ మందికి తరచూ వచ్చే సందేహాలు, ఎదురయ్యే సమస్యలు.. మొదలైన వాటికి గీతలో ఎటువంటి పరిష్కారం, సమాధానం సూచించబడిందో సంక్షిప్తంగా తెలియజేస్తుంది. ఇది కూడా చిన్న గ్రంథమే. ఓ వందపేజీలుంటుంది. దీనిలో గీతలోని ప్రతి శ్లోకమూ ఉండదు. ఏవో కొన్ని శ్లోకాలు మాత్రమే ఉంటాయి. దాని ఖరీదు అప్పట్లో Rs.1/-ఉండేది. ఇప్పుడు Rs.6/-

చివరిగా పై పుస్తకాలన్నీ దొరికే ప్రదేశాల గురించి చెప్పుకుందాం. గీతా ప్రెస్ పుస్తకాలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో 1 వ నంబరు ప్లాట్‌ఫాం మీద వారి స్టాల్ ఉన్నది. కాచీగూడలోని బాలసరస్వతీ బుక్ డిపోలో కూడా గీతా ప్రెస్ వారి పుస్తకాలు దొరుకుతాయి. ఈ బాలసరస్వతీ బుక్ డిపోలోనే గీతామకరందం, మహా భగవద్గీత కూడా దొరికే అవకాశం ఉంది. ఇక ఇస్కాన్ వారి గ్రంథానికి నాంపల్లి లోని వారి టెంపుల్ లో వారి స్టాల్ ఉన్నది. T.T.D. వారి గ్రంథాలు అనేక పట్టణాలలో ఉన్న వారి కళ్యాణ మండపాలలో ఉన్న వారి స్టాల్స్ లో దొరుకుతాయి. ఇంకా విశాలాంధ్రలో, మామూలు బుక్ స్టాల్స్‌లో కూడా ప్రయత్నించవచ్చు. తిరుమల వంటి పుణ్యక్షేత్రాలలో అయితే వాళ్ళ ప్రచురణలు విక్రయించే స్టాల్స్‌తోపాటు గీతాప్రెస్స్ వంటి ఇతరుల స్టాల్స్ కూడా ఉంటాయి.

తాత్పర్యసహిత భగవద్గీతనుఇక్కడ చదవండి.

పారాయణగీతను ఇక్కడచదవండి.

16 వ్యాఖ్యలు

  1. tejashreyus said,

    జనవరి 9, 2009 వద్ద 1:24 సా.

    nenu iskon vari book tho chala tantalu padutunannu artham kaaka

  2. dnchari said,

    జనవరి 9, 2009 వద్ద 2:16 సా.

    చాలా ఉపయుక్తమైన టపా…ధన్యవాదములు

  3. durgeswara said,

    జనవరి 9, 2009 వద్ద 2:45 సా.

    చాలా వివరణాత్మకంగానూ ,పరిశీలనాత్మకంగావున్న మీటపా చాలా బాగుంది.

  4. Pradeep said,

    జనవరి 9, 2009 వద్ద 3:39 సా.

    భగవద్గీత మీద రామకృష్ణ మిషను వారు ఒక పుస్తకం విడుదల చేసారు. ఆ పుస్తకం కూడా చాలా బాగుంటుంది. వెల కూడా తక్కువే సుమారు 30 రూపాయలనుకుంటా
    నాకు పుస్తకం పేరు గుర్తురావడం లేదు. ఎవరికైనా తెలిస్తే చెప్పండి

  5. saraswathikumar said,

    జనవరి 10, 2009 వద్ద 2:33 ఉద.

    ప్రదీప్ గారూ! ఆ పుస్తకం పేరు ’గీతా దర్శనం’.T.T.D. వారికి ఆ గ్రంథం నచ్చి (తాము ప్రాచురించకపోయినా) ఆ గ్రంథం ప్రాచుర్యం పొందాలనే ఉద్దేశంతో సబ్సిడీ సమకూర్చారు. ఆ పుస్తకాన్ని నేను కొన్నాను. కానీ వ్యాసంలో సమయానికి గుర్తురాక పేర్కొనలేదు. గుర్తు చేసినందుకు ధన్యవాదాలు! ఈ గీతా దర్శనంతో పాటే ‘మానవ ప్రతిభ ‘ అనే పుస్తకాన్ని కూడా వారు ప్రచురించారు. మరో విషయమేమిటంటే ఈ గ్రంథాలను ప్రచురించినది మద్రాసు రామకృష్ణ మిషన్ వారు కాదు. మన హైదరాబాదులోని దోమలగూడాలోగల రామకృష్ణ మఠం వారే.

  6. saraswathikumar said,

    జనవరి 10, 2009 వద్ద 5:26 ఉద.

    తేజ శ్రేయస్ గారూ! మీరు గీతను అర్థం చేసుకోవడానికి ఈ టపాలో తెలిపిన గ్రంథాలేమైనా ఉపయోగపడతాయేమో ప్రయత్నించండి. :b

    @ చారి గారు, దుర్గేశ్వర గారు ..ధన్యవాదాలు!

  7. rayraj said,

    జనవరి 10, 2009 వద్ద 10:29 ఉద.

    నా శంఖారావం బ్లాగులో “భారతదేశానికి ఎటువంటి వ్యవస్థ కావాలి..?!”
    I have tried many times on the link; some how its not going there. Can you please check and rectify.

    By the way, you are not supposed to get same commentary by all for Gita, It has to be different. Its the intrinsic nature.Thats what He says in it.You can see everything in Me, because everythin is Me.

    And ofcourse you came to the right conclusion at the end. Read the Gita. Parayana. thats it. One day the meanings should unfold in your mind like the commentators themselves have got!

    One elderly man, who used to come to the Shankermutt in Nallakunta told me this: never bother for the translations.Take any one stotra; memorise; repeat in deep meditations;you will understand.

    Description is not what is described – JiDDu.

    But you go through it, the conceptuality would get revealed; and you will catch it finally.

    because it has to be like flower unfolding with all the petals at once…perhaps.

    because it has to be like an Awakening; A realisation! like you walk away after a deep slumber.

    I have not attained it.But thats the crux of the reading as i understand.

    Wish to read your interpretation too as you have read it in many versions.Please give the link.

    Sorry i could not type this in Telugu due to some technical problem.

  8. saraswathikumar said,

    జనవరి 10, 2009 వద్ద 1:06 సా.

    @Rayraj ji! Sir, I have rectified the problem in the link. But I mentioned and gave interpretation there for few (but important) slokas only.

    Thank you for your response and explanation.

  9. Aruna said,

    జనవరి 12, 2009 వద్ద 4:47 సా.

    మళయాళ స్వాముల వారు రాసిన భగవద్గీత కూడా బాగుంటుంది అంటారు మా ఇంట్లో. ఏర్పేడు ఆశ్రమం వారిచే ప్రచురింపబడిన త్రిమతాచార్యుల గీత, మళయాళ స్వాముల వారి గీత ఒకటేనా?

  10. saraswathikumar said,

    జనవరి 13, 2009 వద్ద 1:15 ఉద.

    @అరుణ, త్రిమతాచార్యుల మహా భగవద్గీత, మళయాళ స్వాముల వారు రాసిన భగవద్గీత ఒకటి కాదు. ఒకే ఆశ్రమం వారిచే ప్రచురింపబడిన వేరు వేరు గ్రంథాలు.

  11. మార్చి 19, 2009 వద్ద 12:03 సా.

    […] చేస్తే! – ఓ రోజు భగవద్గీత చదివారా మీద “flower unfolding with all the petals at once” అనే వాక్యం […]

  12. sankara said,

    మే 11, 2009 వద్ద 6:20 ఉద.

    I read the book of BHAGAVADGEETA by geeta press.I could not understand deeply ofcourse i think nobody could understood.i want to read some more books in telugu version.please send me.

  13. ashok chakravarthy.b said,

    జనవరి 4, 2012 వద్ద 10:26 ఉద.

    అది మంచి మరియు గొప్ప ఉద్యోగం

  14. జనవరి 26, 2012 వద్ద 5:44 ఉద.

    నేను మా తాతయ్య వాళ్ళింటికి వెళ్ళినపుడు సుబ్బారావుగారి పుస్తకం చూసాను. చాలా ఆసక్తికరంగా వుంది. Online ఎక్కడయినా దొరుకుతాయా TTD వారి పుస్తకాలు ? Very useful short reviews of various versions. Thanks for the info.

  15. subhas chandrabose said,

    జూన్ 15, 2012 వద్ద 5:34 సా.

    saraswathi garu-nenu chandrabose,geetha rachayithanu-bhagavadgeetha pusthakaala gurinchi meetho oka saari maatlaadaali-naa email id-chandrabose10@yahoo.co.in-mail cheyagalaraa

  16. saraswathikumar said,

    జూన్ 16, 2012 వద్ద 3:08 ఉద.

    @Subhash Chandhrabose, my email ID-kumarbls@yahoo.co.in


Leave a reply to Pradeep స్పందనను రద్దుచేయి