ప్రేమవిజేత కావాలంటే చదవండి The Art of Love

మనిషి ఈ భూమండలాన్ని అంతం చేయగలడు, కానీ ఆ మనిషినే అంతం చేయగల శక్తి ప్రేమకు ఉంది.

ఓ మనిషి మరో మనిషి మీద చూపించే మమకారాన్ని, అనురాగాన్ని మనం ‘ ప్రేమ’ అంటాం. ఐతే స్త్రీ, పురుషుల మధ్యన ఉండే ఆకర్షణే పునాదిగా ఏర్పడిన ప్రేమ ప్రత్యేకమైనది.

ఆడ, మగ ఈ సృష్టిలో ప్రకృతీ పురుషులకు ప్రతీకలు. వీరి మధ్యన ఉండే ఆకర్షణ ప్రకృతి సహజమైనది. వీరిరువురి కలయిక కారణంగానే భూమి మీద ఒక జాతి మనుగడ కాలంతో పాటు కొనసాగుతూ ఉంటుంది.

జంతులోకంలో ఈ కలయిక ఉద్దేశం కేవలం సంతానాభివృద్దే. కానీ సృష్టిలో ఒక్క మనిషి విషయంలో మాత్రమే ఈ కలయిక కేవలం సంతానాభివృద్ధికే కాక, అంతకన్నా ఎక్కువగా సౌఖ్యానికీ, సంతోషానికీ; మరీ ముఖ్యంగా జీవితానికో తోడు దొరకడానికీ మూలంగా నిలబడింది. అందుకే మనిషి విషయంలో ఈ ఆడ, మగ ఆకర్షణ ప్రేమ స్థాయికి ఎదిగింది.

స్త్రీ పురుషులకు ఒకరిపై మరొకరికి ప్రేమ జనించి, ఒకరినొకరు ఇష్టపడుతున్నప్పటికీ వారిరువురూ పరస్పరం చేరువవ్వాలంటే ఇరువురికీ కొంత ధైర్యం, కొంత చాకచక్యం అవసరం. మరిముఖ్యంగా ఈ విషయంలో ముందుగా చొరవ చేయాల్సింది మాత్రం పురుషుడే.

ఐతే ఆ పురుషుడు ప్రేమవ్యవహారాన్ని నడపలేని artless person ఐతే మాత్రం అతడు మూగప్రేమలో చిక్కుకుపోతాడు, ఎప్పటికీ తన ప్రేమను వ్యక్తం చేయలేడు. చేతికందే దూరంలో ఉన్న ప్రేమను కూడా అందుకోలేడు. తన ఆకాంక్షనూ నెరవేర్చుకోలేడు, ఆమె ఆశనూ ఈడేర్చలేడు.

ఇలాంటి వాడే మరొకడు తన ప్రేమను అసందర్భంగా వ్యక్తం చేసి, తిరస్కారాన్ని పొంది, మనశ్శాంతిని కోల్పోతాడు. ఒక్కోసారి ప్రాణాల మీదకు కూడా తెచ్చుకుంటాడు.

ఇటువంటి artless person ను artful person గా మార్చే పరసువేది ఈ ‘The Art of Love’.

స్త్రీ పురుషులు పరస్పరం దగ్గరవటం అనేది సులువుగా, సజావుగా, ఎటువంటి దుష్పరిణామాలకూ దారితీయకుండా జరగడానికి కావలసిన మార్గదర్శకాలను వివరిస్తూ, ప్రాచీన రోమన్ సామ్రాజ్యానికి (నేటి ఇటలీ) చెందిన కవి అయిన ఒవిడ్ (Ovid 43 B.C.–A.D. 17) ‘The Art of Love’ అనే ఈ చిరుగ్రంథాన్ని ‘ఆర్స్ అమటోరియా’ (Ars amatoria or Ars amoris) పేరుతో, క్రీస్తు పూర్వం 1 లో రచించాడు. ఇది లాటిన్‌భాషలో, కవితారూపంలో ఉండి మూడు భాగాలుగా ఉంటుంది. మొదటి రెండు భాగాలూ పురుషులను ఉద్దేశించి రాసినవి. మూడవ భాగం స్త్రీలను ఉద్దేశించి ఉంటుంది.

భారతీయ సాహిత్యంలోని వాత్సాయన కామసూత్రాలలో ఇటువంటి మార్గదర్శకత్వం మనకు లభించదు. ఆ గ్రంథం కేవలం రతిభంగిమల మూలంగానే అంత ప్రాచుర్యంలోకి వచ్చింది. ఆ గ్రంథంలో కూడా వాత్సాయనుడు కొన్ని seduction tips ఇవ్వటానికి ప్రయత్నించాడు. కానీ అవేవీ కూడా ఒవిడ్ ‘The Art of Love’లో ఉన్నంత విశదంగానూ, ఒక క్రమ పద్దతిలోనూ, ఆచరణయోగ్యంగానూ ఉండవు.

కామసూత్రాలలోని వశీకరణ ప్రకరణంలో వాత్సాయనుడు, కోరుకున్న వారిని లోబరుచుకోవడానికి కొన్ని మందుల్ని, మాకుల్నీ సూచించాడు. అవేవీ కూడా ఈ ఆధునిక కాలానికి తగినటువంటివి కావు. అదే సమయంలో ఒవిడ్ వశీకరణ ప్రక్రియనంతా (seduction process) కాలాతీతమైన మానవ స్వబావం (human psychology) ఆధారంగా వివరించాడు.

ఒక స్త్రీని గెలుచుకోవాలని భావించే పురుషుడు చతుష్షష్ఠీ కళాకోవిదుడై ఉండాలని వాత్సాయనుడు చెప్పాడు, కొంచెం శుచీ శుభ్రంగా ఉంటే చాలని ఒవిడ్ చెప్పాడు.

దేశ విదేశాలకు చెందిన స్త్రీలను, వాళ్ళ స్వబావాలనూ వాత్సాయనుడు పేర్కొన్నాడు, నీకు కావాల్సిన సుందరీమణి నీ చుట్టు పక్కలనే ఉంటుందని ఒవిడ్ చెప్పాడు.

రోమన్ సామ్రాజ్యాన్ని అగస్టస్ చక్రవర్తి పరిపాలించిన కాలం లాటిన్‌సాహిత్యానికి స్వర్ణయుగంగా భావిస్తారు. ఒవిడ్ ఆ స్వర్ణయుగానికి చెందిన కవి.

స్త్రీ పురుషుల మధ్యన జనించే ప్రేమకు, వారి మధ్యన నడిచే ప్రేమవ్యవహారానికి సంబంధించిన అనేక అంశాలను స్పృశించిన ఒవిడ్ రచనలు ఆయన జీవిత కాలంలోనే ఎనలేని కీర్తిని ఆర్జించాయి. ఆ కీర్తి ఆయన మరణానంతరం కూడా కొనసాగటమేకాక అంతకంతకూ పెరిగింది, నేటికీ పెరుగుతూనే ఉన్నది. తరతరాలకు చెందిన కవులు, రచయితలు ఒవిడ్ రచనల నుండి స్పూర్తిని పొందారు.

రోమన్ సామ్రాజ్య పతనానంతరం మధ్యయుగాలలో సైతం ఈ రచనల ప్రభావం గాఢంగా ఉంది. ఆ సమయంలో ఫ్రాన్స్ దేశంలో తలయెత్తిన ‘కవిగాయక ప్రేమికులు’ (Troubadours) ‘అంతఃపుర ప్రేమాయణం’ (courtly love) అనే రెండు సంప్రదాయాలకు ఒవిడ్ రచనలే ప్రేరణ.

అటువంటి ఒవిడ్ రచనలన్నింటిలోకెల్లా ఎక్కువ ప్రసిద్ధిని పొందినది ఈ ‘అర్స్ అమటోరియా’ గ్రంథం. దీనిని ఆంగ్లంలో ‘The Art of Love’ గా పిలుస్తారు.

మధ్యయుగపు ఫ్రాన్స్‌కు చెందిన ప్రభువర్గాలలో తలయెత్తిన అంతఃపుర ప్రేమాయణ సంప్రదాయానికి కావలసిన మార్గదర్శకాలను ఈ గ్రంథమే అందించింది. ఆ కాలంలో ఐరోపాలోని వివిధ ప్రాంతాలకు చెందిన విధ్యార్థుల పాఠ్యప్రణాళికలో ఈ గ్రంథం ఒక భాగం. ఇప్పటికీ లాటిన్ సాహిత్య విద్యార్థులకు ఈ గ్రంథం ఒక పాఠ్యాంశంగా ఉంది

ఆ తదుపరి ఐరోపాలో సాంస్కృతిక పునరుజ్జీవనం (Renaissance) సంభవించే కాలానికి ఈ గ్రంథ ప్రాచుర్యం మరింత పెరిగి, యూరప్‌లోని అన్ని భాషలోనికీ అనువదింపబడి, ఆయా దేశాల ప్రజలచే విస్తృతంగా అధ్యయనం చేయబడినది.

నైతిక కోణంలో కూడా ఈ గ్రంథం గురించి మాట్లాడాలంటే ముందుగా చెప్పుకోవాల్సిన సంగతి: నాటి రోమన్ సమాజంలో నైతికవిలువలు పెంపొందించడానికి ప్రయత్నిస్తున్న అగస్టస్ చక్రవర్తి ఈ గ్రంథం కారణంగానే ఒవిడ్‌ను శాశ్వతమైన దేశబహిష్కరణకు గురిచేశాడు. కారణం ఈ గ్రంథం వివాహేతర సంబంధాలను ప్రోత్సహించేటట్లుగా ఉండటమే. కానీ అదే గ్రంథం ఆ తదనంతర కాలంలో విద్యార్థుల పాఠ్యప్రణాళికలో భాగమైనది.

మనం ఒక art ను నేర్చుకోవాలనుకున్నప్పుడు ఆ art లోని లోతులన్నింటినీ నేర్చుకోవాలి. నేర్చుకున్నదానిని ఏ మేరకు ఆచరణలో పెట్టాలన్నది మన విచక్షణ ప్రకారం మనమే నిర్ణయించుకుంటాం. art దుర్వినియోగం అవకుండా ఉండడానికి మార్గం artless గా ఉండటం మాత్రం కాదు.

ఇక అసలు విషయానికి వద్దాం. మూడుభాగాలున్న ‘The Art of Love ’ గ్రంథంలోని మొదటిభాగంలో ఒక పురుషుడు తన మనసు దోచిన స్త్రీని ఎలా గెలుచుకోవాలో (How to pick a woman) వివరించబడింది. అంటే తటస్థపడిన స్త్రీతో పరిచయాన్ని పెంచుకోవటం, ఆ పరిచయాన్ని స్నేహంగా, ఆ స్నేహాన్ని ప్రేమగా, చివరికి ఆ ప్రేమను శృంగారంగా క్రమంగా ఎలా మార్చాలో ఒవిడ్ ఈ భాగంలో చర్చించాడు.

ఇక రెండవభాగంలో అలా గెలుచుకున్న స్త్రీతో సంబంధాన్ని ఎలా కొనసాగించాలో, ఆమెను ఎలా నిలుపుకోవాలో (How to keep her) వివరించాడు.

స్త్రీలను ఉద్దేశించిన మూడవ భాగంలో వారు తమ ఆకర్షణను ఎలా కాపాడుకోవాలి, ప్రేమపేరుతో మోసం చేసే మోసగాళ్ళ బారినపడకుండా ఎలా జాగ్రత్తపడాలి మొదలైన విషయాలను చర్చించాడు.

ఒవిడ్ ప్రేమ కవితలను చరిత్రలో అనేక మంది ఆంగ్లపండితులు లాటిన్‌నుండి ఆంగ్లంలోకి అనువదించారు. వీరంతా కూడా ‘అర్స్ అమటోరియా’ గ్రంథాన్ని ‘The Art of Love’ పేరుతోనే అనువదించారు. వీరిలో ఎక్కువమంది లాటిన్‌లో ఒవిడ్ అనుసరించిన పద్యశైలినే తమ అనువాదంలో కూడా అనుసరించారు. కానీ లూయిస్ మే (Lewis May) లాంటి కొందరు తమ అనువాదంలో పద్యశైలికి తోడుగా కొంచెం గద్యశైలిని కూడా ఉపయోగించారు.

మరో ముఖ్య విషయం ఏమిటంటే ఒవిడ్‌కు గ్రీకు, రోమన్ పురాణాలకు సంబంధించి చాలా లోతైన పరిజ్ఞానం ఉంది. ఆయన రాసిన మెటామార్ఫాసిస్’ అనే కావ్యం గ్రీకు, రోమన్ పురాణాలకు ఒక రిఫరెన్స్ గ్రంథంగా ప్రఖ్యాతి వహించింది. ఆయన కవితలలో అడుగడుగునా ఆ పురాణఘట్టాల ప్రస్తావన దొర్లుతూ ఉంటుంది. అందుకే ఒవిడ్ రచనలను చదివి అర్థం చేసుకోవాలంటే ఆ పురాణాలకు సంబంధించిన ప్రాథమిక పరిజ్ఞానం ఉండాలి. అలా లేనివారు ఎప్పటి కప్పుడు రిఫరెన్సులు చూసుకుంటుండాలి.

కాలంతో పాటు మనిషి సామాజిక జీవన విధానంలో మార్పు రావచ్చేమోగానీ, అతని మౌలిక స్వబావంలో, అతడిలో కలిగే భావోద్రేకాలలో, అతడి ఆశలు, ఆకాంక్షలలో మాత్రం ఎన్ని వేల సంవత్సరాలు గడిచినా మార్పురాదు. కనుకనే రెండువేల సంవత్సరాల క్రితం రాయబడిన ఈ ‘The Art of Love’ నేటి ఆధునిక యుగపు డేటింగ్ మాన్యువల్స్‌ను సైతం నిర్దేశిస్తున్నది.

మీరు సైతం ఈ గ్రంథాన్ని చదివి మీ ప్రేమలో విజేతగా నిలవండి.

–బి.యల్.సరస్వతీ కుమార్

 

ఈ గ్రంథం మొదటిభాగపు (How to pick a woman) తెలుగు అనువాదాన్ని ఇక్కడ కొనండి

పిల్లలకోసం ఓ మంచి మంత్లీ

విజయ బానర్ పై మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే నిండు చందమామ కనిపించే సన్నివేశాలున్న సినిమాలను ఎన్నింటినో నిర్మించారు చక్రపాణి, నాగిరెడ్డి గార్లు. ఆ చందమామ ‘విజయావారి చందమామ ‘గా ప్రసిద్ధి పొందినది. అదే చక్రపాణి, నాగిరెడ్డి గార్లు ఆ అందమైన చందమామ పేరుతోనే స్థాపించిన మాసపత్రిక ఎందరి హృదయాలోనో స్థానం సంపాదించుకున్నది.

చందమామ స్థాపనలోని ఉద్దేశం మన గతాన్ని, మన సంస్కృతీ సంప్రదాయాలను బాలబాలికలకు పరిచయం చేయడం. అన్ని భారతీయ భాషలలో వెలువడే చందమామలో జానపద పౌరాణికాలకు ప్రాధాన్యత ఎక్కువ. దీనిలోని కథలకు శంకర్ వేసిన బొమ్మలు అదనపు బలాన్ని ఇచ్చేవి. కొద్ది సంవత్సరాల క్రితం చందమామ కొన్ని రోజులు ఆగిపోయి నూతన రూపంతో మరలా మార్కెట్లో అడుగిడింది.

నాది చందమామ జనరేషన్. నేను చందమామను తెలుగులో చదివేవాణ్ణి. చందమామతోపాటుగా బాలమిత్ర, చంపక్ వంటి ఇతర మాగజైన్లు కూడా చదివేవాణ్ణి. హిందీ, ఇంగ్లీషులలో వెలువడే చంపక్ లో అన్ని కథలలో జంతువులే పాత్ర ధారులు.

నాపిల్లలకోసం మాత్రం ఇంగ్లీషు చందమామను తెప్పిద్దామనుకుంటుండగా ఇప్పటి పిల్లల కోసం మరింత మంచి మాగజైన్ నా దృష్టిలోకి వచ్చింది.

అదే కేరళ నుండి వెలువడే ‘PCM చిల్డ్రన్స్ మాగజైన్’. బాలబాలికలకు అవసరమైన విజ్ఞానాన్ని, వారు ఇష్టపడే రీతిలో అందించడం, వారి మానసిక ఎదుగుదలకు తోడ్పటడం మొదలైన ఉద్దేశాలతో, Knowledge with Fun అనే motto తో నడిచే ఈ ఇంగ్లీషు మాగజైన్ నేటితరం పిల్లలకోసం ఓ మంచి పత్రిక.

దీనిలో మనుషులు పాత్ర ధారులుగా ఉన్న కథలు ఉంటాయి, జంతువులు పాత్ర ధారులుగా ఉన్న కథలూ ఉంటాయి, సైన్సు వ్యాసాలుంటాయి, ప్రముఖుల పరిచయాలుంటాయి. కథలు, వ్యాసాలే కాక పిల్లలను ఆకట్టుకునే అనేక ఇతర శీర్షికలు కూడా ఉంటాయి. బొమ్మలకు రంగులేయడం, క్విజ్, పిల్లల చేత డ్రాయింగులు వేయించి వాటిని ఆ పత్రికలోనే ముద్రించడం, ఇంకా అనేక ఇతర పోటీలు, విభిన్నమైన …పదులసంఖ్యలో ఉండే అనేక ఇతర ఫీచర్లతో, రంగురంగుల బొమ్మలతో ఎంతో ఆకర్షణీయంగా ఉండే ఈ పత్రిక పిల్లల మనసును ఇట్టే ఆకట్టుకుంటుంది.

నేను మా పిల్లలకి మన సంస్కృతిని పరిచయం చేయడం కోసం గీతాప్రెస్ వారు చిన్న పిల్లలకోసం ప్రచురించే పుస్తకాలు కొంటాను. మాగజైన్ మాత్రం PCM తెప్పిస్తాను. నేను ఈ పత్రిక వెల 15 రూపాయలు ఉన్నప్పటి నుండి తెప్పిస్తున్నాను. ఇప్పుడు దాని ఒక కాపీవెల 20 రూపాయలు అయినది. సంవత్సర చందా Rs.30 డిస్కౌంట్ పోనూ Rs.210

మీరు కూడా ఈ పత్రిక తెప్పించాలనుకుంటే The Children’s Magazine, Ernakulam పేరుతో Rs.210 కు DD తీసి దానికి మీ అడ్రస్ ఉన్న స్లిప్ జతచేసి ఈ క్రింది అడ్రస్ కు పోస్ట్ చేస్తే వారు మరుసటి నెలనుండి మీ ఇంటికి ఈ పత్రికను పోస్ట్ లో పంపుతారు.

PCM Children’s Magazine,
Govt. High School Road,
Edappally,
Cochin, Kerala, PIN-682 024

మీకు ఇంకా స్పస్ష్టమైన వివరాలు కావాలంటే చందావివరాల కోసం ఓ కాపీ పంపమని మీ అడ్రస్ వారికి మెయిల్ చేస్తే వారు ఉచితంగా మీకో కాపీ పంపుతారు. వారి email id-

ekmpcm@gmail.com,
thechildrensmagazine@gmail.com

వారి వెబ్‌సైట్ www.pcmmagazine.com

ఈ పత్రికలో ఉండే కొన్ని శీర్షికలలో పాల్గొనే పిల్లలకు నగదు బహుమతి ఇస్తారు. ఉదాహరణకు పత్రికలోని ఆర్ట్ గాలరీ కొరకు డ్రాయింగ్స్ పంపే పిల్లలకు వంద రూపాయలు బహుమతిగా M.O. చేస్తారు. ఒక వేళ ఆ డ్రాయింగ్ గనుక పత్రిక ముఖచిత్రానికి ఎంపిక అయితే Rs.500 బహుమతి లభిస్తుంది. డ్రాయింగ్ వెనకాల విద్యార్థి పేరు, చదివే స్కూల్ పేరు, ఊరు, ఇంటి అడ్రస్ రాసి ప్రిన్సిపాల్ సైన్ చేయించాలి.

మనం ఎలాంటి డ్రాయింగ్ పంపినా అది దాదాపుగా ఎంపిక అవుతుంది. అంటే రెండు నెలలు ఆర్ట్ గాలరీకోసం డ్రాయింగ్ పంపితే మనం చందా కోసం వెచ్చించిన సొమ్ము దాదాపుగా మనకు తిరిగి వస్తుంది. ఒకసారి మీరు ఈ పత్రికను మీ పిల్లలకోసం తెప్పించారంటే ఇక ఇటువంటి ప్రోత్సాహకాల సంగతి పట్టించుకోకుండా ఎప్పటికీ తెప్పిస్తూనే ఉంటారు.

సరస్వతీ కుమార్

ఐదు సుప్రసిద్ధ గ్రంథాలు

నేను చదివిన వాటిలో నాకు నచ్చిన పుస్తకాలను ఈ బ్లాగులో నేను పరిచయం చేస్తుంటాను. కానీ ఈ టపాలో మాత్రం నేను చదవాలనుకుని చదవలేకపోయిన కొన్ని ప్రసిద్ధ గ్రంథాల గురించి పరిచయం చేయాలనుకుంటున్నాను. అవి

1. The Tale of Genji: ఇది 11వ శతాబ్దపు నాటి ఒక జపనీస్ నవల. మురసాకి షికుబు అనే మహిళచే రాయబడిన ఈ గ్రంథాన్ని ప్రపంచంలో మొట్టమొదటి నవలగా పరిగణిస్తారు. ఇది యదార్థ సంఘటనలను అనుసరిస్తూ రాయబడిన ఒక ప్రేమగాథ. జపనీయులు ఈ గ్రంథాన్ని తమ వారసత్వ సంపదగా భావిస్తారు. చాలా సంవత్సరాల క్రిందట ఈ గ్రంథాన్ని సాహిత్య అకాడెమి వారు ‘గెంజి గాథ’ పేరుతో తెలుగులోకి అనువదించి ప్రచురించారు. ప్రస్తుతం ఈ తెలుగు అనువాదం మార్కెట్లో లభ్యం కావడం లేదు. గ్రంథాలయాలలో ప్రయత్నించవచ్చు. ఆంగ్లానువాదాన్ని నెట్ నుండి ఉచితంగా పొందవచ్చు.

2. Thus Spoke Zarathustra: ఇది జర్మన్ తత్వవేత్త నీషే రాసిన సుప్రసిద్ధ గ్రంథం. జర్మన్‌లు దీనినొక అమూల్య గ్రంథంగా పరిగణిస్తుంటారు. నాజీ ఆలోచనా విధానానికి ఈ గ్రంథమే ప్రాతిపదిక. పార్శీ మత స్థాపకుడైన జతురాష్ట్ర ఈ గ్రంథంలోని జతురాష్ట్ర ఒకరు కాదు.

3. The Book of Five Rings: ఇది మధ్యయుగాలకు చెందిన మియామోటో ముషాషి (Miyamoto Musashi 1584 –1645) అనే పేరుగల అజేయుడైన ఒక జపనీస్ యోధుని రచన. ఇతడిని ద్వంద యుద్ధంలో వధించాలని అనేమంది ప్రత్యర్థులు ఇతడి జీవితపర్యంతం ప్రయత్నించారు. రకరకాల ఎత్తుగడలు వేశారు. కానీ ఇతడు ప్రతీ యుద్ధంలోనూ ప్రత్యర్థులను విజయవంతంగా హతమార్చాడు. అపజయమన్నది ఎరుగక చివరికి సహజమరణం ద్వారానే ఈ లోకాన్ని వీడాడు. ఒకసారి అనుసరించిన ఏ ఎత్తుగడను మరోసారి అనుసరించకపోవడమే ఇతడి విజయరహస్యం. అటువంటి మహాయోధుని రచన ఈ The Book of Five Rings.

4. The Book of the Courtier. ఇది బల్డసార్ కాస్టిగ్లియోన్ (Baldassare Castiglione 1478 – 1529) అనే ఒక స్పానిష్ ఆస్థాన విధ్వాంసుని రచన. ఇటాలియన్ భాషలో రాయబడినది. ఇది ఐరోపా పునర్వికాస కాలపు ప్రముఖ రచన. How to behave like a gentleman అనే అంశం మీద రాయబడిన ఈ గ్రంథం యూరోపియన్ రాజవంశాలకు, తద్వారా యూరోపు కంతటికీ నాగరిక ప్రవర్తన నేర్పిన గ్రంథంగా ఖ్యాతి పొందినది.

5.బయోగ్రఫీ ఆఫ్ ఎల్లోకిడ్ వీల్: ఇది Yellow Kid” Weil (1875— 1976) అని పిలువబడే ఒక అమెరికన్ మోసగాడి ఆత్మకథ. జీవితమంతా అమాయకప్రజలను మోసం చేయడమే వృత్తిగా జీవించిన ఇతను చివరికి తన అనుభవాలన్నింటినీ తన ఆత్మకథ అయిన ఈ గ్రంథంలో  రాసాడు.To get something for nothing అనే సామాన్య ప్రజల పేరాశే అను చేసిన అన్ని మోసాలకు ఆధారం అన్నది ఇతని వివరణ.

సన్-జు ‘యుద్ధకళ’

జీవితంలో యుద్ధం అనివార్యమైనది. దుష్టుడు యుద్ధాన్ని ఆరంభిస్తాడు; శిష్టుడు ఆ యుద్ధాన్ని ముగిస్తాడు. యుద్ధం చేయాలా వద్దా అని నిర్ణయించుకోగల స్వేచ్ఛ ఎవరికీ ఉండదు. ఎవరైనా సరే మనుగడ కోసం, ఆత్మగౌరవం కోసం, విజయాన్ని సాధించడం కోసం యుద్ధం చేసితీరాలి. నీవు శాంతి కాముకుడవు అయినా కూడా యుద్ధం చేయక తప్పదు. ఎందుకంటే శాంతి యుద్ధాన్ని నిరాకరిస్తే రాదు; యుద్ధం చేస్తే వస్తుంది. మనిషి జీవితంలో యుద్ధమనేది ఒక నిరంతర ప్రక్రియ.

అటువంటి యుద్ధానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని సుబోధకంగా వివరించే ఓ చిరు గ్రంథాన్ని ఇప్పుడు నేను మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. ఆ గ్రంథం పేరు The Art of War. ఇది ప్రపంచంలోకెల్లా అత్యంత ప్రాచీన యుద్ధతంత్ర గ్రంథం. ఈ గ్రంథ రచయిత క్రీ.పూ.6వ శతాబ్దానికి చెందిన చైనా దేశపు సైనిక వ్యూహకర్త అయిన సన్–జు. ఇతడు ‘వు’ రాజ్య సేనానిగా పనిచేసి అనేక యుద్ధాలలో విజయం సాధించాడు. ఈ గ్రంథాన్ని చైనీస్ లో ‘పింగ్ ఫా’ అని అంటారు. ఈ గ్రంథం ప్రపంచ ప్రసిద్ధి చెందినది. చరిత్రలో ఎన్నో యుద్ధ గతులను, వాటి ఫలితాలను ప్రభావితం చేసింది. ప్రాచ్య, పాశ్చాత్య దేశాలకు చెందిన ఎందరో సేనానులు ఈ గ్రంథం లో వివరించిన వ్యూహాలను ఆచరించి విజయాన్ని తమ స్వంతం చేసుకున్నారు.

నెపోలియన్, మావో సేటుంగ్, హొచిమిన్ వంటి రణతంత్రవేత్తలు, హెన్రీ కిసింజర్ వంటి రాజనీతి కోవిదుడు; ఇంకా ఇటువంటి వారు అనేక మంది ఈ గ్రంథాన్ని నిత్యపఠనీయ గ్రంథంగా పరిగణించారు. మరిముఖ్యంగా ఈ గ్రంథంతో నెపోలియన్‌కున్న అనుబంధం ప్రత్యేకమయినది. ఈ గ్రంథం యొక్క ఫ్రెంచ్ అనువాదం ఫ్రాన్సు దేశంలో ఓ ‘నెపోలియన్’ రూపొందడానికి కారణమయినదంటే అది అతిశయోక్తి కాదు. వియత్నాం యుద్ధకాలం నుండి అమెరికన్ సైనికాధికారులలో ఈ గ్రంథం విశేషమైన ఆదరణను పొందుతున్నది. వారి యుద్ధ వ్యూహాలన్నీ ఈ గ్రంథం మీదనే ఆధారపడి ఉంటాయి.

(ఆధునిక యుద్ధానికి రూపురేఖలందించిన నెపోలియన్ తను నిదురించే సమయంలో సైతం ఈ గ్రంథాన్ని చెంతనే ఉంచుకొనేవాడు.

ఆధునిక కాలంలో వామపక్ష గెరిల్లా పోరాటాలకు మార్గదర్శకంగా ఉన్న గ్రంథం ‘గెరిల్లా వార్‌ఫేర్ ‘. దీనిని చైనా నాయకుడు మావో సన్-జు ‘యుద్ధతంత్రం’ ఆధారంగానే రచించాడు.

ఈ గ్రంథంలో సన్-జు ప్రతిపాదించిన సూత్రాలను అనుసరించడం వలనే వియత్నాం లాంటి చిన్నదేశం, పేదదేశం అమెరికాలంటి అతిపెద్దదేశం, అపరిమితమైన ఆర్ధికశక్తి, సైనికశక్తి ఉన్న దేశాన్ని ఓడించడం జరిగినది.20 వ శతాబ్దపు ద్వితీయార్థంలో జరిగిన ఈ యుద్ధం ‘వియత్నాంయుద్ధం’గా చరిత్ర ప్రసిద్ధి చెందింది.ఈ యుద్ధంలో వియత్నాంకు నాయకత్వం వహించిన హొచిమిన్ ఈ గ్రంథాన్ని చైనీస్ నుండి తమ దేశప్రజల మాతృభాషలోకి అనువదించాడు. ఈ యుద్ధ సమయంలోనే అమెరికా సైనికాధికారులు వియత్నాం గెలుపులో కీలక పాత్ర వహించిన ఈ గ్రంథం గురించి తెలుసుకుని అప్పటినుండి ఈ గ్రంథాన్ని అధ్యయనం చేయడం ప్రారంభించారు.

కొంతకాలం క్రిందటివరకు సంపన్న పాశ్చాత్యుల డైనింగ్ టేబుల్ సంభాషణలలో ఈ గ్రంథం గురించి చర్చించడం ఒక ఫ్యాషన్.

ఈ గ్రంథాన్ని అధ్యయనం చేసిన తరువాతే పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ భారతదేశం మీద కార్గిల్ యుద్ధానికి రూపకల్పన చేశాడు.)

ఈ గ్రంథానికి అనేక విశిష్టతలున్నాయి. ఇది ఏదో ఒక కాలానికి మాత్రమే పరిమితమైన గ్రంథం కాదు. ప్రాచీన కాలంలో రచింపబడిన ఈ గ్రంథం నేటి ఆధునిక కాలంలో కూడా అనుసరింపదగినదిగా ఉండి అంతకంతకూ తన ప్రాధాన్యతను పెంచుకుంటూనే ఉన్నది. అలాగే ఈ గ్రంథం ఏదో ఒక రంగానికి మాత్రమే పరిమితమైనది కాదు. ఇందులో వివరించిన వ్యూహాలు కేవలం సైనిక పరంగానే కాక ఇతర రంగాలకు కూడా అన్వయించుకునే విధంగా ఉంటాయి. అందుకే ఈ గ్రంథం సైనికరంగంతో పాటుగా రాజకీయ, వ్యాపార, మానేజిమెంట్ వంటి అనేక ఇతర రంగాలలో కూడా విశేషమైన వ్యాప్తిని పొందినది.

విషయాన్ని నైతిక దృక్పథంతో బోధించే గ్రంథాలు అనేకం ఉంటాయి. కానీ వాస్తవ దృక్పథంతో బోధించే గ్రంథాలు అరుదుగా ఉంటాయి. అటువంటి అరుదైన గ్రంథం ఈ The Art of War. ఇది ఒక వ్యక్తిత్వ వికాస గ్రంథం. మానవ సంబంధాలలో మనకు తరచూ ఎదురయ్యే అనేక సమస్యలను ఈ గ్రంథంలో వివరించిన వ్యూహాలను అవగాహన చేసుకోవడం ద్వారా ఎదుర్కోవచ్చు. ఇది ఒక మానసిక శాస్త్ర గ్రంథం. ఎదుటిమనిషి అంతరంగాన్ని అంచనా వేయడానికి ఈ గ్రంథం ఎంతైనా ఉపకరిస్తుంది.

ఈ గ్రంథానికి ఆంగ్లభాషలో అనేక అనువాదాలున్నాయి. వాటన్నింటిలోకీ Lionel Giles యొక్క అనువాదం ప్రామాణికమైనదిగా పరిగణింపబడుతున్నది. ఇంటర్‌నెట్‌లో ఈ గ్రంథం యొక్క Giles అనువాదాన్ని వ్యాఖ్యాన సహితంగా ప్రోజెక్ట్ గుటెన్‌బర్గ్ అందిస్తున్నది. వ్యాఖ్యాన రహితంగా అనేక వెబ్‌సైట్లు అందిస్తున్నాయి. Thomos Cleary యొక్క అనువాదాన్ని www.sonshi.com అనే వెబ్‌సైట్ అందిస్తున్నది.

మాకియవెల్లి యొక్క ప్రఖ్యాత రచన ‘ద ప్రిన్స్’ తో సమానంగా, ప్రపంచవ్యాప్త ఆదరణ చూరగొన్న ఈ గ్రంథాన్ని మీరు కూడా చదవండి!

 

‘ద ఆర్ట్ ఆఫ్ వార్’ తెలుగు అనువాదం ‘యుద్ధకళ’ను ఇక్కడ చదవండి.

‘ద ఆర్ట్ ఆఫ్ వార్’ తెలుగు అనువాదం ‘యుద్ధకళ’ను ఇక్కడ కొనండి

 

 

చెస్టర్‌ఫీల్డ్ ఉత్తరాలు

ప్రపంచానికి రాజనీతిని బోధించే కార్యాన్ని మాకియవెల్లి నెరవేర్చాడు. యుద్ధకళను బోధించే పనిని సన్–జు నిర్వర్తించాడు. ప్రేమపాఠాలు ఒవిడ్ నేర్పాడు. అలాగే ఎదుగుతున్న బాలలు, విశాల ప్రపంచంలోకి అడుగిడబోతున్న యువత తెలుసుకోవలసిన విషయాలను, అలవరచుకోవలసిన అలవాట్లను, పొందవలసిన క్రమశిక్షణను లార్డ్ చెస్టర్‌ఫీల్డ్ బోధించాడు.

చెస్టర్‌ఫీల్డ్ (1694-1773) ఇంగ్లాండు దేశపు కులీన వర్గానికి చెందినవాడు. ఇతడు ఆనాటి తన దేశప్రభుత్వంలో ఎన్నో ఉన్నతస్థాయి పదవీ బాధ్యతలు నిర్వర్తించాడు. ఇతడు 1732 లో జన్మించిన తన కొడుకు ఫిలిప్‌ను ప్రయోజకుడైన మరియు సమర్థుడైన వ్యక్తిగా తీర్చిదిద్దాలనే ఉద్దేశ్యంతో అతని బాల్యదశ నుండి 30సంవత్సరాలపాటు 400కు పైగా ఉత్తరాల ద్వారా ప్రాపంచిక విజ్ఞానాన్ని అత్యంత ఆసక్తికరంగానూ, సులభగ్రాహ్యమైన శైలిలోనూ బోధించాడు. అతి మనోహరమైన భాషాసౌందర్యంతోనూ, అతి విలువైన బోధనతోనూ విలసిల్లే ఆ ఉత్తరాలు చెస్టర్‌ఫీల్డ్ మరణానంతరం ప్రచురింపబడి ఆంగ్ల ప్రజానీకం యొక్క హృదయాలను హత్తుకున్నాయి.

ఇటువంటి విషయాలను బోధించినవారు చెస్టర్‌ఫీల్డ్‌కు ముందూ ఉన్నారు, తరువాత కూడా ఉన్నారు. కానీ వారందరిలోనూ చెస్టర్‌ఫీల్డ్ యొక్క స్థానం అద్వితీయమైనది. మరిముఖ్యంగా నేటికాలంలో వ్యక్తిత్వవికాసం పేరుతో అనేక గ్రంథాలు మనకు మార్కెట్లో ప్రత్యక్షమవుతున్నాయి. అనేకమంది వ్యక్తిత్వవికాసనిపుణులమంటూ భారీ ఫీజులు వసూలు చేసి క్లాసులు నిర్వహిస్తున్నారు. అవన్నీ చదివినంతసేపూ, విన్నంతసేపూ ఉత్తేజభరితంగా ఉంటాయి. కానీ తరువాత ఏ ఒక్క విషయంగూడా మన మనసులో నిలిచి ఉండదు, మన ప్రవర్తనను ప్రభావితం చేయదు—వెరసి వెచ్చించిన మొత్తమంతా, పడిన ప్రయాసంతా వ్యర్థం. కానీ చెస్టర్‌ఫీల్డ్ యొక్క ఈ బోధను ఒక్కసారి అధ్యయనం చేస్తే ఏ ఒక్క విషయాన్నీ కూడా జీవితంలో మరెన్నటికీ మరువలేము. నిజమైన వ్యక్తిత్వానికి నిచ్చెనమెట్లు ఈ చెస్టర్‌ఫీల్డ్ ఉత్తరాలు.

నేటికాలపు బోధకుల లక్ష్యం డబ్బుసంపాదన. కనుక వారు ప్రత్యర్థులతో ఉన్న పోటీని మరియు మార్కెట్ ట్రెండును దృష్టిలో ఉంచుకుని రాసుకుపోతూ, చెప్పుకుపోతూ ఉంటారు. విద్యార్థులను ఆకర్షించగల అనవసర విషయాల ప్రస్తావనే వారి బోధనలో అధికం. నిజంగా వ్యక్తిత్వానికి పునాదిగా నిలబడగలిగిన విషయాలేవీ అందులో ఉండవు.

చెస్టర్‌ఫీల్డ్ కు ఈ ఉత్తరాలు రాసేటపుడు ఇవన్నీ ఈ విధంగా ప్రచురించబడగలవన్న ఆలోచనేలేదు. కేవలం తన కుమారుడిని ఉత్తమ వ్యక్తిగా తీర్చిదిద్దాలన్న ఓ తండ్రికి ఉండే సహజమైన అభిలాషతో చిత్తశుద్ధితోనూ, లక్ష్యశుద్ధితోనూ ఆంతరంగికంగా రాసిన ఉత్తరాలు ఇవి. ఓ తండ్రికి ఉండే ఆరాటమే కాక చెస్టర్‌ఫీల్డ్, తాను స్వయంగా ఉన్నత విద్యావంతుడు గావడం, ప్రభువంశీకుడుగావడంతో విలువలయెడల, క్రమశిక్షణ గలిగిన జీవితం యెడల, నాగరిక జీవనశైలి యెడల పట్టుదల గలిగినవాడవటం, ఉన్నతస్థాయి రాజోద్యోగిగా అనేక ప్రాంతాలలో అనేక మంది వ్యక్తులతో కలసి పనిచేసి గడించిన లోకానుభవం, మనోహరమైన ఆంగ్లభాషను రాయగలిగే సామర్థ్యం—ఇవన్నీ కలసి అత్యంత విలువైన బోధ ఈ ప్రపంచానికి అందడానికి కారణమయ్యాయి.

ఈ బోధనకు మరో విశిష్టత కూడా ఉన్నది. ఇవి ఆధునిక యుగారంభంలో రాయబడినా కూడా ఫ్రెంచి విప్లవ భావజాలంగానీ, అక్టోబర్ విప్లవ భావజాలంగానీ మానవుడి ఆలోచనావిధానాన్ని ప్రభావితం చేయడానికన్నా ముందే రాయబడ్డాయి. ఈ రెండు విప్లవాలు మానవాళికి ఎంతో మేలు చేసిన సంగతి అలా ఉంచితే, అవి మోసుకువచ్చిన నూతనభావజాలం మూలంగా మానవుడు తరతరాలుగా కాపాడుకుంటూ వస్తున్న కొన్ని ముఖ్యమైన విలువలను అనివార్యంగా వదులుకోవాల్సి వచ్చింది. అటువంటి పరిణామం జరగడానికంటే ముందే రాయబడటంతో చెస్టర్‌ఫీల్డ్ ఉత్తరాలు మనిషి అలవరచుకోవలసిన కల్తీలేని అసలుసిసలు విలువలతో అలరారుతూ ఉంటాయి.

ఆంగ్లభాషలో నైతికవర్తనకు పర్యాయపదంగా Victorian అనే పదం ఎలా స్థిరపడిపోయిందో, నాగరిక ప్రవర్తనకు పర్యాయపదంగా chesterfieldian అనే పదం స్థిరపడిపోయింది.

చెస్టర్‌ఫీల్డ్ తన స్వంత కొడుకుకు మరియు పెంపుడు కొడుకుకు రాసిన అన్ని ఉత్తరాలు కలిపి కొన్ని వందల సంఖ్యలో ఉంటాయి. వాటిలో చాలావరకూ సుదీర్ఘమైన ఉత్తరాలే. అవన్నీ కలిపితే పెద్ద ఉద్గ్రంథమే అవుతుంది. కనుకనే కాలక్రమంలో Best Letters, Selected Letters లాంటి పేర్లతో కొన్ని ముఖ్యమైన ఉత్తరాలనో లేక ఆ ఉత్తరాలలోని కొన్ని ముఖ్యభాగాలనో సంకలనం చేసిన గ్రంథాలు ప్రచురింపబడ్డాయి. అయితే 1861 లో “Lord Chesterfield’s Advice to His Son on Men and Manners” పేరుతో ప్రచురింపబడిన ఓ చిరుగ్రంథం మరింత విశిష్టమైనది. ఆ గ్రంథంలో చెస్టర్‌ఫీల్డ్ తన ఉత్తరాలలో బోధించిన విషయాలన్నింటినీ అంశాలవారీగా విభజించి, ఒకానొక అంశం గురించి అనేక ఉత్తరాలలో బోధించిన సందర్భంలో వాటిలో పునరావృతాలను వదిలేస్తూ, ముఖ్యమైన వాక్యాలను మాత్రం ఒక చోటకు చేర్చి ఆయన బోధనల సారాన్నంతటినీ సంక్షిప్తంగా అందించడం జరిగినది. ఆ గ్రంథాన్నే నేను మీకు సిఫార్సు చేయాలనుకుంటున్నాను. ఈ గ్రంథం యొక్క స్కానింగ్ కాపీని “ఇంటర్నెట్ ఆర్చివ్” అనే వెబ్‌సైట్ నుండి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకొని చదువుకోండి…..అనేక విలువైన సలహాలు, సూచనలు పొందడంతోపాటు చెస్టర్‌ఫీల్డ్ యొక్క ఆంగ్లవాక్య నిర్మాణశైలిని ఆస్వాదించండి।

(చెస్టర్‌ఫీల్డ్ సలహాలను మరికొంత విపులంగా చదవాలనుకుంటే పేరుకు తగ్గట్లుగానే బెస్ట్‌గా ఉండే ఈ బుక్‌ని చదవండి)

వంద మంచి పుస్తకాలు

నేను చదివిన పుస్తకాలలో నాకు నచ్చినవి, చదవడం వలన నాకు తృప్తినిచ్చినవి అయిన పుస్తకాలను జ్ఞాపకం చేసుకుంటూ ఒక list రాయగా అవి సుమారు ఒక వంద దాకా వచ్చాయి. నా personal library చూసి రాస్తే ఈ సంఖ్య మరికొంత పెరిగేదేమో. ఇందులో మొదట పేర్కొన్న కొన్ని గ్రంథాలు మాత్రం Highly recommended. ప్రతి ఒక్కరూ తప్పక చదవవలసిన పుస్తకాలవి.

నేను ఈ బ్లాగులో ‘మంచి పుస్తకం’ శీర్షికతో నేను చదివిన వాటిలో కొన్ని మంచి పుస్తకాలను పరిచయం చేశాను. ఆ పని నా మిగతా ప్రోజెక్టులలాగే తాత్కాలికంగా ఆగిపోయింది. ఆ పని తిరిగి ఎప్పుడు ప్రారంభిస్తానో, ఆ శీర్షిక ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేను. అందాకా ఈ లిస్ట్ చూడండి. నేను ఎప్పటికి పరిచయం చేసినా కూడా అవి దాదాపూ ఈ పట్టికలోనివి మాత్రమే అయి ఉంటాయి.

1.భగవద్గీత-శిష్ట్లా సుబ్బారావు వ్యాఖ్యానం

2.భారతజాతికి నా హితవు-స్వామి వివేకానంద

3.Glimpses of World History- Jawaharlal Nehru

4.ఆత్మకథ-మహాత్మా గాంధి

5.యం.యన్.రాయ్ స్వీయగాథలు

6.ఆత్మవికాసము (self unfoldment)-స్వామి చిన్మయానంద

7.The Prince- Machiavelli

8.Letters to His Son-Lord Chesterfield

9.The 48 Laws of Power-Robert Greene

10.The Art of Seduction-Robert Greene

11.The 33 Strategies of War-Robert Greene

12. The Art of Love-Ovid

13.The Art of War-Sun-Tzu

14. రాజయోగం-స్వామి వివేకానంద

15.శ్రీమదాంధ్ర మహాభారతం-పిలకా గణపతి శాస్త్రి

16.స్తోత్ర రత్నావళి-వివిధ దేవతా స్తోత్రాల సంకలనం

17.చలం-బిడ్డల శిక్షణ

18.భర్తృహరి సుభాషితాలు-ఏనుగు లక్ష్మణకవి (అనువాదం)

19.గీతగోవిందం-భక్త జయదేవుడు

20.శ్రీమద్భాగవతం-భక్త పోతన

21. భారతజాతీయ పునరుజ్జీవనం

22.వీరభారతం-పురిపండ అప్పలస్వామి (1857 తిరుగుబాటు)

23.మన చరిత్ర- ఏటుకూరి బలరామమూర్తి

24.ఆంధ్రుల సంక్షిప్త చరిత్ర-ఏటుకూరి బలరామమూర్తి

25.భారతీయ సంస్కృతి– ఏటుకూరి బలరామమూర్తి

26.ఉపనిషత్ చింతన-ఏటుకూరి బలరామమూర్తి

27.సాధన రహస్యం-అనుభవానంద స్వామి

28.రాహుల్ సాంకృత్యాయన్ జీవిత చరిత్ర-ఓబుల్ రెడ్డి

29.విశ్వదర్శనం-నండూరి రామమోహనరావు (ప్రాచ్య, పాశ్చాత్య తత్త్వశాస్త్రాల పరిచయం)

30.స్వీయచరిత్రము-కందుకూరి వీరేశలింగం

31.కన్యాశుల్కం-గురజాడ అప్పారావు

32.లెనిన్ జీవిత చరిత్ర-మరియా ప్రిలెజాయెవ

33.విప్లవపథంలో నా పయనం-పుచ్చలపల్లి సుందరయ్య

34.వీర తెలంగాణ-రావినారాయణ రెడ్డి

35. కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక-మార్క్స్ మరియు ఎంగెల్స్

36. రాజ్యం-విప్లవం-లెనిన్

37.The Great Road-Agnes Smidely (చైనా నాయకుడు జనరల్ ఛూటే జీవిత చరిత్ర)

38.Red Star Over China-Edgar Sno

39.అమ్మ-మాక్సిం గోర్కి

40.అసమర్థుని జీవయాత్ర-త్రిపురనేని గోపీచంద్

41.చివరికి మిగిలేది-బుచ్చిబాబు

42.ప్రాంచీల బూచి ‘బుస్సీ’-పులిచెర్ల సుబ్బారావు (ఫ్రెంచి సేనాని బుస్సీ చరిత్ర)

43.భారతదేశ స్వాతంత్ర్య సమరం-బిపిన్ చంద్ర

44.ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర-రఘునాథరావు

45.ఆధునిక ప్రపంచ చరిత్ర-తెలుగు అకాడమి (B.A.,పాఠ్య గ్రంథం)

46.ఆధునిక భారతదేశ చరిత్ర-HBT ప్రచురణలు

47.మధ్యయుగ భారతదేశ చరిత్ర-తెలుగు అకాడెమి ప్రచురణ

48.ఏడుతరాలు-అలెక్స్ హేలీ

49.సత్యాన్వేషి చలం-వాడ్రేవు వీరలక్ష్మి దేవి

50.ప్రవహించే ఉత్తేజం-చెగువెరా జీవితచరిత్ర

51.మైదానం-చలం

52.జీవితాదర్శం-చలం

53.మ్యూజింగ్స్-చలం

54.స్త్రీ-చలం

55.చలం-చలం ఆత్మకథ

56.తారాపథం (ఆకాశంలో కనిపించే నక్షత్రాలు, రాశులు, గ్రహాల గురించి) – కొండముది హనుమంతరావు

57.జైభవానీ! జైశివాజీ! -పులిచెర్ల సుబ్బారావు (ఛత్రపతి శివాజి చరిత్ర)

58.సైతాన్ కా బచ్చా!-పులిచెర్ల సుబ్బారావు (మొఘల్ రాజ కుటుంబం యెడల గులాంఖాదిర్ అకృత్యాలు)

59.ఓల్గా సే గంగా-రాహుల్ సాంకృత్యాయన్

60.లోకసంచార శాస్త్రం-రాహుల్ సాంకృత్యాయన్

61.పురిపండా భారతం-పురిపండ అప్పలస్వామి

62.పురిపండ రామాయణం- పురిపండ అప్పలస్వామి

63.పురిపండ భాగవతం- పురిపండ అప్పలస్వామి

64. వాత్సాయన కామసూత్రాలు

65.You Can Win-Shiv Khera

66.The Magic of Thinking Big

67.The Monk Who Sold His Ferrari-Robin Sharma

68.Mega Living-Robin Sharma

69.Who Moved My Cheese

70.Stop Worrying and Start Living-Dale Carnegie

71.How to Win Friends and Influence People- Dale Carnegie

72. Chicken Soup for The Soul

73.నేను-నాదేశం-దర్శి చెంచయ్య (గదర్ పార్టీలోని ఏకైక దక్షిణభారతీయుడు)

74.మహాప్రస్థానం-శ్రీశ్రీ

75.కృష్ణపక్షము-దేవులపల్లి కృష్ణశాస్త్రి

76.ఎంకిపాటలు-నండూరి సుబ్బారావు

77.శ్రీనాథుని చాటువులు-పోలవరపు కోటేశ్వరరావు సంకలనం

78.విజయనగరపతనం-ప్రసాద్

79.ఖారవేలుడు (ప్రాచీన కళింగ రాజు)

80.పుష్యమిత్ర

81.ఆర్య చాణక్య-ప్రసాద్

82.యుగంధర (కాకతీయ ప్రతాపరుద్రుని మంత్రి)-ప్రసాద్

83.సిరాజుద్దౌలా-ప్రసాద్

85. తెలంగాణా సాయుధ పోరాటం-ఆరుట్ల రామచంద్రా రెడ్డి

86.హెడ్గేవార్ జీవిత చరిత్ర (ఆర్.యస్.యస్.స్థాపకుడు)

87.స్వామి వివేకానంద జీవితచరిత్ర-రామకృష్ణ మఠం ప్రచురణ

88.తెలుగు సామెతలు

89.బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఆత్మకథ

90.గారీబాల్డి జీవిత చరిత్ర (ఇటలీ స్వాతంత్ర సమరయోధుడు)

91.తపోవన స్వామి ఆత్మకథ (స్వామి చిన్మయానంద గురువు)

92.సక్సెస్ మేనేజ్‌మెంట్-కంఠంనేని రాథాకృష్ణమూర్తి

93.రాళ్ళు-రప్పలు-తాపీ ధర్మారావు ఆత్మకథ

94.దేవాలయాలమీద బూతుబొమ్మలెందుకు?-తాపీధర్మారావు

95.విజయవిలాసం-తాపీవారి వ్యాఖ్య

96.మహాభగవద్గీత-ఏర్పేడు ఆశ్రమ ప్రచరణ

97.గీతామకరందం-స్వామి విద్యాప్రకాశానంద గిరి

98.మన సమస్యలకు భగవద్గీత పరిష్కారాలు-యస్.బి.రఘునాథాచార్య

99.శ్రీమద్భగవద్గీత-రావుల సూర్యనారాయణ మూర్తి

100. పాంచజన్యం-మాధవ సదాశివ గోల్వల్కర్ (బైబిల్ ఆఫ్ ఆర్.యస్.యస్.)

 

మరికొన్ని.……………

101.ఈశావాస్య ఉపన్యాసములు-పండిత గోపదేవ్ శాస్త్రి

102.కాసనోవా మెమోరీస్-కాసనోవా

103.గ్రామీణ పేదలకు–లెనిన్

104.ఏమి చేయాలి?–లెనిన్

105.మొదటి ఎత్తు–చెస్ ఆట పరిచయ గ్రంథం

106.The Art of Worldly Wisdom-Baltasar Gracian

107.ఆనంద మఠం–బంకించంద్ర ఛటర్జీ

108.భారతదేశంలో ఆంగ్లేయులు–ద్రవిడ విశ్వవిద్యాలయం వారి ప్రచురణ

మీరు భగవద్గీత చదివారా ?!

నేను చదివిన పుస్తకాలలో ఈ సారి ‘భగవద్గీత’ ను పరిచయం చేద్దామనుకుంటున్నాను. ఈ పరిచయం భగవద్గీత గురించి మీకెవ్వరికీ తెలియదనో లేక మీకందరికీ భారతీయ తత్త్వశాస్త్ర సారంగా ఆ మహా గ్రంథం యొక్క వైశిష్ట్యం ఎటువంటిదో తెలపాలనో ఉద్దేశించి రాయడంలేదు.

గీత మీద వందల సంవత్సరాల నుండి అనేక వ్యాఖ్యానాలు వచ్చినాయి. నేటికాలంలో కూడా అనేక ప్రచురణ సంస్థలు, ధార్మిక, మత సంస్థలు గీతార్ధ వివరణతో కూడిన పుస్తకాలను అనేకం ప్రచురిస్తున్నాయి. వాటిలో నేను చదివిన పుస్తకాల గురించి, గీతను అర్ధం చేసుకునే ప్రయత్నంలో నాకు తోడ్పడిన పుస్తకాలను గురించి మీకు పరిచయం చేయాలనే ఉద్దేశ్యంతో మాత్రమే ఈ వ్యాసం రాస్తున్నాను.

భగవద్గీతా పుస్తకాలు పాకెట్ సైజు నుండి మోయలేనంత బరువుండే పెద్ద గ్రంథాల వరకూ వివిధ సైజులలో లభ్యమవుతున్నాయి. గీతలో అసలు ఉన్నది మొత్తం 701  శ్లోకాలే. కేవలం ఆ శ్లోకాలే ఉండే పారాయణ గ్రంథాలతో మొదలై శ్లోకంతో పాటు కేవలం తాత్పర్యం మాత్రమే ఉండే గ్రంథాలుగా, తాత్పర్యంతో పాటు అర్థ వివరణ కూడా ఉండే గ్రంథాలుగా పుస్తకం పెరిగిపోయి క్రమంగా ఈ వివరణ విస్తారమై పోయి ఒక ఉద్గ్రంథంగా మారేంతవరకూ భగవద్గీత వివిధ సైజులలో మనకు ఇప్పుడు లభ్యమవుతున్నది.

మొదట పెద్ద గ్రంథాలతో మొదలు పెడదాము.

కొన్నాళ్ళ క్రితం అనేకమంది ఇళ్ళల్లో ‘ఇస్కాన్’ వారి భగవద్గీతే కనిపించేది. వారు మొబైల్ బుక్ స్టాల్ ద్వారా చాలా తక్కువ ధరకు నాణ్యమైన కాగితం, బైండింగ్ తో తయారైన గీతను అందించేవారు. అయితే ఇందులోని వివరణ ఓ పట్టాన అర్థమయ్యేది కాదు. కానీ ఆ గ్రంథంలో ముద్రించిన పాశ్చాత్య శైలిలో చిత్రించబడిన చిత్రాలు చాలా ఆకట్టుకునేవి. గీతను కొనడంలో ఎక్కువమంది కుండే ఉద్దేశ్యం ఆధ్యాత్మిక దృష్టే గానీ జిజ్ఞాస కాదు గనుక అర్థంకాక పోయినా ఈ గ్రంథం బాగానే ప్రచారం పొందింది. పైగా తక్కువ వెల కూడాను. దీని ఖరీదు Rs.50/-

తరువాత శ్రీకాళహస్తిలోగల శుకబ్రహ్మాశ్రమ స్థాపకులు శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వామి చే రచింపబడిన ‘గీతామకరందం’ పేరు తో ఉండే భగవద్గీత అత్యంత ప్రజాదరణ పొందింది. ఇస్కాన్ వారి గీతలా కాకుండా ఇందులోని వివరణ బాగా అర్థవుతుంది. దీని ఖరీదు కొంచెం ఎక్కువ. Rs.300/- వరకూ ఉంటుంది.

శంకరాచార్యులు, మధ్వాచార్యులు, రామానుజాచార్యులు (త్రిమతాచార్యులు) వందల సంవత్సరాల క్రితం ఒకరితో ఒకరు విభేదించుకుంటూ గీతకు భాష్యాలు రాశారు. అవన్నీ సంస్కృతంలోనే ఉన్నాయి. ఆ ముగ్గురి అభిప్రాయాలనూ క్రోడీకరిస్తూ కొందరు తమిళ పండితులు తమ భాషలో ఓ గ్రంథాన్ని రాశారు. దానిని తమిళాంధ్ర భాషా ప్రవీణులైన కీళాత్తూరు శ్రీనివాసాచార్యులు గారు తెలుగులోనికి అనువదిస్తే ‘మహా భగవద్గీత’ పేరుతో తిరుపతికి సమీపంలో గల ఏర్పేడు ఆశ్రమం వారు ప్రచురించారు. త్రిమతాచార్యుల అభిప్రాయాలతో ఈ గీత కూడా చాలా బావుంటుంది. దీని ఖరీదు  Rs.125/-

తరువాత నన్నాకట్టుకున్న పుస్తకం ఉత్తర భారతదేశానికి చెందిన జయదయాళ్ గోయందకా గారు హిందీలో ‘శ్రీమద్భగవద్గీత-తత్త్వవివేచనీ వ్యాఖ్య’ పేరుతో ఓ గ్రంథాన్ని రచించాడు. దానిని గీతా ప్రెస్ వారు తెలుగులోకి అనువదించి, ప్రచురించి Rs.80/-లకే అందిస్తున్నారు. ఈ గీతలోని వివరణ అరటిపండు వలిచి చేతిలో పెట్టినట్లుగా ఉంటుంది. మిగతా గీతలలోని వివరణకన్నా ఈ గీతలోని వివరణ చాలా విశిష్టత కలిగినది. ఒక శ్లోకంలో చెప్పిన విషయం గీతలో మరెక్కడెక్కడ ఏఏ విధంగా చెప్పబడిందీ మొదలైన వివరాలతో చాలా ఆసక్తికరంగా ఉంటుంది.

..ఇవీ నాకు తెలిసిన, నేను చదివిన పెద్ద భగవద్గీతా గ్రంథాలు.

ఇప్పుడు మధ్యస్థాయి గ్రంథాలు చూద్దాం. ఇవీ చాలా ఉన్నాయి. కానీ నన్ను ఆకట్టుకున్న పుస్తకం మాత్రం ఒకే ఒకటి. శిష్ట్లా సుబ్బారావు గారు రాసిన శ్రీమద్భగవద్గీత. ఇది తిరుమల తిరుపతి దేవస్థానం వారి ప్రచురణ. మొదట్లో దీని ఖరీదు  Rs.1/- మాత్రమే. ఇప్పుడు Rs.15/-చొప్పున విక్రయిస్తున్నారు. ఇది T.T.D. వారి ఆస్థాన గ్రంథమంటే నమ్మండి. అంత ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది T.T.D. ఈ గ్రంథాన్ని. శిష్ట్లా సుబ్బారావు గారు మంచి ఆధ్యాత్మిక దృష్టితో, భక్తిభావంతో చాలా చక్కగా, గీత గురించి పరిచయంలేని వారికి కూడా అర్థమయ్యేటట్లుగా గీతార్థాన్ని వివరించారు. నేను మొట్టమొదట  చదివిన గీత ఇదే.

ఇక తరువాత శ్లోకానికి కేవలం తాత్పర్యం మాత్రమే ఉండే చిన్నసైజు గీతా గ్రంథాలు కూడా చాలా ఉన్నాయి. వాటిలో నేను చదివినది, నాదగ్గర ఉన్నది రావుల సూర్యనారాయణ మూర్తి గారు రచించినది. ఇది కూడా T.T.D. వారి ప్రచురణే. ఇది ఇప్పుడు లభ్యమవుతున్నట్లుగా నేను గమనించలేదు. కేవలం తాత్పర్యం మాత్రమే ఉండే పుస్తకమే గనుక వీటిలో ఒక పుస్తకానికి మరోపుస్తకానికి పెద్ద తేడా ఏమీ ఉండదు.

గీతార్థ వివరణ కొరకు కొన్ని పుస్తకాలు చదివిన మీదట నేనో విషయాన్ని గ్రహించాను.  ఎవరి అర్థవివరణ వారిదే, ఏ ఒక్కరి అభిప్రాయం మిగతావారి అభిప్రాయం తో కలవటం లేదని గ్రహించాను. దాని మీదట నేను ఈ గీతార్థాలను వివరించే పుస్తకాలన్నింటినీ మానేసి కేవలం తాత్పర్యం మాత్రం ఉండే ఈ ఒక్క పుస్తకానికే చాలాకాలంపాటు పరిమితమయ్యాను. నా అర్థాలేవో నేనే వివరించుకోవచ్చులే అనుకున్నాను. అలాగే నాకు తోచిన అర్థాలలో కొన్నింటిని నా ‘శంఖారావం’ బ్లాగులో “భారతదేశానికి ఎటువంటి వ్యవస్థ కావాలి..?!” వ్యాసావళిలో (రెండవ అధ్యాయంలో) మీకు వివరించడం జరిగినది.

ఇక కేవలం శ్లోకాలు మాత్రమే ఉండే ‘పారాయణ గీత’ గురించి వివరించడానికేమీ లేదు.

చివరగా గీతార్థాన్ని వివరించే పుస్తకాలలో ఒక విశిష్టమైన పుస్తకాన్ని మీకు పరిచయం చేస్తాను. ఇది కూడా T.T.D. వారి ప్రచురణే. రచయిత S.B. రఘునాథాచార్య గారు. ఇది ఎంతటి ప్రజాదరణ పొందినదో చెప్పలేము. దానిపేరు ‘మన సమస్యలకు భగవద్గీత పరిష్కారాలు’. ఇందులోని వివరణ గీతలోని అధ్యాయాల క్రమంలోగానీ, శ్లోకాల క్రమంలోగానీ ఉండదు. మనలో ఎక్కువ మందికి తరచూ వచ్చే సందేహాలు, ఎదురయ్యే సమస్యలు.. మొదలైన వాటికి గీతలో ఎటువంటి పరిష్కారం, సమాధానం సూచించబడిందో సంక్షిప్తంగా తెలియజేస్తుంది. ఇది కూడా చిన్న గ్రంథమే. ఓ వందపేజీలుంటుంది. దీనిలో గీతలోని ప్రతి శ్లోకమూ ఉండదు. ఏవో కొన్ని శ్లోకాలు మాత్రమే ఉంటాయి. దాని ఖరీదు అప్పట్లో Rs.1/-ఉండేది. ఇప్పుడు Rs.6/-

చివరిగా పై పుస్తకాలన్నీ దొరికే ప్రదేశాల గురించి చెప్పుకుందాం. గీతా ప్రెస్ పుస్తకాలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో 1 వ నంబరు ప్లాట్‌ఫాం మీద వారి స్టాల్ ఉన్నది. కాచీగూడలోని బాలసరస్వతీ బుక్ డిపోలో కూడా గీతా ప్రెస్ వారి పుస్తకాలు దొరుకుతాయి. ఈ బాలసరస్వతీ బుక్ డిపోలోనే గీతామకరందం, మహా భగవద్గీత కూడా దొరికే అవకాశం ఉంది. ఇక ఇస్కాన్ వారి గ్రంథానికి నాంపల్లి లోని వారి టెంపుల్ లో వారి స్టాల్ ఉన్నది. T.T.D. వారి గ్రంథాలు అనేక పట్టణాలలో ఉన్న వారి కళ్యాణ మండపాలలో ఉన్న వారి స్టాల్స్ లో దొరుకుతాయి. ఇంకా విశాలాంధ్రలో, మామూలు బుక్ స్టాల్స్‌లో కూడా ప్రయత్నించవచ్చు. తిరుమల వంటి పుణ్యక్షేత్రాలలో అయితే వాళ్ళ ప్రచురణలు విక్రయించే స్టాల్స్‌తోపాటు గీతాప్రెస్స్ వంటి ఇతరుల స్టాల్స్ కూడా ఉంటాయి.

తాత్పర్యసహిత భగవద్గీతనుఇక్కడ చదవండి.

పారాయణగీతను ఇక్కడచదవండి.

మంచి పుస్తకం-Power, Seduction and War (by Robert Greene)

సాధారణంగా ‘లౌక్యం, వ్యవహార దక్షత లాంటి విషయాలనూ, ఎత్తుకు పై ఎత్తు వేసే నైపుణ్యం, వ్యూహ ప్రతివ్యూహాలను పన్నే చాణక్యం.. వంటి విషయాలనూ మాటలలో వివరించడం సాధ్యంకాదు. వాటిని స్వయంగా, అనుభవపూర్వకంగా ఎవరికివారు తెలుసుకోవలసినదే’ అనే అభిప్రాయం ఉన్నది. కానీ రాబర్ట్ గ్రీన్ (Robert Greene) అనే అమెరికన్ రచయిత చాలా నేర్పుగా, అరటి పండు వలిచి చేతిలో పెట్టినట్లుగా ఆ పరిజ్ఞాన్నంతా మనకు బోధించాడు. Power, Seduction, War అంటూ ఈయన ఆ పరిజ్ఞానాన్నంతా మూడు విభాగాలుగా చేశాడు. ఒక్కొక విభాగానికి ఒక్కొక గ్రంథం చొప్పున మూడు గ్రంథాలు రచించాడు.

మొదటి విభాగమైన Power గురించి వివరించడానికి The 48 Laws of Power అనే గ్రంథం రాశాడు. మనం ఎదుటివారి మీద upper hand సాధించడానికి ఏ విధమైన లక్షణాలను కలిగి ఉండాలి, ఏవిధంగా వ్యవహరించాలి  అనే విషయాలను మొత్తం 48 సూత్రాల రూపంలో పొందుపరస్తూ ఈ పుస్తకం రాశాడు. ఈ పుస్తకం యొక్క సారాంశాన్ని అంటే ఈ 48 సూత్రాల యొక్క వివరణనూ క్లుప్తంగా నేను నా సుధర్మ బ్లాగులో అందించాను. (ఒక్కొక సూత్రానికి ఒక టపా చొప్పున)

రెండవ గ్రంథం  The Art of Seduction. ‘వశీకరణం’- అంటే ఎదుటిమనిషిని లోబరచుకోవడం- గురించి దీనిలో చర్చించాడు. Sex, Wealth, Power or Favor.. ఇలాంటి వాటిని ఎదుటివారి నుండి పొందటం కొరకు ఏ విధమైన పద్దతులను అవలంబించాలో, ఎలా ప్రవర్తించాలో ఇందులో విపులంగా వివరించాడు.

ఇక మూడవ గ్రంథం The 33 Strategies of War . మన ప్రత్యర్థిని అమాయకుడిగా, మన victim గా భావిస్తూ The 48 Laws of Power ను రూపొందించడం జరిగినది. కానీ మన ప్రత్యర్థి మనలాగే Power Player అయిన పక్షంలో అతని మీద మనం ఏ విధంగా upper hand సాధించాలి అనే దాన్ని వివరించడానికి ఈ The 33 Strategies of War  అనే గ్రంథం రాశాడు.

ఈ మూడు గ్రంథాలూ సాధారణమైన వ్యక్తిత్వ వికాస గ్రంథాల్లా ఉండవు. పాజిటివ్ యాటిట్యూడ్, టైం మేనేజ్‌మెంట్, గోల్ సెట్టింగ్ ..ఇలా ఉండదు వివరణ. చరిత్రలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందించబడిన నియమాలు, సూత్రాలతో (Laws and Principles) వివరణ అత్యంత ఆసక్తికరంగా ఉంటుంది. These all principles are timeless and ruthless.

ఇవి శ్రీరంగ నీతులు అసలేకావు. పైగా అందుకు విరుద్ధమైనవి. సాధారణంగా మంచితనం, మానవత్వం, నిజాయితీ, మర్యాద-మన్నన, సత్యవాక్పరిపాలన, అపకారికి కూడా ఉపకారం చేయడం.. ఇలాంటి “సలక్షణాల”ను మనం ఉన్నత విలువలుగా భావిస్తుంటాం. కానీ ఈ గ్రంథాలు చదివిన తరువాత ఈ లక్షణాలన్నీ మనలను ఏ విధంగా బలహీనులుగా మారుస్తున్నాయో; మనలోని ఈ విధమైన లక్షణాలను ఆసరాగా చేసుకుని కొందరు ఏ విధంగా మన మీద పెత్తనం చెలాయిస్తున్నారో కొందరైతే మనలను ఏ విధంగా అణచివేతకు గురిచేస్తున్నారో, ఏ విధంగా మన వినాశనానికి కారణమౌతున్నారో మనకు బోధపడుతుంది.

రచయిత మనకు బోధించే విషయాలు ఒక్కోసారి కుట్రలు, కుతంత్రాల రూపంలో ఉంటాయి. కానీ మనం ఒక విషయాన్ని గ్రహించాలి. మనం ఉన్నత విలువలు అని వేటినైతే భావిస్తున్నామో అవి నిస్సందేహంగా ఉన్నతమైనవే. కానీ అవి సత్తెకాలంలో మాత్రమే ఆచరించదగినవి. కుట్రపూరితమైన నేటి కాలంలో అవి మనలను బలి పశువులుగా మార్చడానికి తప్ప దేనికీ పనికిరావు. శ్రీరంగనీతుల నుండి ఒక్కక్షణం బయటపడి వాస్తవికతతో ఆలోచిస్తే మనకు బోధపడే విషయం ఇదే. ముఖ్యంగా సత్తెకాలపు శ్రీరంగనీతులు ఉన్నత విలువలుగా భావించబడే భారతదేశంలో ఈ గ్రంథాల పఠనం అత్యంత ఆవశ్యకం.

గుంటనక్కలు, తోడేళ్ళు సంచరించే ఈ లోకంలో మోసాలు, కుట్రలు, కుతంత్రాలు ఇటువంటి మర్మాలేవీ తెలియకుండా అంతా భగవంతుడే చూసుకుంటాడనుకునే భక్తితత్త్వ ధోరణితో అమాయకంగా ఉంటే మంచివాళ్ళం, గంగిగోవులం  అనిపించుకుంటామేమోగానీ ఆ మోసాలు, కుట్రలు, కుతంత్రాలు చేసేవారికి మనం బలైపోకుండా మనలను ఆ భగవంతుడుకూడా రక్షించలేడు.

The Art of Seduction గ్రంథంలో సాధారణ సభ్య సమాజం అంగీకరించని ఎత్తుగడలను రచయిత చాలా వాటినే వివరిస్తాడు. అయితే మనం ఈ విషయాలన్నింటినీ తెలుసుకునేది వాటిద్వారా అమాయకులను బలితీసుకోవాలని కాదు. స్వయంగా మనం ఈ గుంటనక్కలు, తోడేళ్ళ బారిన పడి బలై పోకుండా డిఫెన్స్ చేసుకోవడం కోసం మాత్రమే. అందుకొరకైనా మనం వాటి గురించిన పరిజ్ఞానం పొందాలి. మనకు ఇంకా అవకాశం ఉంటే మనలను మనం రక్షించుకోవడమే కాకుండా అమాయకులెవరైనా ఈ తోడేళ్ళబారిన పడకుండా రక్షించనూవచ్చు. ఆ విధంగా మనం హీరోగా కూడా మారవచ్చు. అంటే ‘హీరో’ అవాలంటే ముందుగా ‘విలనీ’ ని అధ్యయనం చేయాలి. లేదంటే ఎవరో ఓ విలన్‌కు బలైపోయి మనలను రక్షించే హీరో కోసం ఎదురుచూసే అమాయక, అనామక victim గా మిగిలిపోక తప్పదు.

ఇంతకుముందు చెప్పినట్లుగా ఈ మూడు పుస్తకాలనూ కూడా రచయిత కొన్ని సూత్రాల లేక నియమాల (Laws and Principles) విపులీకరణ  రూపంలో రచించాడు. ఆ నియమాలన్నింటినీ సాధారణ చరిత్ర గ్రంథాలలో లభ్యంకాని అనేక సూక్ష్మ చారిత్రక ఘటనల ద్వారా వివరిస్తూ, అనేక మంది చారిత్రక వ్యక్తులను పరిచయంచేస్తూ, వారి గుణగణాలనూ, వారి వ్యూహ ప్రతివ్యూహాలనూ, ఎత్తుగడలనూ, వారు జీవితంలో సాధించిన విజయాలనూ, పొందిన వైఫల్యాలనూ, వాటికి కారణాలనూ అత్యంత ఆసక్తికరంగా విపులీకరించాడు.

ఒక్కొక్క పుస్తకం షుమారు 450 పేజీలు ఉంటుంది. ఒక్కొక్క దాని ఖరీదు షుమారు Rs.400/- ఉంటుంది. The 48 Laws of Power కు, The Art of Seduction కు concise editions కూడా ఉన్నాయి. వాటి ఖరీదు ఒక్కొక్కటి Rs.125/-

నాకు తెలిసినంతవరకూ ఈ గ్రంథాలకు పైరేటెడ్ కాపీలు లేవు. కనుక పుస్తకాలు కారు చవకగా దొరికే మన అబిడ్స్ సండే మార్కెట్లో ఇవి దొరకక పోవచ్చు. హైదరాబాద్‌లో అయితే హిమాలయా బుక్ షాప్ వంటి చోట్ల దొరుకుతాయి. వైజాగ్ లో అయితే పేజెస్, జ్యోతి, గుప్తా బ్రదర్స్, బుక్ సెంటర్, వాగ్దేవి లాంటి చోట్ల దొరుకుతాయి. ఇవి విశాలాంధ్రలో కూడా దొరుకుతున్నాయి.

ఈ గ్రంథాలను చదవడం ద్వారా తెలుసుకున్న విషయాలతో పోలిస్తే వీటిని కొనడానికి మనం పెట్టిన డబ్బు, చదవడానికి మనం పడిన శ్రమ, కేటాయించిన సమయం చాలా స్వల్పమే అని గ్రహిస్తారు. ఈ పుస్తకాలను చదివిన తరువాత మీరు ఒక చాణక్యుడు, ఒక మాకియవెల్లి, ఒక sun-tzu అయిపోతారంటే నమ్మండి. :b.

ఈ గ్రంథాల (PDF) eBooks ను ఈ క్రింద నుండి ఉచితంగా పొందవచ్చు.

The 48 Laws of Power

The Art of Seduction

The 33 Strategies of War

 

మంచి పుస్తకం-సాధన రహస్యము (అనుభవానంద స్వామి)

భారత దేశపు తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ చిన్న వయసులోఉన్న తన కుమార్తెకు జైలు నుండి అనేక ఉత్తరాల ద్వారా  ప్రపంచ చరిత్రను పరిచయం చేశాడు. ఆ ఉత్తరాలన్నీ గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ పేరుతో ఒక గ్రంథంగా ప్రచురింపబడ్డాయి. ఇది ఆంగ్ల సాహిత్యం లో ఒక గొప్ప గ్రంథంగా పరిగణింపబడుతున్నది. అలాగే మన తెలుగు సాహిత్యంలో కూడా ఇటువంటి గ్రంథమే ఒకటి ఉన్నది. అనుభవానంద స్వామి (1908-73) పిన్న వయసులో ఉన్న తన శిష్యురాలు మాతాజీ త్యాగీశానంద పురీ కి ఆథ్యాత్మిక మరియు సాధనా సంబంధమైన విషయాలను తెలియజేయటానికి 1946 లో అనేక ఉత్తరాలు రాశారు. ఆ ఉత్తరాలన్నీ సాధన రహస్యము అనే గ్రంథంగా ప్రచురింప బడ్డాయి.

అనుభవానంద స్వామి 1908 లో గుంటూరు జిల్లా అమృతలూరులో జన్మించారు. ఈయన ఉన్నత విద్యాభ్యాసం చేసిన మేధావి. బహుముఖ ప్రజ్ఞావంతుడు. రచనలే కాక కవిత్వం, చిత్రకళ, వడ్రంగం, శిల్పం, సంగీతం ఇత్యాది వాటన్నింటిలో ప్రవేశమేకాక ప్రావీణ్యత కూడా ఉన్నది. కళాశాలలో చదివే రోజులలో అనేక బంగారు పతకాలు కూడా సాధించాడు. ఈయన సృష్టించిన కళా ఖండాలు నేటికీ పదిలంగా ఉన్నాయి. ఈయన భారత దేశమంతటా పర్యటించిన పరివ్రాజకుడు. సుధీర్ఘ కాలం అనేక కఠిన సాధనలు చేసిన సాధకుడు. మంచి వక్త. ఆంగ్ల భాషలో ప్రావీణ్యం కలిగిన వాడు.

ఈయన రామకృష్ణ పరమహంస చూపిన  మార్గంలో సన్యసించి తన  జీవితాన్ని కొనసాగించాడు. ఈయన ప్రాచీన భారతీయ సాహిత్యాన్ని అంటే వేదాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు, దర్శనాలు మొదలైన వాటన్నింటినీ మధించి వాటిని ప్రజలకు సుబోధకంచేస్తూ విస్తృతమైన  సాహిత్యాన్ని సృజించాడు. తన సాహిత్యాన్ని అనుభవానంద గ్రంథ మాల ద్వారా ప్రజలకు అందించాడు. బాపట్ల మరియు భీమునిపట్నంలలో ఈయన ఆశ్రమాలను నెలకొల్పాడు.

ఈయన రచనలలో ప్రధానమైనది  భారతీయ ఆథ్యాత్మిక విజ్ఞానానికి ఎన్ సైక్లోపీడియా అనదగిన సర్వసిధ్దాంత సౌరభం అనే గ్రంథం. ఈ  గ్రంథాన్ని ఈయన 12 సంపుటాలలో రచించారు. ఇందులో షడ్దర్శనాలనూ మరియూ అద్వైతం, విశిష్టాద్వైతం, వైష్ణవం, శైవం, శాక్తేయం, బౌధ్దం మొదలైన అన్ని సిధ్దాంతాలనూ విస్తృతంగా చర్చించారు. ఐతే ఈ గ్రంథం పండిత స్థాయిలో ఉంటుంది. కానీ మనం ప్రస్తుతం తెలుసుకుంటున్న సాధన రహస్యం అనే గ్రంథం మాత్రం సామాన్య పాఠకులందరికీ అర్థమయ్యేటట్లుగా ఉంటుంది.

తన శిష్యురాలికోసం రాసిన ఈ ఉత్తరాలలో అనుభవానంద స్వామి చాలా సులువైన వ్యావహారిక భాషను ప్రయోగించారు. ఆవిడ చిన్న వయసులో ఉన్నపుడు, సాధనా మార్గంలోకి రాకపూర్వం ఆవిడకు ఆథ్యాత్మిక సాధనా సంబంధమైన విషయాలను పరిచయం చేయటానికి ఈ ఉత్తరాలు ఉద్దేశింపబడినవి కనుక వీటిలో ఆయన సులభమైన శైలిని ఉపయోగించారు. ఈ కారణం చేతనే సాధారణ పాఠక లోకంలో ఈ గ్రంథం చాలా ప్రాచుర్యం పొందినది.

ఈ గ్రంథంలో అనుభవానంద స్వామి కర్మ, జ్ఞాన, రాజ, భక్తి యోగాలతోపాటు వివేక వైరాగ్యాది సాధనా చతుష్టయాన్ని గురించి పామరులకు సైతం అర్థమయ్యే విధంగా విపులంగా చర్చించారు. ఈ గ్రంథం అనేక భారతీయ భాషలతోపాటు ఇంగ్లిష్, ఫ్రెంచ్, జర్మన్ లాంటి పాశ్చాత్య  భాషలలోకి కూడా అనువదింపబడింది. భారతీయ ఆథ్యాత్మిక విషయాలలోని అర్థంకాని సంక్లిష్ట విషయాల జోలికి పోకుండా ఒక సాధారణ వ్యక్తికి ఆయా విషయాల యొక్క ప్రథమ పరిచయానికి తగినట్లుగా ఈ గ్రంథం వ్రాయబడినది కనుక ఇది ప్రతి ఒక్కరూ చదువదగిన గ్రంథం.

స్వామి అనుభవానంద యోగ కేంద్ర, భీమునిపట్నం-522163, విశాఖపట్నం జిల్లా ను గానీ లేక శ్రీ అనుభవానంద గ్రంథమాల, యం.జి.రోడ్,బాపట్ల-522 101,గుంటూరు జిల్లా ను గానీ సంప్రదించి  ఈ పుస్తకాన్ని పొందవచ్చు. సాహిత్యానికేతన్ లాంటి హిందూ మత సాహిత్యం దొరికే బుక్ స్టాల్స్ లో కూడా ఈ గ్రంథం దొరుకుతుంది.

 

ఈ గ్రంథాన్ని ఇక్కడనుండి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోండి లేదా ఆన్‌లైన్లో చదువుకోండి

 

మంచి పుస్తకం-పాంచజన్యం (మాధవ సదాశివ గోల్వల్కర్)

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లేక సంక్షిప్తం గా ఆర్.యస్.యస్. దీనిని  గురించి తరచూ మనం పత్రికల లో చదువుతూ ఉంటాం. వివిధ రాజకీయ పార్టీల నాయకుల  ఉపన్యాసాల ద్వారా మరియు స్టేట్ మెంట్ల ద్వారా కూడా దీనిని  గురించి తెలుసుకుంటూ ఉంటాం. వీరిలో ఆర్.యస్.యస్.ను ఒక హిందూ మత వాద చాంధస సంస్థగా విమర్శించే వారే ఎక్కువ. దీనివలన మనకు కూడా ఆర్.యస్.యస్. గురించి ఒక నెగెటివ్ ఫీలింగ్ ఏర్పడే అవకాశం ఉంది.

జిజ్ఞాసువులు, గ్రంథ పఠనాభిలాష కలిగినవారు ఈ సిద్దాంత విభేదాలకు లోనవ్వ కూడదు. ఒక వేళ మనకు స్వంత అభిప్రాయాలున్నా కూడా వాటిని పుస్తకాల మీద చూపించకూడదు. వివిధ వాదాలను తెలిపే పుస్తకాలన్నింటినీ చదవాలి.అపుడే మనకు సరి ఐన దృక్పథం అలవడుతుంది. ఆసక్తి ఉంటే ఏ గ్రంథమైనా చదువవచ్చు. కేవలం సిద్దాంత విభేదాలతో ఒక గ్రంథాన్ని చదాలన్న ఆసక్తిని అణచుకోకూడదు.

ఏదేని ఒక విషయం గురించి తెలుసు కోవటం తప్పనిసరి అయినపుడు సరైన పద్దతిలో తెలుసుకొని దాని గురించి మన స్వంత అభిప్రాయాన్ని ఏర్పరచుకోవటం అన్నివిధాలా మంచిది. ఆలా మనం ఆర్.యస్.యస్. గురించి తెలుసుకోవాలనుకుంటే  ‘పాంచజన్యం ‘ అనే ఈ గ్రంథాన్ని చదవటం సరి అయిన పని. దీని ఆంగ్ల మూలం పేరు ‘బంచ్ ఆఫ్ థాట్స్ ‘. దీని హిందీ అనువాదం పేరు ‘విచార్ ధన్ ‘. ఇది ఆరేడు వందల పేజీల ఉద్గ్రంథం. ఆర్.యస్.యస్. వర్గాలకీ గ్రంథం బైబిల్ లాంటిది. ఈ గ్రంథం ఎవరూ రచించినది కాదు. ‘గురూజీ ‘ గా సుప్రసిద్దులైన మాధవ సదాశివ గోల్వల్కర్ ఆర్.యస్.యస్.కు సర్ సంఘ్ చాలక్ గా ఉన్న 33 సంవత్సరాల (1940-1973) సుదీర్ఘ కాలం లో చేసిన అనేక ఉపన్యాసాలలోని ముఖ్యమైన విషయాలను, ఆర్.యస్.యస్. భావజాలాన్ని ప్రతిబింబించేటట్లుగా ఏర్చికూర్చి చేసిన సకలనం ఈ గ్రంథం.

ఆర్.యస్.యస్. అనే మొక్కను హెడ్గేవార్ నాటితే, ఆ మొక్కను గోల్వల్కర్ చెట్టు గా పెంచారు. దేవరస్ ఆ చెట్టును వట వృక్షంగా పెంపొందించారు అని తెలిసిన వారు అభివర్ణిస్తారు. ఈ ముగ్గురిలో కూడా గోల్వల్కర్ విశేష ఖ్యాతి నార్జించారు. ఆర్.యస్.యస్. కు పటిష్ఠమైన  పునాదులేర్పరచి దానిని చిరకాలం నిలచి ఉండే సంస్థగా తీర్చిదిద్దారు. ఆ సంస్థ నుండి పుట్టిన ఒక శాఖ ఐనటువంటి  బి.జె.పి. పార్టీ భారతదేశాన్ని పాలించే స్థాయికి ఎదిగినదంటే ఆ సంస్థకు ఎంతటి  బలమైన పునాది ఉన్నదో, ఆ సంస్థ వెనుక ఎంతటి పవిత్ర సంకల్ప శక్తి దాగి ఉన్నదో మనం ఊహించికోవచ్చు.

ఈ గ్రంథం ద్వారా ఆర్.యస్.యస్. గురించి ,  దాని మౌలిక భావజాలం గురించి ,‘హిందూ రాష్ట్ర ‘ సిద్దాంతం గురించి మనం ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు. ఆర్.యస్.యస్.,విశ్వ హిందూ పరిషత్ మొదలైన సంస్థలు తమ భావ ప్రచారానికి గాను గ్రంథాలను ప్రచురించటానికి, విక్రయించటానికి ‘సాహిత్యానికేతన్ ‘ అనే సంస్థను ఏర్పాటు చేశాయి. హైదరాబాదు లోని బర్కత్ పురా లో మరియు విజయవాడ లోని ఏలూర్ రోడ్ లో  సాహిత్యానికేతన్ విక్రయశాలలు ఉన్నాయి. ఆక్కడ ఈ పాంచజన్యం గ్రంథం లభించగలదు.

« Older entries