సన్-జు ‘యుద్ధకళ’

జీవితంలో యుద్ధం అనివార్యమైనది. దుష్టుడు యుద్ధాన్ని ఆరంభిస్తాడు; శిష్టుడు ఆ యుద్ధాన్ని ముగిస్తాడు. యుద్ధం చేయాలా వద్దా అని నిర్ణయించుకోగల స్వేచ్ఛ ఎవరికీ ఉండదు. ఎవరైనా సరే మనుగడ కోసం, ఆత్మగౌరవం కోసం, విజయాన్ని సాధించడం కోసం యుద్ధం చేసితీరాలి. నీవు శాంతి కాముకుడవు అయినా కూడా యుద్ధం చేయక తప్పదు. ఎందుకంటే శాంతి యుద్ధాన్ని నిరాకరిస్తే రాదు; యుద్ధం చేస్తే వస్తుంది. మనిషి జీవితంలో యుద్ధమనేది ఒక నిరంతర ప్రక్రియ.

అటువంటి యుద్ధానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని సుబోధకంగా వివరించే ఓ చిరు గ్రంథాన్ని ఇప్పుడు నేను మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. ఆ గ్రంథం పేరు The Art of War. ఇది ప్రపంచంలోకెల్లా అత్యంత ప్రాచీన యుద్ధతంత్ర గ్రంథం. ఈ గ్రంథ రచయిత క్రీ.పూ.6వ శతాబ్దానికి చెందిన చైనా దేశపు సైనిక వ్యూహకర్త అయిన సన్–జు. ఇతడు ‘వు’ రాజ్య సేనానిగా పనిచేసి అనేక యుద్ధాలలో విజయం సాధించాడు. ఈ గ్రంథాన్ని చైనీస్ లో ‘పింగ్ ఫా’ అని అంటారు. ఈ గ్రంథం ప్రపంచ ప్రసిద్ధి చెందినది. చరిత్రలో ఎన్నో యుద్ధ గతులను, వాటి ఫలితాలను ప్రభావితం చేసింది. ప్రాచ్య, పాశ్చాత్య దేశాలకు చెందిన ఎందరో సేనానులు ఈ గ్రంథం లో వివరించిన వ్యూహాలను ఆచరించి విజయాన్ని తమ స్వంతం చేసుకున్నారు.

నెపోలియన్, మావో సేటుంగ్, హొచిమిన్ వంటి రణతంత్రవేత్తలు, హెన్రీ కిసింజర్ వంటి రాజనీతి కోవిదుడు; ఇంకా ఇటువంటి వారు అనేక మంది ఈ గ్రంథాన్ని నిత్యపఠనీయ గ్రంథంగా పరిగణించారు. మరిముఖ్యంగా ఈ గ్రంథంతో నెపోలియన్‌కున్న అనుబంధం ప్రత్యేకమయినది. ఈ గ్రంథం యొక్క ఫ్రెంచ్ అనువాదం ఫ్రాన్సు దేశంలో ఓ ‘నెపోలియన్’ రూపొందడానికి కారణమయినదంటే అది అతిశయోక్తి కాదు. వియత్నాం యుద్ధకాలం నుండి అమెరికన్ సైనికాధికారులలో ఈ గ్రంథం విశేషమైన ఆదరణను పొందుతున్నది. వారి యుద్ధ వ్యూహాలన్నీ ఈ గ్రంథం మీదనే ఆధారపడి ఉంటాయి.

(ఆధునిక యుద్ధానికి రూపురేఖలందించిన నెపోలియన్ తను నిదురించే సమయంలో సైతం ఈ గ్రంథాన్ని చెంతనే ఉంచుకొనేవాడు.

ఆధునిక కాలంలో వామపక్ష గెరిల్లా పోరాటాలకు మార్గదర్శకంగా ఉన్న గ్రంథం ‘గెరిల్లా వార్‌ఫేర్ ‘. దీనిని చైనా నాయకుడు మావో సన్-జు ‘యుద్ధతంత్రం’ ఆధారంగానే రచించాడు.

ఈ గ్రంథంలో సన్-జు ప్రతిపాదించిన సూత్రాలను అనుసరించడం వలనే వియత్నాం లాంటి చిన్నదేశం, పేదదేశం అమెరికాలంటి అతిపెద్దదేశం, అపరిమితమైన ఆర్ధికశక్తి, సైనికశక్తి ఉన్న దేశాన్ని ఓడించడం జరిగినది.20 వ శతాబ్దపు ద్వితీయార్థంలో జరిగిన ఈ యుద్ధం ‘వియత్నాంయుద్ధం’గా చరిత్ర ప్రసిద్ధి చెందింది.ఈ యుద్ధంలో వియత్నాంకు నాయకత్వం వహించిన హొచిమిన్ ఈ గ్రంథాన్ని చైనీస్ నుండి తమ దేశప్రజల మాతృభాషలోకి అనువదించాడు. ఈ యుద్ధ సమయంలోనే అమెరికా సైనికాధికారులు వియత్నాం గెలుపులో కీలక పాత్ర వహించిన ఈ గ్రంథం గురించి తెలుసుకుని అప్పటినుండి ఈ గ్రంథాన్ని అధ్యయనం చేయడం ప్రారంభించారు.

కొంతకాలం క్రిందటివరకు సంపన్న పాశ్చాత్యుల డైనింగ్ టేబుల్ సంభాషణలలో ఈ గ్రంథం గురించి చర్చించడం ఒక ఫ్యాషన్.

ఈ గ్రంథాన్ని అధ్యయనం చేసిన తరువాతే పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ భారతదేశం మీద కార్గిల్ యుద్ధానికి రూపకల్పన చేశాడు.)

ఈ గ్రంథానికి అనేక విశిష్టతలున్నాయి. ఇది ఏదో ఒక కాలానికి మాత్రమే పరిమితమైన గ్రంథం కాదు. ప్రాచీన కాలంలో రచింపబడిన ఈ గ్రంథం నేటి ఆధునిక కాలంలో కూడా అనుసరింపదగినదిగా ఉండి అంతకంతకూ తన ప్రాధాన్యతను పెంచుకుంటూనే ఉన్నది. అలాగే ఈ గ్రంథం ఏదో ఒక రంగానికి మాత్రమే పరిమితమైనది కాదు. ఇందులో వివరించిన వ్యూహాలు కేవలం సైనిక పరంగానే కాక ఇతర రంగాలకు కూడా అన్వయించుకునే విధంగా ఉంటాయి. అందుకే ఈ గ్రంథం సైనికరంగంతో పాటుగా రాజకీయ, వ్యాపార, మానేజిమెంట్ వంటి అనేక ఇతర రంగాలలో కూడా విశేషమైన వ్యాప్తిని పొందినది.

విషయాన్ని నైతిక దృక్పథంతో బోధించే గ్రంథాలు అనేకం ఉంటాయి. కానీ వాస్తవ దృక్పథంతో బోధించే గ్రంథాలు అరుదుగా ఉంటాయి. అటువంటి అరుదైన గ్రంథం ఈ The Art of War. ఇది ఒక వ్యక్తిత్వ వికాస గ్రంథం. మానవ సంబంధాలలో మనకు తరచూ ఎదురయ్యే అనేక సమస్యలను ఈ గ్రంథంలో వివరించిన వ్యూహాలను అవగాహన చేసుకోవడం ద్వారా ఎదుర్కోవచ్చు. ఇది ఒక మానసిక శాస్త్ర గ్రంథం. ఎదుటిమనిషి అంతరంగాన్ని అంచనా వేయడానికి ఈ గ్రంథం ఎంతైనా ఉపకరిస్తుంది.

ఈ గ్రంథానికి ఆంగ్లభాషలో అనేక అనువాదాలున్నాయి. వాటన్నింటిలోకీ Lionel Giles యొక్క అనువాదం ప్రామాణికమైనదిగా పరిగణింపబడుతున్నది. ఇంటర్‌నెట్‌లో ఈ గ్రంథం యొక్క Giles అనువాదాన్ని వ్యాఖ్యాన సహితంగా ప్రోజెక్ట్ గుటెన్‌బర్గ్ అందిస్తున్నది. వ్యాఖ్యాన రహితంగా అనేక వెబ్‌సైట్లు అందిస్తున్నాయి. Thomos Cleary యొక్క అనువాదాన్ని www.sonshi.com అనే వెబ్‌సైట్ అందిస్తున్నది.

మాకియవెల్లి యొక్క ప్రఖ్యాత రచన ‘ద ప్రిన్స్’ తో సమానంగా, ప్రపంచవ్యాప్త ఆదరణ చూరగొన్న ఈ గ్రంథాన్ని మీరు కూడా చదవండి!

సన్-జు ‘ద ఆర్ట్ ఆఫ్ వార్’ తెలుగు అనువాదాన్ని ఇక్కడ చదవండి.

 

చెస్టర్‌ఫీల్డ్ ఉత్తరాలు

ప్రపంచానికి రాజనీతిని బోధించే కార్యాన్ని మాకియవెల్లి నెరవేర్చాడు. యుద్ధకళను బోధించే పనిని సన్–జు నిర్వర్తించాడు. ప్రేమపాఠాలు ఒవిడ్ నేర్పాడు. అలాగే ఎదుగుతున్న బాలలు, విశాల ప్రపంచంలోకి అడుగిడబోతున్న యువత తెలుసుకోవలసిన విషయాలను, అలవరచుకోవలసిన అలవాట్లను, పొందవలసిన క్రమశిక్షణను లార్డ్ చెస్టర్‌ఫీల్డ్ బోధించాడు.

చెస్టర్‌ఫీల్డ్ (1694-1773) ఇంగ్లాండు దేశపు కులీన వర్గానికి చెందినవాడు. ఇతడు ఆనాటి తన దేశప్రభుత్వంలో ఎన్నో ఉన్నతస్థాయి పదవీ బాధ్యతలు నిర్వర్తించాడు. ఇతడు 1732 లో జన్మించిన తన కొడుకు ఫిలిప్‌ను ప్రయోజకుడైన మరియు సమర్థుడైన వ్యక్తిగా తీర్చిదిద్దాలనే ఉద్దేశ్యంతో అతని బాల్యదశ నుండి 30సంవత్సరాలపాటు 400కు పైగా ఉత్తరాల ద్వారా ప్రాపంచిక విజ్ఞానాన్ని అత్యంత ఆసక్తికరంగానూ, సులభగ్రాహ్యమైన శైలిలోనూ బోధించాడు. అతి మనోహరమైన భాషాసౌందర్యంతోనూ, అతి విలువైన బోధనతోనూ విలసిల్లే ఆ ఉత్తరాలు చెస్టర్‌ఫీల్డ్ మరణానంతరం ప్రచురింపబడి ఆంగ్ల ప్రజానీకం యొక్క హృదయాలను హత్తుకున్నాయి.

ఇటువంటి విషయాలను బోధించినవారు చెస్టర్‌ఫీల్డ్‌కు ముందూ ఉన్నారు, తరువాత కూడా ఉన్నారు. కానీ వారందరిలోనూ చెస్టర్‌ఫీల్డ్ యొక్క స్థానం అద్వితీయమైనది. మరిముఖ్యంగా నేటికాలంలో వ్యక్తిత్వవికాసం పేరుతో అనేక గ్రంథాలు మనకు మార్కెట్లో ప్రత్యక్షమవుతున్నాయి. అనేకమంది వ్యక్తిత్వవికాసనిపుణులమంటూ భారీ ఫీజులు వసూలు చేసి క్లాసులు నిర్వహిస్తున్నారు. అవన్నీ చదివినంతసేపూ, విన్నంతసేపూ ఉత్తేజభరితంగా ఉంటాయి. కానీ తరువాత ఏ ఒక్క విషయంగూడా మన మనసులో నిలిచి ఉండదు, మన ప్రవర్తనను ప్రభావితం చేయదు—వెరసి వెచ్చించిన మొత్తమంతా, పడిన ప్రయాసంతా వ్యర్థం. కానీ చెస్టర్‌ఫీల్డ్ యొక్క ఈ బోధను ఒక్కసారి అధ్యయనం చేస్తే ఏ ఒక్క విషయాన్నీ కూడా జీవితంలో మరెన్నటికీ మరువలేము. నిజమైన వ్యక్తిత్వానికి నిచ్చెనమెట్లు ఈ చెస్టర్‌ఫీల్డ్ ఉత్తరాలు.

నేటికాలపు బోధకుల లక్ష్యం డబ్బుసంపాదన. కనుక వారు ప్రత్యర్థులతో ఉన్న పోటీని మరియు మార్కెట్ ట్రెండును దృష్టిలో ఉంచుకుని రాసుకుపోతూ, చెప్పుకుపోతూ ఉంటారు. విద్యార్థులను ఆకర్షించగల అనవసర విషయాల ప్రస్తావనే వారి బోధనలో అధికం. నిజంగా వ్యక్తిత్వానికి పునాదిగా నిలబడగలిగిన విషయాలేవీ అందులో ఉండవు.

చెస్టర్‌ఫీల్డ్ కు ఈ ఉత్తరాలు రాసేటపుడు ఇవన్నీ ఈ విధంగా ప్రచురించబడగలవన్న ఆలోచనేలేదు. కేవలం తన కుమారుడిని ఉత్తమ వ్యక్తిగా తీర్చిదిద్దాలన్న ఓ తండ్రికి ఉండే సహజమైన అభిలాషతో చిత్తశుద్ధితోనూ, లక్ష్యశుద్ధితోనూ ఆంతరంగికంగా రాసిన ఉత్తరాలు ఇవి. ఓ తండ్రికి ఉండే ఆరాటమే కాక చెస్టర్‌ఫీల్డ్, తాను స్వయంగా ఉన్నత విద్యావంతుడు గావడం, ప్రభువంశీకుడుగావడంతో విలువలయెడల, క్రమశిక్షణ గలిగిన జీవితం యెడల, నాగరిక జీవనశైలి యెడల పట్టుదల గలిగినవాడవటం, ఉన్నతస్థాయి రాజోద్యోగిగా అనేక ప్రాంతాలలో అనేక మంది వ్యక్తులతో కలసి పనిచేసి గడించిన లోకానుభవం, మనోహరమైన ఆంగ్లభాషను రాయగలిగే సామర్థ్యం—ఇవన్నీ కలసి అత్యంత విలువైన బోధ ఈ ప్రపంచానికి అందడానికి కారణమయ్యాయి.

ఈ బోధనకు మరో విశిష్టత కూడా ఉన్నది. ఇవి ఆధునిక యుగారంభంలో రాయబడినా కూడా ఫ్రెంచి విప్లవ భావజాలంగానీ, అక్టోబర్ విప్లవ భావజాలంగానీ మానవుడి ఆలోచనావిధానాన్ని ప్రభావితం చేయడానికన్నా ముందే రాయబడ్డాయి. ఈ రెండు విప్లవాలు మానవాళికి ఎంతో మేలు చేసిన సంగతి అలా ఉంచితే, అవి మోసుకువచ్చిన నూతనభావజాలం మూలంగా మానవుడు తరతరాలుగా కాపాడుకుంటూ వస్తున్న కొన్ని ముఖ్యమైన విలువలను అనివార్యంగా వదులుకోవాల్సి వచ్చింది. అటువంటి పరిణామం జరగడానికంటే ముందే రాయబడటంతో చెస్టర్‌ఫీల్డ్ ఉత్తరాలు మనిషి అలవరచుకోవలసిన కల్తీలేని అసలుసిసలు విలువలతో అలరారుతూ ఉంటాయి.

ఆంగ్లభాషలో నైతికవర్తనకు పర్యాయపదంగా Victorian అనే పదం ఎలా స్థిరపడిపోయిందో, నాగరిక ప్రవర్తనకు పర్యాయపదంగా chesterfieldian అనే పదం స్థిరపడిపోయింది.

చెస్టర్‌ఫీల్డ్ తన స్వంత కొడుకుకు మరియు పెంపుడు కొడుకుకు రాసిన అన్ని ఉత్తరాలు కలిపి కొన్ని వందల సంఖ్యలో ఉంటాయి. వాటిలో చాలావరకూ సుదీర్ఘమైన ఉత్తరాలే. అవన్నీ కలిపితే పెద్ద ఉద్గ్రంథమే అవుతుంది. కనుకనే కాలక్రమంలో Best Letters, Selected Letters లాంటి పేర్లతో కొన్ని ముఖ్యమైన ఉత్తరాలనో లేక ఆ ఉత్తరాలలోని కొన్ని ముఖ్యభాగాలనో సంకలనం చేసిన గ్రంథాలు ప్రచురింపబడ్డాయి. అయితే 1861 లో “Lord Chesterfield’s Advice to His Son on Men and Manners” పేరుతో ప్రచురింపబడిన ఓ చిరుగ్రంథం మరింత విశిష్టమైనది. ఆ గ్రంథంలో చెస్టర్‌ఫీల్డ్ తన ఉత్తరాలలో బోధించిన విషయాలన్నింటినీ అంశాలవారీగా విభజించి, ఒకానొక అంశం గురించి అనేక ఉత్తరాలలో బోధించిన సందర్భంలో వాటిలో పునరావృతాలను వదిలేస్తూ, ముఖ్యమైన వాక్యాలను మాత్రం ఒక చోటకు చేర్చి ఆయన బోధనల సారాన్నంతటినీ సంక్షిప్తంగా అందించడం జరిగినది. ఆ గ్రంథాన్నే నేను మీకు సిఫార్సు చేయాలనుకుంటున్నాను. ఈ గ్రంథం యొక్క స్కానింగ్ కాపీని “ఇంటర్నెట్ ఆర్చివ్” అనే వెబ్‌సైట్ నుండి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకొని చదువుకోండి…..అనేక విలువైన సలహాలు, సూచనలు పొందడంతోపాటు చెస్టర్‌ఫీల్డ్ యొక్క ఆంగ్లవాక్య నిర్మాణశైలిని ఆస్వాదించండి।

(చెస్టర్‌ఫీల్డ్ సలహాలను మరికొంత విపులంగా చదవాలనుకుంటే పేరుకు తగ్గట్లుగానే బెస్ట్‌గా ఉండే ఈ బుక్‌ని చదవండి)

Follow

Get every new post delivered to your Inbox.