సన్-జు ‘యుద్ధకళ’

జీవితంలో యుద్ధం అనివార్యమైనది. దుష్టుడు యుద్ధాన్ని ఆరంభిస్తాడు; శిష్టుడు ఆ యుద్ధాన్ని ముగిస్తాడు. యుద్ధం చేయాలా వద్దా అని నిర్ణయించుకోగల స్వేచ్ఛ ఎవరికీ ఉండదు. ఎవరైనా సరే మనుగడ కోసం, ఆత్మగౌరవం కోసం, విజయాన్ని సాధించడం కోసం యుద్ధం చేసితీరాలి. నీవు శాంతి కాముకుడవు అయినా కూడా యుద్ధం చేయక తప్పదు. ఎందుకంటే శాంతి యుద్ధాన్ని నిరాకరిస్తే రాదు; యుద్ధం చేస్తే వస్తుంది. మనిషి జీవితంలో యుద్ధమనేది ఒక నిరంతర ప్రక్రియ.

అటువంటి యుద్ధానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని సుబోధకంగా వివరించే ఓ చిరు గ్రంథాన్ని ఇప్పుడు నేను మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. ఆ గ్రంథం పేరు The Art of War. ఇది ప్రపంచంలోకెల్లా అత్యంత ప్రాచీన యుద్ధతంత్ర గ్రంథం. ఈ గ్రంథ రచయిత క్రీ.పూ.6వ శతాబ్దానికి చెందిన చైనా దేశపు సైనిక వ్యూహకర్త అయిన సన్–జు. ఇతడు ‘వు’ రాజ్య సేనానిగా పనిచేసి అనేక యుద్ధాలలో విజయం సాధించాడు. ఈ గ్రంథాన్ని చైనీస్ లో ‘పింగ్ ఫా’ అని అంటారు. ఈ గ్రంథం ప్రపంచ ప్రసిద్ధి చెందినది. చరిత్రలో ఎన్నో యుద్ధ గతులను, వాటి ఫలితాలను ప్రభావితం చేసింది. ప్రాచ్య, పాశ్చాత్య దేశాలకు చెందిన ఎందరో సేనానులు ఈ గ్రంథం లో వివరించిన వ్యూహాలను ఆచరించి విజయాన్ని తమ స్వంతం చేసుకున్నారు.

నెపోలియన్, మావో సేటుంగ్, హొచిమిన్ వంటి రణతంత్రవేత్తలు, హెన్రీ కిసింజర్ వంటి రాజనీతి కోవిదుడు; ఇంకా ఇటువంటి వారు అనేక మంది ఈ గ్రంథాన్ని నిత్యపఠనీయ గ్రంథంగా పరిగణించారు. మరిముఖ్యంగా ఈ గ్రంథంతో నెపోలియన్‌కున్న అనుబంధం ప్రత్యేకమయినది. ఈ గ్రంథం యొక్క ఫ్రెంచ్ అనువాదం ఫ్రాన్సు దేశంలో ఓ ‘నెపోలియన్’ రూపొందడానికి కారణమయినదంటే అది అతిశయోక్తి కాదు. వియత్నాం యుద్ధకాలం నుండి అమెరికన్ సైనికాధికారులలో ఈ గ్రంథం విశేషమైన ఆదరణను పొందుతున్నది. వారి యుద్ధ వ్యూహాలన్నీ ఈ గ్రంథం మీదనే ఆధారపడి ఉంటాయి.

ఈ గ్రంథానికి అనేక విశిష్టతలున్నాయి. ఇది ఏదో ఒక కాలానికి మాత్రమే పరిమితమైన గ్రంథం కాదు. ప్రాచీన కాలంలో రచింపబడిన ఈ గ్రంథం నేటి ఆధునిక కాలంలో కూడా అనుసరింపదగినదిగా ఉండి అంతకంతకూ తన ప్రాధాన్యతను పెంచుకుంటూనే ఉన్నది. అలాగే ఈ గ్రంథం ఏదో ఒక రంగానికి మాత్రమే పరిమితమైనది కాదు. ఇందులో వివరించిన వ్యూహాలు కేవలం సైనిక పరంగానే కాక ఇతర రంగాలకు కూడా అన్వయించుకునే విధంగా ఉంటాయి. అందుకే ఈ గ్రంథం సైనికరంగంతో పాటుగా రాజకీయ, వ్యాపార, మానేజిమెంట్ వంటి అనేక ఇతర రంగాలలో కూడా విశేషమైన వ్యాప్తిని పొందినది.

విషయాన్ని నైతిక దృక్పథంతో బోధించే గ్రంథాలు అనేకం ఉంటాయి. కానీ వాస్తవ దృక్పథంతో బోధించే గ్రంథాలు అరుదుగా ఉంటాయి. అటువంటి అరుదైన గ్రంథం ఈ The Art of War. ఇది ఒక వ్యక్తిత్వ వికాస గ్రంథం. మానవ సంబంధాలలో మనకు తరచూ ఎదురయ్యే అనేక సమస్యలను ఈ గ్రంథంలో వివరించిన వ్యూహాలను అవగాహన చేసుకోవడం ద్వారా ఎదుర్కోవచ్చు. ఇది ఒక మానసిక శాస్త్ర గ్రంథం. ఎదుటిమనిషి అంతరంగాన్ని అంచనా వేయడానికి ఈ గ్రంథం ఎంతైనా ఉపకరిస్తుంది.

ఈ గ్రంథానికి ఆంగ్లభాషలో అనేక అనువాదాలున్నాయి. వాటన్నింటిలోకీ Lionel Giles యొక్క అనువాదం ప్రామాణికమైనదిగా పరిగణింపబడుతున్నది. ఇంటర్‌నెట్‌లో ఈ గ్రంథం యొక్క Giles అనువాదాన్ని వ్యాఖ్యాన సహితంగా ప్రోజెక్ట్ గుటెన్‌బర్గ్ అందిస్తున్నది. వ్యాఖ్యాన రహితంగా అనేక వెబ్‌సైట్లు అందిస్తున్నాయి. Thomos Cleary యొక్క అనువాదాన్ని www.sonshi.com అనే వెబ్‌సైట్ అందిస్తున్నది.

మాకియవెల్లి యొక్క ప్రఖ్యాత రచన ‘ద ప్రిన్స్’ తో సమానంగా, ప్రపంచవ్యాప్త ఆదరణ చూరగొన్న ఈ గ్రంథాన్ని మీరు కూడా చదవండి!

చెస్టర్‌ఫీల్డ్ ఉత్తరాలు

ప్రపంచానికి రాజనీతిని బోధించే కార్యాన్ని మాకియవెల్లి నెరవేర్చాడు. యుద్ధకళను బోధించే పనిని సన్–జు నిర్వర్తించాడు. ప్రేమపాఠాలు ఒవిడ్ నేర్పాడు. అలాగే ఎదుగుతున్న బాలలు, విశాల ప్రపంచంలోకి అడుగిడబోతున్న యువత తెలుసుకోవలసిన విషయాలను, అలవరచుకోవలసిన అలవాట్లను, పొందవలసిన క్రమశిక్షణను లార్డ్ చెస్టర్‌ఫీల్డ్ బోధించాడు.

చెస్టర్‌ఫీల్డ్ (1694-1773) ఇంగ్లాండు దేశపు కులీన వర్గానికి చెందినవాడు. ఇతడు ఆనాటి తన దేశప్రభుత్వంలో ఎన్నో ఉన్నతస్థాయి పదవీ బాధ్యతలు నిర్వర్తించాడు. ఇతడు 1732 లో జన్మించిన తన కొడుకు ఫిలిప్‌ను ప్రయోజకుడైన మరియు సమర్థుడైన వ్యక్తిగా తీర్చిదిద్దాలనే ఉద్దేశ్యంతో అతని బాల్యదశ నుండి 30సంవత్సరాలపాటు 400కు పైగా ఉత్తరాల ద్వారా ప్రాపంచిక విజ్ఞానాన్ని అత్యంత ఆసక్తికరంగానూ, సులభగ్రాహ్యమైన శైలిలోనూ బోధించాడు. అతి మనోహరమైన భాషాసౌందర్యంతోనూ, అతి విలువైన బోధనతోనూ విలసిల్లే ఆ ఉత్తరాలు చెస్టర్‌ఫీల్డ్ మరణానంతరం ప్రచురింపబడి ఆంగ్ల ప్రజానీకం యొక్క హృదయాలను హత్తుకున్నాయి.

ఇటువంటి విషయాలను బోధించినవారు చెస్టర్‌ఫీల్డ్‌కు ముందూ ఉన్నారు, తరువాత కూడా ఉన్నారు. కానీ వారందరిలోనూ చెస్టర్‌ఫీల్డ్ యొక్క స్థానం అద్వితీయమైనది. మరిముఖ్యంగా నేటికాలంలో వ్యక్తిత్వవికాసం పేరుతో అనేక గ్రంథాలు మనకు మార్కెట్లో ప్రత్యక్షమవుతున్నాయి. అనేకమంది వ్యక్తిత్వవికాసనిపుణులమంటూ భారీ ఫీజులు వసూలు చేసి క్లాసులు నిర్వహిస్తున్నారు. అవన్నీ చదివినంతసేపూ, విన్నంతసేపూ ఉత్తేజభరితంగా ఉంటాయి. కానీ తరువాత ఏ ఒక్క విషయంగూడా మన మనసులో నిలిచి ఉండదు, మన ప్రవర్తనను ప్రభావితం చేయదు—వెరసి వెచ్చించిన మొత్తమంతా, పడిన ప్రయాసంతా వ్యర్థం. కానీ చెస్టర్‌ఫీల్డ్ యొక్క ఈ బోధను ఒక్కసారి అధ్యయనం చేస్తే ఏ ఒక్క విషయాన్నీ కూడా జీవితంలో మరెన్నటికీ మరువలేము. నిజమైన వ్యక్తిత్వానికి నిచ్చెనమెట్లు ఈ చెస్టర్‌ఫీల్డ్ ఉత్తరాలు.

నేటికాలపు బోధకుల లక్ష్యం డబ్బుసంపాదన. కనుక వారు ప్రత్యర్థులతో ఉన్న పోటీని మరియు మార్కెట్ ట్రెండును దృష్టిలో ఉంచుకుని రాసుకుపోతూ, చెప్పుకుపోతూ ఉంటారు. విద్యార్థులను ఆకర్షించగల అనవసర విషయాల ప్రస్తావనే వారి బోధనలో అధికం. నిజంగా వ్యక్తిత్వానికి పునాదిగా నిలబడగలిగిన విషయాలేవీ అందులో ఉండవు.

చెస్టర్‌ఫీల్డ్ కు ఈ ఉత్తరాలు రాసేటపుడు ఇవన్నీ ఈ విధంగా ప్రచురించబడగలవన్న ఆలోచనేలేదు. కేవలం తన కుమారుడిని ఉత్తమ వ్యక్తిగా తీర్చిదిద్దాలన్న ఓ తండ్రికి ఉండే సహజమైన అభిలాషతో చిత్తశుద్ధితోనూ, లక్ష్యశుద్ధితోనూ ఆంతరంగికంగా రాసిన ఉత్తరాలు ఇవి. ఓ తండ్రికి ఉండే ఆరాటమే కాక చెస్టర్‌ఫీల్డ్, తాను స్వయంగా ఉన్నత విద్యావంతుడు గావడం, ప్రభువంశీకుడుగావడంతో విలువలయెడల, క్రమశిక్షణ గలిగిన జీవితం యెడల, నాగరిక జీవనశైలి యెడల పట్టుదల గలిగినవాడవటం, ఉన్నతస్థాయి రాజోద్యోగిగా అనేక ప్రాంతాలలో అనేక మంది వ్యక్తులతో కలసి పనిచేసి గడించిన లోకానుభవం, మనోహరమైన ఆంగ్లభాషను రాయగలిగే సామర్థ్యం—ఇవన్నీ కలసి అత్యంత విలువైన బోధ ఈ ప్రపంచానికి అందడానికి కారణమయ్యాయి.

ఈ బోధనకు మరో విశిష్టత కూడా ఉన్నది. ఇవి ఆధునిక యుగారంభంలో రాయబడినా కూడా ఫ్రెంచి విప్లవ భావజాలంగానీ, అక్టోబర్ విప్లవ భావజాలంగానీ మానవుడి ఆలోచనావిధానాన్ని ప్రభావితం చేయడానికన్నా ముందే రాయబడ్డాయి. ఈ రెండు విప్లవాలు మానవాళికి ఎంతో మేలు చేసిన సంగతి అలా ఉంచితే, అవి మోసుకువచ్చిన నూతనభావజాలం మూలంగా మానవుడు తరతరాలుగా కాపాడుకుంటూ వస్తున్న కొన్ని ముఖ్యమైన విలువలను అనివార్యంగా వదులుకోవాల్సి వచ్చింది. అటువంటి పరిణామం జరగడానికంటే ముందే రాయబడటంతో చెస్టర్‌ఫీల్డ్ ఉత్తరాలు మనిషి అలవరచుకోవలసిన కల్తీలేని అసలుసిసలు విలువలతో అలరారుతూ ఉంటాయి.

ఆంగ్లభాషలో నైతికవర్తనకు పర్యాయపదంగా Victorian అనే పదం ఎలా స్థిరపడిపోయిందో, నాగరిక ప్రవర్తనకు పర్యాయపదంగా chesterfieldian అనే పదం స్థిరపడిపోయింది.

చెస్టర్‌ఫీల్డ్ తన స్వంత కొడుకుకు మరియు పెంపుడు కొడుకుకు రాసిన అన్ని ఉత్తరాలు కలిపి కొన్ని వందల సంఖ్యలో ఉంటాయి. వాటిలో చాలావరకూ సుదీర్ఘమైన ఉత్తరాలే. అవన్నీ కలిపితే పెద్ద ఉద్గ్రంథమే అవుతుంది. కనుకనే కాలక్రమంలో Best Letters, Selected Letters లాంటి పేర్లతో కొన్ని ముఖ్యమైన ఉత్తరాలనో లేక ఆ ఉత్తరాలలోని కొన్ని ముఖ్యభాగాలనో సంకలనం చేసిన గ్రంథాలు ప్రచురింపబడ్డాయి. అయితే 1861 లో “Lord Chesterfield’s Advice to His Son on Men and Manners” పేరుతో ప్రచురింపబడిన ఓ చిరుగ్రంథం మరింత విశిష్టమైనది. ఆ గ్రంథంలో చెస్టర్‌ఫీల్డ్ తన ఉత్తరాలలో బోధించిన విషయాలన్నింటినీ అంశాలవారీగా విభజించి, ఒకానొక అంశం గురించి అనేక ఉత్తరాలలో బోధించిన సందర్భంలో వాటిలో పునరావృతాలను వదిలేస్తూ, ముఖ్యమైన వాక్యాలను మాత్రం ఒక చోటకు చేర్చి ఆయన బోధనల సారాన్నంతటినీ సంక్షిప్తంగా అందించడం జరిగినది. ఆ గ్రంథాన్నే నేను మీకు సిఫార్సు చేయాలనుకుంటున్నాను. ఈ గ్రంథం యొక్క స్కానింగ్ కాపీని “ఇంటర్నెట్ ఆర్చివ్” అనే వెబ్‌సైట్ నుండి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకొని చదువుకోండి…..అనేక విలువైన సలహాలు, సూచనలు పొందడంతోపాటు చెస్టర్‌ఫీల్డ్ యొక్క ఆంగ్లవాక్య నిర్మాణశైలిని ఆస్వాదించండి।

(చెస్టర్‌ఫీల్డ్ సలహాలను మరికొంత విపులంగా చదవాలనుకుంటే పేరుకు తగ్గట్లుగానే బెస్ట్‌గా ఉండే ఈ బుక్‌ని చదవండి)

వంద మంచి పుస్తకాలు

నేను చదివిన పుస్తకాలలో నాకు నచ్చినవి, చదవడం వలన నాకు తృప్తినిచ్చినవి అయిన పుస్తకాలను జ్ఞాపకం చేసుకుంటూ ఒక list రాయగా అవి సుమారు ఒక వంద దాకా వచ్చాయి. నా personal library చూసి రాస్తే ఈ సంఖ్య మరికొంత పెరిగేదేమో. ఇందులో మొదట పేర్కొన్న కొన్ని గ్రంథాలు మాత్రం Highly recommended. ప్రతి ఒక్కరూ తప్పక చదవవలసిన పుస్తకాలవి.

నేను ఈ బ్లాగులో ‘మంచి పుస్తకం’ శీర్షికతో నేను చదివిన వాటిలో కొన్ని మంచి పుస్తకాలను పరిచయం చేశాను. ఆ పని నా మిగతా ప్రోజెక్టులలాగే తాత్కాలికంగా ఆగిపోయింది. ఆ పని తిరిగి ఎప్పుడు ప్రారంభిస్తానో, ఆ శీర్షిక ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేను. అందాకా ఈ లిస్ట్ చూడండి. నేను ఎప్పటికి పరిచయం చేసినా కూడా అవి దాదాపూ ఈ పట్టికలోనివి మాత్రమే అయి ఉంటాయి.

1.భగవద్గీత-శిష్ట్లా సుబ్బారావు వ్యాఖ్యానం

2.భారతజాతికి నా హితవు-స్వామి వివేకానంద

3.Glimpses of World History- Jawaharlal Nehru

4.ఆత్మకథ-మహాత్మా గాంధి

5.యం.యన్.రాయ్ స్వీయగాథలు

6.ఆత్మవికాసము (self unfoldment)-స్వామి చిన్మయానంద

7.The Prince- Machiavelli

8.Letters to His Son-Lord Chesterfield

9.The 48 Laws of Power-Robert Greene

10.The Art of Seduction-Robert Greene

11.The 33 Strategies of War-Robert Greene

12. The Art of Love-Ovid

13.The Art of War-Sun-Tzu

14. రాజయోగం-స్వామి వివేకానంద

15.శ్రీమదాంధ్ర మహాభారతం-పిలకా గణపతి శాస్త్రి

16.స్తోత్ర రత్నావళి-వివిధ దేవతా స్తోత్రాల సంకలనం

17.చలం-బిడ్డల శిక్షణ

18.భర్తృహరి సుభాషితాలు-ఏనుగు లక్ష్మణకవి (అనువాదం)

19.గీతగోవిందం-భక్త జయదేవుడు

20.శ్రీమద్భాగవతం-భక్త పోతన

21. భారతజాతీయ పునరుజ్జీవనం

22.వీరభారతం-పురిపండ అప్పలస్వామి (1857 తిరుగుబాటు)

23.మన చరిత్ర- ఏటుకూరి బలరామమూర్తి

24.ఆంధ్రుల సంక్షిప్త చరిత్ర-ఏటుకూరి బలరామమూర్తి

25.భారతీయ సంస్కృతి– ఏటుకూరి బలరామమూర్తి

26.ఉపనిషత్ చింతన-ఏటుకూరి బలరామమూర్తి

27.సాధన రహస్యం-అనుభవానంద స్వామి

28.రాహుల్ సాంకృత్యాయన్ జీవిత చరిత్ర-ఓబుల్ రెడ్డి

29.విశ్వదర్శనం-నండూరి రామమోహనరావు (ప్రాచ్య, పాశ్చాత్య తత్త్వశాస్త్రాల పరిచయం)

30.స్వీయచరిత్రము-కందుకూరి వీరేశలింగం

31.కన్యాశుల్కం-గురజాడ అప్పారావు

32.లెనిన్ జీవిత చరిత్ర-మరియా ప్రిలెజాయెవ

33.విప్లవపథంలో నా పయనం-పుచ్చలపల్లి సుందరయ్య

34.వీర తెలంగాణ-రావినారాయణ రెడ్డి

35. కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక-మార్క్స్ మరియు ఎంగెల్స్

36. రాజ్యం-విప్లవం-లెనిన్

37.The Great Road-Agnes Smidely (చైనా నాయకుడు జనరల్ ఛూటే జీవిత చరిత్ర)

38.Red Star Over China-Edgar Sno

39.అమ్మ-మాక్సిం గోర్కి

40.అసమర్థుని జీవయాత్ర-త్రిపురనేని గోపీచంద్

41.చివరికి మిగిలేది-బుచ్చిబాబు

42.ప్రాంచీల బూచి ‘బుస్సీ’-పులిచెర్ల సుబ్బారావు (ఫ్రెంచి సేనాని బుస్సీ చరిత్ర)

43.భారతదేశ స్వాతంత్ర్య సమరం-బిపిన్ చంద్ర

44.ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర-రఘునాథరావు

45.ఆధునిక ప్రపంచ చరిత్ర-తెలుగు అకాడమి (B.A.,పాఠ్య గ్రంథం)

46.ఆధునిక భారతదేశ చరిత్ర-HBT ప్రచురణలు

47.మధ్యయుగ భారతదేశ చరిత్ర-తెలుగు అకాడెమి ప్రచురణ

48.ఏడుతరాలు-అలెక్స్ హేలీ

49.సత్యాన్వేషి చలం-వాడ్రేవు వీరలక్ష్మి దేవి

50.ప్రవహించే ఉత్తేజం-చెగువెరా జీవితచరిత్ర

51.మైదానం-చలం

52.జీవితాదర్శం-చలం

53.మ్యూజింగ్స్-చలం

54.స్త్రీ-చలం

55.చలం-చలం ఆత్మకథ

56.తారాపథం (ఆకాశంలో కనిపించే నక్షత్రాలు, రాశులు, గ్రహాల గురించి) – కొండముది హనుమంతరావు

57.జైభవానీ! జైశివాజీ! -పులిచెర్ల సుబ్బారావు (ఛత్రపతి శివాజి చరిత్ర)

58.సైతాన్ కా బచ్చా!-పులిచెర్ల సుబ్బారావు (మొఘల్ రాజ కుటుంబం యెడల గులాంఖాదిర్ అకృత్యాలు)

59.ఓల్గా సే గంగా-రాహుల్ సాంకృత్యాయన్

60.లోకసంచార శాస్త్రం-రాహుల్ సాంకృత్యాయన్

61.పురిపండా భారతం-పురిపండ అప్పలస్వామి

62.పురిపండ రామాయణం- పురిపండ అప్పలస్వామి

63.పురిపండ భాగవతం- పురిపండ అప్పలస్వామి

64. వాత్సాయన కామసూత్రాలు

65.You Can Win-Shiv Khera

66.The Magic of Thinking Big

67.The Monk Who Sold His Ferrari-Robin Sharma

68.Mega Living-Robin Sharma

69.Who Moved My Cheese

70.Stop Worrying and Start Living-Dale Carnegie

71.How to Win Friends and Influence People- Dale Carnegie

72. Chicken Soup for The Soul

73.నేను-నాదేశం-దర్శి చెంచయ్య (గదర్ పార్టీలోని ఏకైక దక్షిణభారతీయుడు)

74.మహాప్రస్థానం-శ్రీశ్రీ

75.కృష్ణపక్షము-దేవులపల్లి కృష్ణశాస్త్రి

76.ఎంకిపాటలు-నండూరి సుబ్బారావు

77.శ్రీనాథుని చాటువులు-పోలవరపు కోటేశ్వరరావు సంకలనం

78.విజయనగరపతనం-ప్రసాద్

79.ఖారవేలుడు (ప్రాచీన కళింగ రాజు)

80.పుష్యమిత్ర

81.ఆర్య చాణక్య-ప్రసాద్

82.యుగంధర (కాకతీయ ప్రతాపరుద్రుని మంత్రి)-ప్రసాద్

83.సిరాజుద్దౌలా-ప్రసాద్

85. తెలంగాణా సాయుధ పోరాటం-ఆరుట్ల రామచంద్రా రెడ్డి

86.హెడ్గేవార్ జీవిత చరిత్ర (ఆర్.యస్.యస్.స్థాపకుడు)

87.స్వామి వివేకానంద జీవితచరిత్ర-రామకృష్ణ మఠం ప్రచురణ

88.తెలుగు సామెతలు

89.బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఆత్మకథ

90.గారీబాల్డి జీవిత చరిత్ర (ఇటలీ స్వాతంత్ర సమరయోధుడు)

91.తపోవన స్వామి ఆత్మకథ (స్వామి చిన్మయానంద గురువు)

92.సక్సెస్ మేనేజ్‌మెంట్-కంఠంనేని రాథాకృష్ణమూర్తి

93.రాళ్ళు-రప్పలు-తాపీ ధర్మారావు ఆత్మకథ

94.దేవాలయాలమీద బూతుబొమ్మలెందుకు?-తాపీధర్మారావు

95.విజయవిలాసం-తాపీవారి వ్యాఖ్య

96.మహాభగవద్గీత-ఏర్పేడు ఆశ్రమ ప్రచరణ

97.గీతామకరందం-స్వామి విద్యాప్రకాశానంద గిరి

98.మన సమస్యలకు భగవద్గీత పరిష్కారాలు-యస్.బి.రఘునాథాచార్య

99.శ్రీమద్భగవద్గీత-రావుల సూర్యనారాయణ మూర్తి

100. పాంచజన్యం-మాధవ సదాశివ గోల్వల్కర్ (బైబిల్ ఆఫ్ ఆర్.యస్.యస్.)

మీరు భగవద్గీత చదివారా ?!

నేను చదివిన పుస్తకాలలో ఈ సారి ‘భగవద్గీత’ ను పరిచయం చేద్దామనుకుంటున్నాను. ఈ పరిచయం భగవద్గీత గురించి మీకెవ్వరికీ తెలియదనో లేక మీకందరికీ భారతీయ తత్త్వశాస్త్ర సారంగా ఆ మహా గ్రంథం యొక్క వైశిష్ట్యం ఎటువంటిదో తెలపాలనో ఉద్దేశించి రాయడంలేదు.

గీత మీద వందల సంవత్సరాల నుండి అనేక వ్యాఖ్యానాలు వచ్చినాయి. నేటికాలంలో కూడా అనేక ప్రచురణ సంస్థలు, ధార్మిక, మత సంస్థలు గీతార్ధ వివరణతో కూడిన పుస్తకాలను అనేకం ప్రచురిస్తున్నాయి. వాటిలో నేను చదివిన పుస్తకాల గురించి, గీతను అర్ధం చేసుకునే ప్రయత్నంలో నాకు తోడ్పడిన పుస్తకాలను గురించి మీకు పరిచయం చేయాలనే ఉద్దేశ్యంతో మాత్రమే ఈ వ్యాసం రాస్తున్నాను.

భగవద్గీతా పుస్తకాలు పాకెట్ సైజు నుండి మోయలేనంత బరువుండే పెద్ద గ్రంథాల వరకూ వివిధ సైజులలో లభ్యమవుతున్నాయి. గీతలో అసలు ఉన్నది మొత్తం 701  శ్లోకాలే. కేవలం ఆ శ్లోకాలే ఉండే పారాయణ గ్రంథాలతో మొదలై శ్లోకంతో పాటు కేవలం తాత్పర్యం మాత్రమే ఉండే గ్రంథాలుగా, తాత్పర్యంతో పాటు అర్థ వివరణ కూడా ఉండే గ్రంథాలుగా పుస్తకం పెరిగిపోయి క్రమంగా ఈ వివరణ విస్తారమై పోయి ఒక ఉద్గ్రంథంగా మారేంతవరకూ భగవద్గీత వివిధ సైజులలో మనకు ఇప్పుడు లభ్యమవుతున్నది.

మొదట పెద్ద గ్రంథాలతో మొదలు పెడదాము.

కొన్నాళ్ళ క్రితం అనేకమంది ఇళ్ళల్లో ‘ఇస్కాన్’ వారి భగవద్గీతే కనిపించేది. వారు మొబైల్ బుక్ స్టాల్ ద్వారా చాలా తక్కువ ధరకు నాణ్యమైన కాగితం, బైండింగ్ తో తయారైన గీతను అందించేవారు. అయితే ఇందులోని వివరణ ఓ పట్టాన అర్థమయ్యేది కాదు. కానీ ఆ గ్రంథంలో ముద్రించిన పాశ్చాత్య శైలిలో చిత్రించబడిన చిత్రాలు చాలా ఆకట్టుకునేవి. గీతను కొనడంలో ఎక్కువమంది కుండే ఉద్దేశ్యం ఆధ్యాత్మిక దృష్టే గానీ జిజ్ఞాస కాదు గనుక అర్థంకాక పోయినా ఈ గ్రంథం బాగానే ప్రచారం పొందింది. పైగా తక్కువ వెల కూడాను. దీని ఖరీదు Rs.50/-

తరువాత శ్రీకాళహస్తిలోగల శుకబ్రహ్మాశ్రమ స్థాపకులు శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వామి చే రచింపబడిన ‘గీతామకరందం’ పేరు తో ఉండే భగవద్గీత అత్యంత ప్రజాదరణ పొందింది. ఇస్కాన్ వారి గీతలా కాకుండా ఇందులోని వివరణ బాగా అర్థవుతుంది. దీని ఖరీదు కొంచెం ఎక్కువ. Rs.300/- వరకూ ఉంటుంది.

శంకరాచార్యులు, మధ్వాచార్యులు, రామానుజాచార్యులు (త్రిమతాచార్యులు) వందల సంవత్సరాల క్రితం ఒకరితో ఒకరు విభేదించుకుంటూ గీతకు భాష్యాలు రాశారు. అవన్నీ సంస్కృతంలోనే ఉన్నాయి. ఆ ముగ్గురి అభిప్రాయాలనూ క్రోడీకరిస్తూ కొందరు తమిళ పండితులు తమ భాషలో ఓ గ్రంథాన్ని రాశారు. దానిని తమిళాంధ్ర భాషా ప్రవీణులైన కీళాత్తూరు శ్రీనివాసాచార్యులు గారు తెలుగులోనికి అనువదిస్తే ‘మహా భగవద్గీత’ పేరుతో తిరుపతికి సమీపంలో గల ఏర్పేడు ఆశ్రమం వారు ప్రచురించారు. త్రిమతాచార్యుల అభిప్రాయాలతో ఈ గీత కూడా చాలా బావుంటుంది. దీని ఖరీదు  Rs.125/-

తరువాత నన్నాకట్టుకున్న పుస్తకం ఉత్తర భారతదేశానికి చెందిన జయదయాళ్ గోయందకా గారు హిందీలో ‘శ్రీమద్భగవద్గీత-తత్త్వవివేచనీ వ్యాఖ్య’ పేరుతో ఓ గ్రంథాన్ని రచించాడు. దానిని గీతా ప్రెస్ వారు తెలుగులోకి అనువదించి, ప్రచురించి Rs.80/-లకే అందిస్తున్నారు. ఈ గీతలోని వివరణ అరటిపండు వలిచి చేతిలో పెట్టినట్లుగా ఉంటుంది. మిగతా గీతలలోని వివరణకన్నా ఈ గీతలోని వివరణ చాలా విశిష్టత కలిగినది. ఒక శ్లోకంలో చెప్పిన విషయం గీతలో మరెక్కడెక్కడ ఏఏ విధంగా చెప్పబడిందీ మొదలైన వివరాలతో చాలా ఆసక్తికరంగా ఉంటుంది.

..ఇవీ నాకు తెలిసిన, నేను చదివిన పెద్ద భగవద్గీతా గ్రంథాలు.

ఇప్పుడు మధ్యస్థాయి గ్రంథాలు చూద్దాం. ఇవీ చాలా ఉన్నాయి. కానీ నన్ను ఆకట్టుకున్న పుస్తకం మాత్రం ఒకే ఒకటి. శిష్ట్లా సుబ్బారావు గారు రాసిన శ్రీమద్భగవద్గీత. ఇది తిరుమల తిరుపతి దేవస్థానం వారి ప్రచురణ. మొదట్లో దీని ఖరీదు  Rs.1/- మాత్రమే. ఇప్పుడు Rs.15/-చొప్పున విక్రయిస్తున్నారు. ఇది T.T.D. వారి ఆస్థాన గ్రంథమంటే నమ్మండి. అంత ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది T.T.D. ఈ గ్రంథాన్ని. శిష్ట్లా సుబ్బారావు గారు మంచి ఆధ్యాత్మిక దృష్టితో, భక్తిభావంతో చాలా చక్కగా, గీత గురించి పరిచయంలేని వారికి కూడా అర్థమయ్యేటట్లుగా గీతార్థాన్ని వివరించారు. నేను మొట్టమొదట  చదివిన గీత ఇదే.

ఇక తరువాత శ్లోకానికి కేవలం తాత్పర్యం మాత్రమే ఉండే చిన్నసైజు గీతా గ్రంథాలు కూడా చాలా ఉన్నాయి. వాటిలో నేను చదివినది, నాదగ్గర ఉన్నది రావుల సూర్యనారాయణ మూర్తి గారు రచించినది. ఇది కూడా T.T.D. వారి ప్రచురణే. ఇది ఇప్పుడు లభ్యమవుతున్నట్లుగా నేను గమనించలేదు. కేవలం తాత్పర్యం మాత్రమే ఉండే పుస్తకమే గనుక వీటిలో ఒక పుస్తకానికి మరోపుస్తకానికి పెద్ద తేడా ఏమీ ఉండదు.

గీతార్థ వివరణ కొరకు కొన్ని పుస్తకాలు చదివిన మీదట నేనో విషయాన్ని గ్రహించాను.  ఎవరి అర్థవివరణ వారిదే, ఏ ఒక్కరి అభిప్రాయం మిగతావారి అభిప్రాయం తో కలవటం లేదని గ్రహించాను. దాని మీదట నేను ఈ గీతార్థాలను వివరించే పుస్తకాలన్నింటినీ మానేసి కేవలం తాత్పర్యం మాత్రం ఉండే ఈ ఒక్క పుస్తకానికే చాలాకాలంపాటు పరిమితమయ్యాను. నా అర్థాలేవో నేనే వివరించుకోవచ్చులే అనుకున్నాను. అలాగే నాకు తోచిన అర్థాలలో కొన్నింటిని నా ‘శంఖారావం’ బ్లాగులో “భారతదేశానికి ఎటువంటి వ్యవస్థ కావాలి..?!” వ్యాసావళిలో (రెండవ అధ్యాయంలో) మీకు వివరించడం జరిగినది.

ఇక కేవలం శ్లోకాలు మాత్రమే ఉండే ‘పారాయణ గీత’ గురించి వివరించడానికేమీ లేదు.

చివరగా గీతార్థాన్ని వివరించే పుస్తకాలలో ఒక విశిష్టమైన పుస్తకాన్ని మీకు పరిచయం చేస్తాను. ఇది కూడా T.T.D. వారి ప్రచురణే. రచయిత S.B. రఘునాథాచార్య గారు. ఇది ఎంతటి ప్రజాదరణ పొందినదో చెప్పలేము. దానిపేరు ‘మన సమస్యలకు భగవద్గీత పరిష్కారాలు’. ఇందులోని వివరణ గీతలోని అధ్యాయాల క్రమంలోగానీ, శ్లోకాల క్రమంలోగానీ ఉండదు. మనలో ఎక్కువ మందికి తరచూ వచ్చే సందేహాలు, ఎదురయ్యే సమస్యలు.. మొదలైన వాటికి గీతలో ఎటువంటి పరిష్కారం, సమాధానం సూచించబడిందో సంక్షిప్తంగా తెలియజేస్తుంది. ఇది కూడా చిన్న గ్రంథమే. ఓ వందపేజీలుంటుంది. దీనిలో గీతలోని ప్రతి శ్లోకమూ ఉండదు. ఏవో కొన్ని శ్లోకాలు మాత్రమే ఉంటాయి. దాని ఖరీదు అప్పట్లో Rs.1/-ఉండేది. ఇప్పుడు Rs.6/-

చివరిగా పై పుస్తకాలన్నీ దొరికే ప్రదేశాల గురించి చెప్పుకుందాం. గీతా ప్రెస్ పుస్తకాలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో 1 వ నంబరు ప్లాట్‌ఫాం మీద వారి స్టాల్ ఉన్నది. కాచీగూడలోని బాలసరస్వతీ బుక్ డిపోలో కూడా గీతా ప్రెస్ వారి పుస్తకాలు దొరుకుతాయి. ఈ బాలసరస్వతీ బుక్ డిపోలోనే గీతామకరందం, మహా భగవద్గీత కూడా దొరికే అవకాశం ఉంది. ఇక ఇస్కాన్ వారి గ్రంథానికి నాంపల్లి లోని వారి టెంపుల్ లో వారి స్టాల్ ఉన్నది. T.T.D. వారి గ్రంథాలు అనేక పట్టణాలలో ఉన్న వారి కళ్యాణ మండపాలలో ఉన్న వారి స్టాల్స్ లో దొరుకుతాయి. ఇంకా విశాలాంధ్రలో, మామూలు బుక్ స్టాల్స్‌లో కూడా ప్రయత్నించవచ్చు. తిరుమల వంటి పుణ్యక్షేత్రాలలో అయితే వాళ్ళ ప్రచురణలు విక్రయించే స్టాల్స్‌తోపాటు గీతాప్రెస్స్ వంటి ఇతరుల స్టాల్స్ కూడా ఉంటాయి.

మంచి పుస్తకం-Power, Seduction and War (by Robert Greene)

సాధారణంగా ‘లౌక్యం, వ్యవహార దక్షత లాంటి విషయాలనూ, ఎత్తుకు పై ఎత్తు వేసే నైపుణ్యం, వ్యూహ ప్రతివ్యూహాలను పన్నే చాణక్యం.. వంటి విషయాలనూ మాటలలో వివరించడం సాధ్యంకాదు. వాటిని స్వయంగా, అనుభవపూర్వకంగా ఎవరికివారు తెలుసుకోవలసినదే’ అనే అభిప్రాయం ఉన్నది. కానీ రాబర్ట్ గ్రీన్ (Robert Greene) అనే అమెరికన్ రచయిత చాలా నేర్పుగా, అరటి పండు వలిచి చేతిలో పెట్టినట్లుగా ఆ పరిజ్ఞాన్నంతా మనకు బోధించాడు. Power, Seduction, War అంటూ ఈయన ఆ పరిజ్ఞానాన్నంతా మూడు విభాగాలుగా చేశాడు. ఒక్కొక విభాగానికి ఒక్కొక గ్రంథం చొప్పున మూడు గ్రంథాలు రచించాడు.

మొదటి విభాగమైన Power గురించి వివరించడానికి The 48 Laws of Power అనే గ్రంథం రాశాడు. మనం ఎదుటివారి మీద upper hand సాధించడానికి ఏ విధమైన లక్షణాలను కలిగి ఉండాలి, ఏవిధంగా వ్యవహరించాలి  అనే విషయాలను మొత్తం 48 సూత్రాల రూపంలో పొందుపరస్తూ ఈ పుస్తకం రాశాడు. ఈ పుస్తకం యొక్క సారాంశాన్ని అంటే ఈ 48 సూత్రాల యొక్క వివరణనూ క్లుప్తంగా నేను నా సుధర్మ బ్లాగులో అందించాను. (ఒక్కొక సూత్రానికి ఒక టపా చొప్పున)

రెండవ గ్రంథం  The Art of Seduction. ‘వశీకరణం’- అంటే ఎదుటిమనిషిని లోబరచుకోవడం- గురించి దీనిలో చర్చించాడు. Sex, Wealth, Power or Favor.. ఇలాంటి వాటిని ఎదుటివారి నుండి పొందటం కొరకు ఏ విధమైన పద్దతులను అవలంబించాలో, ఎలా ప్రవర్తించాలో ఇందులో విపులంగా వివరించాడు.

ఇక మూడవ గ్రంథం The 33 Strategies of War . మన ప్రత్యర్థిని అమాయకుడిగా, మన victim గా భావిస్తూ The 48 Laws of Power ను రూపొందించడం జరిగినది. కానీ మన ప్రత్యర్థి మనలాగే Power Player అయిన పక్షంలో అతని మీద మనం ఏ విధంగా upper hand సాధించాలి అనే దాన్ని వివరించడానికి ఈ The 33 Strategies of War  అనే గ్రంథం రాశాడు.

ఈ మూడు గ్రంథాలూ సాధారణమైన వ్యక్తిత్వ వికాస గ్రంథాల్లా ఉండవు. పాజిటివ్ యాటిట్యూడ్, టైం మేనేజ్‌మెంట్, గోల్ సెట్టింగ్ ..ఇలా ఉండదు వివరణ. చరిత్రలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందించబడిన నియమాలు, సూత్రాలతో (Laws and Principles) వివరణ అత్యంత ఆసక్తికరంగా ఉంటుంది. These all principles are timeless and ruthless.

ఇవి శ్రీరంగ నీతులు అసలేకావు. పైగా అందుకు విరుద్ధమైనవి. సాధారణంగా మంచితనం, మానవత్వం, నిజాయితీ, మర్యాద-మన్నన, సత్యవాక్పరిపాలన, అపకారికి కూడా ఉపకారం చేయడం.. ఇలాంటి “సలక్షణాల”ను మనం ఉన్నత విలువలుగా భావిస్తుంటాం. కానీ ఈ గ్రంథాలు చదివిన తరువాత ఈ లక్షణాలన్నీ మనలను ఏ విధంగా బలహీనులుగా మారుస్తున్నాయో; మనలోని ఈ విధమైన లక్షణాలను ఆసరాగా చేసుకుని కొందరు ఏ విధంగా మన మీద పెత్తనం చెలాయిస్తున్నారో కొందరైతే మనలను ఏ విధంగా అణచివేతకు గురిచేస్తున్నారో, ఏ విధంగా మన వినాశనానికి కారణమౌతున్నారో మనకు బోధపడుతుంది.

రచయిత మనకు బోధించే విషయాలు ఒక్కోసారి కుట్రలు, కుతంత్రాల రూపంలో ఉంటాయి. కానీ మనం ఒక విషయాన్ని గ్రహించాలి. మనం ఉన్నత విలువలు అని వేటినైతే భావిస్తున్నామో అవి నిస్సందేహంగా ఉన్నతమైనవే. కానీ అవి సత్తెకాలంలో మాత్రమే ఆచరించదగినవి. కుట్రపూరితమైన నేటి కాలంలో అవి మనలను బలి పశువులుగా మార్చడానికి తప్ప దేనికీ పనికిరావు. శ్రీరంగనీతుల నుండి ఒక్కక్షణం బయటపడి వాస్తవికతతో ఆలోచిస్తే మనకు బోధపడే విషయం ఇదే. ముఖ్యంగా సత్తెకాలపు శ్రీరంగనీతులు ఉన్నత విలువలుగా భావించబడే భారతదేశంలో ఈ గ్రంథాల పఠనం అత్యంత ఆవశ్యకం.

గుంటనక్కలు, తోడేళ్ళు సంచరించే ఈ లోకంలో మోసాలు, కుట్రలు, కుతంత్రాలు ఇటువంటి మర్మాలేవీ తెలియకుండా అంతా భగవంతుడే చూసుకుంటాడనుకునే భక్తితత్త్వ ధోరణితో అమాయకంగా ఉంటే మంచివాళ్ళం, గంగిగోవులం  అనిపించుకుంటామేమోగానీ ఆ మోసాలు, కుట్రలు, కుతంత్రాలు చేసేవారికి మనం బలైపోకుండా మనలను ఆ భగవంతుడుకూడా రక్షించలేడు.

The Art of Seduction గ్రంథంలో సాధారణ సభ్య సమాజం అంగీకరించని ఎత్తుగడలను రచయిత చాలా వాటినే వివరిస్తాడు. అయితే మనం ఈ విషయాలన్నింటినీ తెలుసుకునేది వాటిద్వారా అమాయకులను బలితీసుకోవాలని కాదు. స్వయంగా మనం ఈ గుంటనక్కలు, తోడేళ్ళ బారిన పడి బలై పోకుండా డిఫెన్స్ చేసుకోవడం కోసం మాత్రమే. అందుకొరకైనా మనం వాటి గురించిన పరిజ్ఞానం పొందాలి. మనకు ఇంకా అవకాశం ఉంటే మనలను మనం రక్షించుకోవడమే కాకుండా అమాయకులెవరైనా ఈ తోడేళ్ళబారిన పడకుండా రక్షించనూవచ్చు. ఆ విధంగా మనం హీరోగా కూడా మారవచ్చు. అంటే ‘హీరో’ అవాలంటే ముందుగా ‘విలనీ’ ని అధ్యయనం చేయాలి. లేదంటే ఎవరో ఓ విలన్‌కు బలైపోయి మనలను రక్షించే హీరో కోసం ఎదురుచూసే అమాయక, అనామక victim గా మిగిలిపోక తప్పదు.

ఇంతకుముందు చెప్పినట్లుగా ఈ మూడు పుస్తకాలనూ కూడా రచయిత కొన్ని సూత్రాల లేక నియమాల (Laws and Principles) విపులీకరణ  రూపంలో రచించాడు. ఆ నియమాలన్నింటినీ సాధారణ చరిత్ర గ్రంథాలలో లభ్యంకాని అనేక సూక్ష్మ చారిత్రక ఘటనల ద్వారా వివరిస్తూ, అనేక మంది చారిత్రక వ్యక్తులను పరిచయంచేస్తూ, వారి గుణగణాలనూ, వారి వ్యూహ ప్రతివ్యూహాలనూ, ఎత్తుగడలనూ, వారు జీవితంలో సాధించిన విజయాలనూ, పొందిన వైఫల్యాలనూ, వాటికి కారణాలనూ అత్యంత ఆసక్తికరంగా విపులీకరించాడు.

ఒక్కొక్క పుస్తకం షుమారు 450 పేజీలు ఉంటుంది. ఒక్కొక్క దాని ఖరీదు షుమారు Rs.400/- ఉంటుంది. The 48 Laws of Power కు, The Art of Seduction కు concise editions కూడా ఉన్నాయి. వాటి ఖరీదు ఒక్కొక్కటి Rs.125/-

నాకు తెలిసినంతవరకూ ఈ గ్రంథాలకు పైరేటెడ్ కాపీలు లేవు. కనుక పుస్తకాలు కారు చవకగా దొరికే మన అబిడ్స్ సండే మార్కెట్లో ఇవి దొరకక పోవచ్చు. హైదరాబాద్‌లో అయితే హిమాలయా బుక్ షాప్ వంటి చోట్ల దొరుకుతాయి. వైజాగ్ లో అయితే పేజెస్, జ్యోతి, గుప్తా బ్రదర్స్, బుక్ సెంటర్, వాగ్దేవి లాంటి చోట్ల దొరుకుతాయి. ఇవి విశాలాంధ్రలో కూడా దొరుకుతున్నాయి.

ఈ గ్రంథాలను చదవడం ద్వారా తెలుసుకున్న విషయాలతో పోలిస్తే వీటిని కొనడానికి మనం పెట్టిన డబ్బు, చదవడానికి మనం పడిన శ్రమ, కేటాయించిన సమయం చాలా స్వల్పమే అని గ్రహిస్తారు. ఈ పుస్తకాలను చదివిన తరువాత మీరు ఒక చాణక్యుడు, ఒక మాకియవెల్లి, ఒక sun-tzu అయిపోతారంటే నమ్మండి. :b.

మంచి పుస్తకం-సాధన రహస్యము (అనుభవానంద స్వామి)

భారత దేశపు తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ చిన్న వయసులోఉన్న తన కుమార్తెకు జైలు నుండి అనేక ఉత్తరాల ద్వారా  ప్రపంచ చరిత్రను పరిచయం చేశాడు. ఆ ఉత్తరాలన్నీ గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ పేరుతో ఒక గ్రంథంగా ప్రచురింపబడ్డాయి. ఇది ఆంగ్ల సాహిత్యం లో ఒక గొప్ప గ్రంథంగా పరిగణింపబడుతున్నది. అలాగే మన తెలుగు సాహిత్యంలో కూడా ఇటువంటి గ్రంథమే ఒకటి ఉన్నది. అనుభవానంద స్వామి (1908-73) పిన్న వయసులో ఉన్న తన శిష్యురాలు మాతాజీ త్యాగీశానంద పురీ కి ఆథ్యాత్మిక మరియు సాధనా సంబంధమైన విషయాలను తెలియజేయటానికి 1946 లో అనేక ఉత్తరాలు రాశారు. ఆ ఉత్తరాలన్నీ సాధన రహస్యము అనే గ్రంథంగా ప్రచురింప బడ్డాయి.

అనుభవానంద స్వామి 1908 లో గుంటూరు జిల్లా అమృతలూరులో జన్మించారు. ఈయన ఉన్నత విద్యాభ్యాసం చేసిన మేధావి. బహుముఖ ప్రజ్ఞావంతుడు. రచనలే కాక కవిత్వం, చిత్రకళ, వడ్రంగం, శిల్పం, సంగీతం ఇత్యాది వాటన్నింటిలో ప్రవేశమేకాక ప్రావీణ్యత కూడా ఉన్నది. కళాశాలలో చదివే రోజులలో అనేక బంగారు పతకాలు కూడా సాధించాడు. ఈయన సృష్టించిన కళా ఖండాలు నేటికీ పదిలంగా ఉన్నాయి. ఈయన భారత దేశమంతటా పర్యటించిన పరివ్రాజకుడు. సుధీర్ఘ కాలం అనేక కఠిన సాధనలు చేసిన సాధకుడు. మంచి వక్త. ఆంగ్ల భాషలో ప్రావీణ్యం కలిగిన వాడు.

ఈయన రామకృష్ణ పరమహంస చూపిన  మార్గంలో సన్యసించి తన  జీవితాన్ని కొనసాగించాడు. ఈయన ప్రాచీన భారతీయ సాహిత్యాన్ని అంటే వేదాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు, దర్శనాలు మొదలైన వాటన్నింటినీ మధించి వాటిని ప్రజలకు సుబోధకంచేస్తూ విస్తృతమైన  సాహిత్యాన్ని సృజించాడు. తన సాహిత్యాన్ని అనుభవానంద గ్రంథ మాల ద్వారా ప్రజలకు అందించాడు. బాపట్ల మరియు భీమునిపట్నంలలో ఈయన ఆశ్రమాలను నెలకొల్పాడు.

ఈయన రచనలలో ప్రధానమైనది  భారతీయ ఆథ్యాత్మిక విజ్ఞానానికి ఎన్ సైక్లోపీడియా అనదగిన సర్వసిధ్దాంత సౌరభం అనే గ్రంథం. ఈ  గ్రంథాన్ని ఈయన 12 సంపుటాలలో రచించారు. ఇందులో షడ్దర్శనాలనూ మరియూ అద్వైతం, విశిష్టాద్వైతం, వైష్ణవం, శైవం, శాక్తేయం, బౌధ్దం మొదలైన అన్ని సిధ్దాంతాలనూ విస్తృతంగా చర్చించారు. ఐతే ఈ గ్రంథం పండిత స్థాయిలో ఉంటుంది. కానీ మనం ప్రస్తుతం తెలుసుకుంటున్న సాధన రహస్యం అనే గ్రంథం మాత్రం సామాన్య పాఠకులందరికీ అర్థమయ్యేటట్లుగా ఉంటుంది.

తన శిష్యురాలికోసం రాసిన ఈ ఉత్తరాలలో అనుభవానంద స్వామి చాలా సులువైన వ్యావహారిక భాషను ప్రయోగించారు. ఆవిడ చిన్న వయసులో ఉన్నపుడు, సాధనా మార్గంలోకి రాకపూర్వం ఆవిడకు ఆథ్యాత్మిక సాధనా సంబంధమైన విషయాలను పరిచయం చేయటానికి ఈ ఉత్తరాలు ఉద్దేశింపబడినవి కనుక వీటిలో ఆయన సులభమైన శైలిని ఉపయోగించారు. ఈ కారణం చేతనే సాధారణ పాఠక లోకంలో ఈ గ్రంథం చాలా ప్రాచుర్యం పొందినది.

ఈ గ్రంథంలో అనుభవానంద స్వామి కర్మ, జ్ఞాన, రాజ, భక్తి యోగాలతోపాటు వివేక వైరాగ్యాది సాధనా చతుష్టయాన్ని గురించి పామరులకు సైతం అర్థమయ్యే విధంగా విపులంగా చర్చించారు. ఈ గ్రంథం అనేక భారతీయ భాషలతోపాటు ఫ్రెంచ్, జర్మన్ లాంటి పాశ్చాత్య  భాషలలోకి కూడా అనువదింపబడింది. భారతీయ ఆథ్యాత్మిక విషయాలలోని అర్థంకాని సంక్లిష్ట విషయాల జోలికి పోకుండా ఒక సాధారణ వ్యక్తికి ఆయా విషయాల యొక్క ప్రథమ పరిచయానికి తగినట్లుగా ఈ గ్రంథం వ్రాయబడినది కనుక ఇది ప్రతి ఒక్కరూ చదువదగిన గ్రంథం.

స్వామి అనుభవానంద యోగ కేంద్ర, భీమునిపట్నం-522163, విశాఖపట్నం జిల్లా ను గానీ లేక శ్రీ అనుభవానంద గ్రంథమాల, యం.జి.రోడ్,బాపట్ల-522 101,గుంటూరు జిల్లా ను గానీ సంప్రదించి  ఈ పుస్తకాన్ని పొందవచ్చు. సాహిత్యానికేతన్ లాంటి హిందూ మత సాహిత్యం దొరికే బుక్ స్టాల్స్ లో కూడా ఈ గ్రంథం దొరుకుతుంది.

మంచి పుస్తకం-పాంచజన్యం (మాధవ సదాశివ గోల్వల్కర్)

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లేక సంక్షిప్తం గా ఆర్.యస్.యస్. దీనిని  గురించి తరచూ మనం పత్రికల లో చదువుతూ ఉంటాం. వివిధ రాజకీయ పార్టీల నాయకుల  ఉపన్యాసాల ద్వారా మరియు స్టేట్ మెంట్ల ద్వారా కూడా దీనిని  గురించి తెలుసుకుంటూ ఉంటాం. వీరిలో ఆర్.యస్.యస్.ను ఒక హిందూ మత వాద చాంధస సంస్థగా విమర్శించే వారే ఎక్కువ. దీనివలన మనకు కూడా ఆర్.యస్.యస్. గురించి ఒక నెగెటివ్ ఫీలింగ్ ఏర్పడే అవకాశం ఉంది.

జిజ్ఞాసువులు, గ్రంథ పఠనాభిలాష కలిగినవారు ఈ సిద్దాంత విభేదాలకు లోనవ్వ కూడదు. ఒక వేళ మనకు స్వంత అభిప్రాయాలున్నా కూడా వాటిని పుస్తకాల మీద చూపించకూడదు. వివిధ వాదాలను తెలిపే పుస్తకాలన్నింటినీ చదవాలి.అపుడే మనకు సరి ఐన దృక్పథం అలవడుతుంది. ఆసక్తి ఉంటే ఏ గ్రంథమైనా చదువవచ్చు. కేవలం సిద్దాంత విభేదాలతో ఒక గ్రంథాన్ని చదాలన్న ఆసక్తిని అణచుకోకూడదు.

ఏదేని ఒక విషయం గురించి తెలుసు కోవటం తప్పనిసరి అయినపుడు సరైన పద్దతిలో తెలుసుకొని దాని గురించి మన స్వంత అభిప్రాయాన్ని ఏర్పరచుకోవటం అన్నివిధాలా మంచిది. ఆలా మనం ఆర్.యస్.యస్. గురించి తెలుసుకోవాలనుకుంటే  ‘పాంచజన్యం ‘ అనే ఈ గ్రంథాన్ని చదవటం సరి అయిన పని. దీని ఆంగ్ల మూలం పేరు ‘బంచ్ ఆఫ్ థాట్స్ ‘. దీని హిందీ అనువాదం పేరు ‘విచార్ ధన్ ‘. ఇది ఆరేడు వందల పేజీల ఉద్గ్రంథం. ఆర్.యస్.యస్. వర్గాలకీ గ్రంథం బైబిల్ లాంటిది. ఈ గ్రంథం ఎవరూ రచించినది కాదు. ‘గురూజీ ‘ గా సుప్రసిద్దులైన మాధవ సదాశివ గోల్వల్కర్ ఆర్.యస్.యస్.కు సర్ సంఘ్ చాలక్ గా ఉన్న 33 సంవత్సరాల (1940-1973) సుదీర్ఘ కాలం లో చేసిన అనేక ఉపన్యాసాలలోని ముఖ్యమైన విషయాలను, ఆర్.యస్.యస్. భావజాలాన్ని ప్రతిబింబించేటట్లుగా ఏర్చికూర్చి చేసిన సకలనం ఈ గ్రంథం.

ఆర్.యస్.యస్. అనే మొక్కను హెడ్గేవార్ నాటితే, ఆ మొక్కను గోల్వల్కర్ చెట్టు గా పెంచారు. దేవరస్ ఆ చెట్టును వట వృక్షంగా పెంపొందించారు అని తెలిసిన వారు అభివర్ణిస్తారు. ఈ ముగ్గురిలో కూడా గోల్వల్కర్ విశేష ఖ్యాతి నార్జించారు. ఆర్.యస్.యస్. కు పటిష్ఠమైన  పునాదులేర్పరచి దానిని చిరకాలం నిలచి ఉండే సంస్థగా తీర్చిదిద్దారు. ఆ సంస్థ నుండి పుట్టిన ఒక శాఖ ఐనటువంటి  బి.జె.పి. పార్టీ భారతదేశాన్ని పాలించే స్థాయికి ఎదిగినదంటే ఆ సంస్థకు ఎంతటి  బలమైన పునాది ఉన్నదో, ఆ సంస్థ వెనుక ఎంతటి పవిత్ర సంకల్ప శక్తి దాగి ఉన్నదో మనం ఊహించికోవచ్చు.

ఈ గ్రంథం ద్వారా ఆర్.యస్.యస్. గురించి ,  దాని మౌలిక భావజాలం గురించి ,‘హిందూ రాష్ట్ర ‘ సిద్దాంతం గురించి మనం ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు. ఆర్.యస్.యస్.,విశ్వ హిందూ పరిషత్ మొదలైన సంస్థలు తమ భావ ప్రచారానికి గాను గ్రంథాలను ప్రచురించటానికి, విక్రయించటానికి ‘సాహిత్యానికేతన్ ‘ అనే సంస్థను ఏర్పాటు చేశాయి. హైదరాబాదు లోని బర్కత్ పురా లో మరియు విజయవాడ లోని ఏలూర్ రోడ్ లో  సాహిత్యానికేతన్ విక్రయశాలలు ఉన్నాయి. ఆక్కడ ఈ పాంచజన్యం గ్రంథం లభించగలదు.

మంచి పుస్తకం-సత్యాన్వేషి చలం (డా.వాడ్రేవు వీరలక్ష్మీ దేవి )

చలం తన జీవితకాలంలో ఎంతో సాహిత్యాన్ని సృజించాడు. అదంతా ఒక సాగరం . ఈ రచనలో  ఆ సాగరాన్ని ఒడిసి పట్టారు రచయిత్రి వాడ్రేవు వీరలక్ష్మీ దేవి .

ఈవిడ చాలా  ఉత్తమాభిరుచి కలిగిన రచయిత్రి. చలం మీద ఇదొక సిద్ధాంత గ్రంథం, ఇదొక ఫరిశోధనా గ్రంధం. చలం అంటే ఎనలేని గౌరవం, అభిమానం కలిగిన వారు ఆంధ్రదేశం లో ఎందరో ఉన్నారు. వారిలో ఈవిడ కూడా ఒకరు.

‘చలం సాహిత్యం లో ఏ ఒక్క పుస్తకమో చదివితే చలం గురించి, చలం భావాల గురించి ఏమీ అర్థం కాదు. పైగా  అది చలం గురించి అనేక అపార్థాలకే దారి తీస్తుంది. ఆయనను విమర్శంచే వారిలో ఎక్కువమంది ఈ కోవకు చెందినవారే. చలాన్ని సరిగా అర్ధం చేసుకోవాలంటే అయన రచనలను అన్నింటినీ అధ్యయనం చేయాలి. అప్పుడే చలం తన జీవితమంతా నిరంతర సత్యాన్వేషణ నెరపాడనే విషయం మరియు ఈ అన్వేషణలో ఆయన కాలనుగుణంగా  క్రమపరిణామం చెందాడనే విషయం మనకు బోధపడుతుంది ‘ అన్న విషయాన్ని రచయిత్రి నిరూపించిన విధానం నిరుపమానం. రచయిత్రి అసమాన ప్రతిభను కనపరిచారు.

చలం గురించి ఎటువంటి అపార్థాలకూ తావు లేకుండా ఆయనను, ఆయన భావాలను సరిగా అర్థం చేసుకోవటానికి ఆవిడ మన తరపున చలం సాహిత్యాన్నంతా చదివి, అర్థం చేసుకుని మనకు దాని సారాన్ని అందించారేమో అనే భావన మనకు కలుగుతుంది. ఒకరకంగా తన జీవితమంతా స్త్రీ స్వేచ్చ గురించే సాహితీ యుద్ధం చేసిన చలానికి స్త్రీ జాతి తరఫున రచయిత్రి అందించిన నివాళిగా ఈ రచనను మనం భావించవచ్చు. రచనా ప్రమణాలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. ఈ గ్రంథం చదివిన తరువాత మనకు చలం జీవితం తోపాటు ఆయన సాహిత్యమంతటి యెడల, ఆయన భావాల యెడల పూర్తి అవగాహన కలుగుతుంది.

ఇది 285 పేజీల గ్రంధం. వెల రూ.125/-  ఈ పుస్తకం  ‘విశాలాంధ్ర ‘ లో లభిస్తున్నది. చలం రచనలు ప్రచురించే ‘అరుణా పబ్లిషింగ్ హౌస్ ‘, విజయవాడ వారిని సంప్రదించైనా ఈ పుస్తకాన్ని పొందవచ్చు.

మంచి పుస్తకం-యం.యన్.రాయ్ స్వీయ గాథలు (ఆత్మ కథ)

గాంధీ, నెహ్రూ, బోస్ మొదలైన వారి గురించి తెలిసినంతగా యం.యన్.రాయ్ గురించి ప్రజా బాహుళ్యానికి తెలియదు. ఈయన ఒక మహానాయకుడు. అత్యంత ప్రతిభావంతుడు. ఈయన ఆత్మకథ స్వీయగాథలు మేథావి వర్గం లో సుప్రసిద్ధం. ఇది కొంచెం పెద్ద గ్రంథమనే చెప్పాలి. ఈ గ్రంథం విశిష్టత ఏమిటంటే యం.యన్.రాయ్ తన బాల్య జీవితం గురించి ప్రస్తావించక పోవటం. ఒకేసారి తన క్రియాశీల జీవితం మొదలైన దగ్గర నుండే రాయ్ ఈ స్వీయ గాథలను ప్రారంభించారు. బాల్య జీవితం తన వ్యక్తిగతమైనది. దానితో ప్రజలకు పనిలేదు. తన ప్రజా జీవితం గురించి మాత్రమే ప్రజలకు తెలియజేయలనేది రాయ్ అభిప్రాయం.

ఈ గ్రంథం చదివేకొలదీ రాయ్ తన జీవితంలో చేసిన సాహసాలు, సాధించిన విజయాలను తెలుసుకుని మనకు అబ్బురం కలుగుతుంది. రాయ్ చాలా సులువైన శైలిలో, ప్రతి విషయాన్నీ సునిశితంగా వివరిస్తూ, అత్యంత ఆసక్తికరమైన రచనా శైలితో ఈ గ్రంథాన్ని రచించారు.

రాయ్  బెంగాల్ లో జన్మించారు. ఈయన అసలు పేరు నరేంద్ర నాథ్ భట్టాచార్య. తరువాత పరిస్థితులననుసరించి ఒకసారి మానవేంద్ర నాథ్ రాయ్ గా పేరు మార్చుకోవలసి వచ్చింది.అదే పేరు స్థిరపడిపోయి యం.యన్.రాయ్ గా ఈయన సుప్రసిద్దులయ్యారు.

యువకుడుగా ఉన్న సమయంలో ఈయనొక విప్లవకారుడు. ‘వందేమాతర ఉద్యమ ‘ సమయంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా భారత దేశంలో ముఖ్యంగా బెంగాల్లో జనించిన  ఉగ్రవాదం వైపు మళ్ళిన అనేక మంది యువకులలో ఈయన కూడా ఒకరు. తన ఉగ్రవాద బృందానికి ఆయుధాలు సమకూర్చే నిమిత్తం ఈయన దేశం విడిచి పెట్టారు. ఆ విధంగా ఉగ్రవాదిగా విదేశాలకు చేరిన ఈయన జీవితం అనేక మలుపులు తిరిగి అంతర్జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పగలిగిన మేటి గా రూపొందారు. ఆ సమయంలో భారత దేశం లోని జనసామాన్యానికి దేశరాజకీయాలను నడిపిస్తున్న గాంధీ,నెహ్రూ వంటి నాయకులే తెలుసు. కానీ ఒక భారతీయ యువకుడు అంతర్జాతీయ రాజకీయాలను ప్రభావితం చేయగలిగేటంతగా ఎదిగాడని అతి కొద్ది మందికే తెలుసు.

రాయ్ మొదట అమెరికా నుండి మెక్సికో వెళ్ళి అక్కడ ఆశ్రయం పొంది ఆదేశ రాజకీయాలలో చురుకైన పాత్ర పోషించారు. ఆ సమయంలోనే రష్యా అధ్యక్షుడు లెనిన్ దృష్టిలో పడ్డారు. ఆయన పిలుపుతో రష్యా చేరుకుని అచటి రాజకీయాలలో మరియు అంతర్జాతీయ కమ్యూనిష్టు ఉద్యమ వేదిక ఐనటువంటి కమ్యూనిష్టు ఇంటెర్నేషనల్ (కొమింటర్న్) కార్యకలాపాలలో రాయ్ క్రియాశీల పాత్ర పోషించారు.

ఈయన గొప్ప రచయిత. ‘ఇండియా ఇన్ ట్రాన్సిషన్ ‘ మరియు ‘రెవల్యూషన్ అండ్ కౌంటర్ రెవల్యూషన్ ఇన్ చైనా ‘ అనే గ్రంథాలతో పాటు మరికొన్ని గ్రంథాలను కూడ రచించారు. రాయ్ రచనలు అనేక యూరోపియన్ భాషలలోకి అనువదింపబడి ఆయా దేశాలలో ప్రభంజనాన్ని సృష్ఠించాయి. రాయ్ గొప్ప రచయిత మాత్రమే కాదు, బహుభాషా కోవిదుడు కూడా. ఏ కొత్త భాషైనా ఈయన ఒక నెలలోపే నేర్చుకోగలిగేవాడని ప్రతీతి.లెనిన్ లాంటి మహానాయకుడు రాయ్ అభిప్రాయాలకు ఎనలేని ప్రాధాన్యత ఇచ్చేవాడు. లెనిన్ మరణానంతరం స్టాలిన్ గద్దె నెక్కడంలో రాయ్ కీలక పాత్ర పోషించాడు. భారత కమ్యూనిష్టు పార్టీని స్వదేశంలో ఇంకా స్థాపించక ముందే ఈయన తాష్కెంట్లో స్థాపించాడు. భారతదేశంలోని బ్రిటిష్ పాలనను పారద్రోలటానికి రష్యా సహాయంతో అనేక ఆయుధాలతో, పెద్ద  సైనిక బలగంతో దేశం మీదికి దండెత్తాలని ఈయన బయలుదేరాడు. కానీ ఆ ప్రయత్నం మార్గమధ్యంలోనే విఫలమైనది.

తన జీవితంలో అధికభాగం కమ్యూనిష్టుగా గడిపిన రాయ్ చివరి కొద్ది కాలం కమ్యూనిజాన్ని వ్యతిరేకించి హ్యూమనిజం అనే నూతన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అందుకే నేటి కమ్యూనిష్టులు రాయ్ ను తమ నాయకుడిగా చెప్పుకోరు. అలానే ఆయన భారత స్వాతంత్ర్య ఉద్యమంలో కన్నా అంతర్జాతీయ రాజకీయాలలోనే ఎక్కువ కృషి చేయటంతో కాంగ్రెస్ నాయకులూ రాయ్ ను తమ వాడిగా చెప్పుకోరు. అందుకే రాయ్ ప్రజల మనిషిగా కాక మేథావుల మనిషిగానే మిగిలిపోయారు.

ఈయన స్వీయ గాథలను ఆంధ్ర దేశంలోని ఈయన అనుచరులు చాలా కాలం క్రిందట  తెలుగులోకి అనువదించి ముద్రించారు. దానిని గ్రంథాలయంలో సంపాదించి నేను చదవటం జరిగింది. భారత దేశ నాయకుల ఆత్మకథలలో మహాత్మా గాంధి ఆత్మకథ తరువాత తిరిగి అంతటి ప్రమాణాలు కలిగిన ఆత్మకథగా దీనిని చెప్పుకుంటారు. మీకు ఆసక్తి ఉంటే గ్రంథాలయాలలో ప్రయత్నించండి.

మంచి పుస్తకం-గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ (జవహర్ లాల్ నెహ్రూ)

చరిత్ర అంటే బోర్ సబ్జెక్ట్. రాజవంశాలను,రాజుల క్రమాన్ని,వారందరి పేర్లను గుర్తు పెట్టుకోవాలి. ఏ యుద్ధం ఎప్పుడు జరిగినదో ఆయా సంవత్సరాలన్నింటినీ గుర్తుంచుకోవాలి. ఇంత బోర్ సబ్జెక్టు ను కూడా కొంతమంది ఆసక్తికరంగా చెప్పగలరు. వారిలో జవహర్ లాల్ నెహ్రూ ఒకరు.

ఈయన తన కుమార్తె ఇందిరకు భారతదేశ చరిత్ర తో పాటు ప్రపంచ చరిత్ర యెడల అవగాహన కలిగించాలని సంకల్పించారు. ఇందుకొరకు ఆయన జైలులో ఉన్నపుడు దొరికిన ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఆ సమయంలో ఆయన తన కుమార్తె కు రెండు మూడు రోజులకు ఒక ఉత్తరం చొప్పున మూడు నాలుగు సంవత్సరాలు నిరాటంకంగా వ్రాసారు. ఇవి మొత్తం 196 ఉత్తరాలు. ఈ జాబుల పరంపర 1930 వ సవత్సరం అక్టోబర్ నెలలో మొదలై 1933 ఆగస్ట్ వరకూ కొనసాగింది.

తదనంతర కాలంలో ఈ జాబులన్నీ గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ పేరుతో వేయి పేజీల ఒక పెద్ద గ్రంథం గా ప్రచురింపబడ్డాయి. ఆక్స్ ఫర్డ్  యూనివర్సిటీ ప్రెస్ వారు ఈ గ్రంథాన్ని చాలా కాలంపాటు సబ్సిడీ ధరకు అందించారు. ఐతే ఇటీవలి కాలంలో ఈ ప్రతులు మార్కెట్లో లభించుట లేదు. ప్రస్తుతం పెంగ్విన్ వారి ప్రతులే  అందుబాటులో ఉన్నయి. ఐతే అవి కొంచెం ధర ఎక్కువ. నెహ్రూ గారి రచన కనుక ఈ పుస్తకం ఏ గ్రంథాలయం లోనైనా లభించగలదు. ఈ ఉత్తరాలు  ఆంగ్ల భాషలో వ్రాయబడ్డాయి. ఐతే అవన్నీ పదమూడేళ్ళ వయసులో ఉన్న తన చిన్నారి కుమార్తెను ఉద్దేశించినవి కనుక నెహ్రూ వీటిలో చాలా సులువైన భాషనే ఉపయోగించారు. సాధారణమైన ఆంగ్ల భాషా పరిజ్ఞానం ఉన్నవారు సైతం వీటిని చదివి అర్ధం చేసుకోవచ్చు.

ఈ గ్రంథం చదివేటపుడు నెహ్రూలో మనకు ఒక అంతర్జాతీయ స్థాయి నాయకుడు కాక తన కుమార్తెను ఒక గొప్ప నాయకురాలిగా తీర్చిదిద్దాలని తపనపడే ఒక తండ్రి మాత్రమే  కనిపిస్తాడు. ఈ గ్రంథం ఏ మాత్రం విసుగనిపించదు. సంవత్సరాలను అవసరమైనంత మేరకే సాధ్యమైనంత తక్కువగా పేర్కొంటూ చరిత్రలో అసలేమి జరిగింది అన్నదానికే ప్రాధాన్యతనిస్తూ చాలా ఆసక్తికరంగా నెహ్రూ దీన్ని రచించారు. ఈ గ్రంథాన్ని చదివే కొలదీ ఇంకా ఇంకా తెలుసుకోవాలనే తపనను మనలో కలుగజేస్తూ ఉంటుంది.

జవహర్ లాల్ నెహ్రూ ఈ గ్రంథం తో పాటు తన ఆత్మ కథ ఐన యాన్ ఆటోబయోగ్రఫీ అనే గ్రంథాన్నీ  మరియూ భారత దేశ చరిత్రను,దాని యొక్క పురాతన వైభవాన్ని, దాని ఘన సంస్కృతిని మిగతా ప్రపంచానికి తెలియచేయాలనే ఉద్దేశ్యంతో డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే గ్రంథాన్నీ కూడా రచించారు. ఐతే ఈ మూడింటిలో ‘గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ ‘అనబడే ఈ గ్రంథమే అత్యంత ప్రజాదరణ పొందినది.

ఈ గ్రంథం చదివిన తరువాత ఎవరికైనా ప్రపంచ చరిత్ర గురించి పూర్తి అవగాహన కలుగుతుంది. ఒక్క భారతదేశ యువతకే కాక యావత్ ప్రపంచ దేశాలలోని యువత మొత్తానికీ ఉపయుక్తమయ్యే విధంగా ఈ ఉత్తరాలను రచించి నెహ్రూ ఒక అంతర్జాతీయ స్థాయి నాయకుడిగా తన స్థానాన్నీ,స్థాయినీ ఇనుమడింప చేసుకున్నారు.

« పాత టపాలు

Follow

Get every new post delivered to your Inbox.